ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే కొత్తవాళ్లను మొదలుకొని సీనియర్ స్టార్ సెలబ్రిటీల వరకు చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. అలాగే ప్రమోషనల్ వీడియోలు కూడా షేర్ చేస్తూ.. ఒకవైపు ఆర్థికంగా ఎదుగుతూనే.. మరొకవైపు అరుదైన రికార్డులు కూడా క్రియేట్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కూడా చేరిపోయింది. ఈమె చేసిన ఒక్క రీల్ ఏకంగా ప్రపంచ స్థాయి రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన రికార్డు అందుకుంది దీపిక పదుకొనే.
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా దీపికా పదుకొనే హిల్టన్ అనే హోటల్ యాడ్ కోసం పనిచేసింది. ఈ యాడ్ కు సంబంధించిన వీడియోని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అయితే ఈ రీల్ షేర్ చేసిన 8 వారాలలోనే.. ఏకంగా 1.90 బిలియన్ల(190 కోట్ల )వ్యూస్ వచ్చాయి. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ రాబట్టిన రీల్ గా రికార్డ్ సృష్టించింది. అయితే ఇప్పటివరకు ఈ రికార్డు హార్దిక్ పాండ్య (1.6 బిలియన్లు)పై ఉండేది ఇప్పుడు ఆ రికార్డును దీపికా పదుకొనే బ్రేక్ చేసింది. ఇకపోతే దీపిక పదుకొనేకి ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారుగా 80 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
ఇదిలా ఉండగా మరోవైపు ఈ అరుదైన రికార్డును అందుకోవడంతో దీపికాపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది ఫాలోవర్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక నెలలో రెండు బిలియన్ వీక్షణలు సాధించడం మామూలు విషయం కాదు అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే.. మరొక నెటిజన్ 1.9 బిలియన్ అంటే ఎంత? నేను మొదటిసారి బిలియన్ వీక్షణాలను చూశాను అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇంకొక అభిమాని ఇది కేవలం ఒక ఆడ్ మాత్రమే.. ఇక మీరే ఊహించండి.. ఒక ప్రకటనకే దీపిక ఇంత వైరల్ అయింది అంటే.. ఆమె నిజంగా ఎంత ఐకానిక్ అని ఆలోచించండి అంటూ.. ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మొత్తానికైతే దీపిక సాధించిన ఈ రికార్డుకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
చివరిసారిగా కల్కి 2898AD సినిమాలో కనిపించిన ఈమె.. ఈ సినిమా తర్వాత సింగం ఎగైన్ అనే సినిమాలో కూడా నటించింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకున్న దీపిక.. మళ్లీ వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తోంది. అందులో భాగంగానే అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న AA22xA6 సినిమాలో అవకాశం అందుకుంది.అలాగే షారుఖ్ ఖాన్,సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో వస్తున్న కింగ్ అనే సినిమాలో కూడా అవకాశం లభించింది. అలాగే బ్రహ్మాస్త్ర పార్ట్ 2 తో పాటూ కల్కి సీక్వెల్ లో కూడా దీపిక నటిస్తోంది.