దీపిక పదుకొనే వరుస తప్పిదాల గురించి చాలా చర్చ సాగుతోంది. బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ సినిమాల నుంచి దీపికను నిరభ్యంతరంగా మేకర్స్ తొలగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గొంతెమ్మ కోర్కోలు తీర్చలేక, కండిషన్లకు అంగీకరించలేక దర్శకనిర్మాతలు దీపికను తొలగించి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
సందీప్ వంగా- స్పిరిట్, నాగ్ అశ్విన్ – కల్కి 2898 ఏడి లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల నుంచి దీపికను తొలగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. “మీ కఠినమైన నియమాలతో మా షెడ్యూల్స్ సాగవు“ అని వైజయంతి మూవీస్ చాలా సూటిగానే తన నోట్ లో పేర్కొంది. ఈ రెండు పరిణామాల తర్వాత దీపిక పదుకొనేకు అత్యంత క్లోజ్ ఫ్రెండ్ అయిన ఫరాఖాన్ దూరమవ్వడంపైనా ఈరోజు ఆసక్తికర చర్చ మొదలైంది. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో దీపిక ఎనిమిది గంటల పనిదినం వ్యవహారంపై ఫరా ఖాన్ వ్యంగ్యంగా స్పందించింది. ఎనిమిది గంటల పాటు బిజీ అవ్వడం వల్ల మా షోకు దీపిక రాదు! అని ఫరా సెటైర్ వేసింది. దీంతో కోపగించుకున్న దీపిక సోషల్ మీడియాల్లో ఫరా ఖాన్ ని అనుసరించలేదని, ఆ తర్వాత ఫరా కూడా దీపికను అనుసరించడం మానేసింద(అన్ ఫాలో)ని కథనాలొచ్చాయి. ఫరా ఖాన్ అటు దీపిక భర్త రణ్ వీర్ ను కూడా అన్ ఫాలో చేయడం ఆశ్చర్యపరిచింది.
వరుస పరిణామాలు దీపికలో చాలా కలవరం పెంచాయని అంతా ముచ్చటించుకుంటున్నారు. దీపిక పాటించే స్వీయ నిబంధనలు బయట చెల్లుబాటు కావడం కుదరదని కూడా గుసగుస వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో దీపిక తన గట్స్ గురించి మాట్లాడటం అందరికీ షాకిచ్చింది. ఇటీవలి వివాదానికి దీపికా పదుకొనే స్పందిస్తూ, పరిశ్రమలో తన స్థానం విషయంలో, అవకాశాల విషయంలో ఎలాంటి సవాల్ కి అయినా సిద్ధమేనని కాన్ఫిడెన్స్ ని ప్రదర్శించింది. దీపిక ఇలా వ్యాఖ్యానించింది. “ప్రశ్నించడానికి, నియమాలను సవాల్ చేయడానికి.. మహిళలపై అంచనాలను రీడిఫైన్ చేయడానికి.. బౌండరీలు దాటడానికి తాను ఎప్పుడూ భయపడలేద“ని దీపిక పదుకొనే వ్యాఖ్యానించింది.
మంగళవారం నాడు ఐఎండిబి భారతీయ సినిమాలో 25 ఏళ్ల ప్రస్థానా(2000-2025)న్ని విడుదల చేసింది. ఇది 2000- 2025 మధ్య ప్రతి సంవత్సరం అత్యంత ప్రజాదరణ పొందిన ఐదు భారతీయ చిత్రాలను విశ్లేషిస్తుంది. గత 25 సంవత్సరాలలో నటీనటులు- వారు పని చేసిన గొప్ప సినిమాల జాబితాను కూడా సేకరించారు. ఈ జాబితాలో షారూఖ్ నంబర్ వన్ స్థానాన్ని అలంకరించగా, దీపికా పదుకొనే నాల్గవ స్థానంలో నిలిచింది. విశ్లేషించిన 130 చిత్రాలలో 10 చిత్రాలలో దీపిక నటించారు. 20 టైటిళ్లతో షారుఖ్ ఖాన్ నంబర్ వన్ స్థానంలో నిలవగా,ఆ తర్వాత ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్ 11 టైటిళ్లతో రెండో స్థానం దక్కించుకున్నారు. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, అజయ్ దేవ్‌గన్, ప్రభాస్, అలియా భట్ కంటే దీపిక పదుకొనే రేసులో ముందున్నారు.
ఐఎండిబి ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ.. ఒక స్త్రీ తన కెరీర్ లో దూసుకెళ్లడానికి ఏం చేయాలో నాకు తెలుసు. అయితే మొదటి నుండి ఎదుటివారిని ప్రశ్నించడానికి, రెక్కలు కట్టుకోవడానికి, కష్టతరమైన మార్గంలో నడవడానికి, పాత నియమాలను సవాల్ చేయడానికి ఎప్పుడూ భయపడలేదు.. అని దీపిక వ్యాఖ్యానించింది. నా కుటుంబం, అభిమానులు, సహకారుల అండదండలు వారి నమ్మకం, నా ఎంపికలు ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోవడానికి నాకు శక్తినిచ్చింది. దీపికా పదుకొనే ప్రస్తుతం షారుఖ్ ఖాన్ `కింగ్`లో నటిస్తోంది. ఇందులో సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ తదితరులు నటిస్తున్నారు. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో AA22xA6 అనే చిత్రంలోను దీపిక నటిస్తోంది. ప్రభాస్ సరసన బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కోల్పోయినా దీపిక ఆత్మవిశ్వాసం ఇప్పుడు నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. తనకు ఉన్న పరిచయాలతోనే ఇండస్ట్రీని ఏల్తానని పరోక్షంగా చెబుతోంది దీపిక.