చెస్ ప్రపంచంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అమెరికన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నరోడిట్స్కీ (29) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆయన మృతి చెస్ క్రీడాలోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయగా, ఆయన మరణం చుట్టూ అనేక అనుమానాలు నెలకొన్నాయి. డానియల్ మరణం సహజం కాదని, దీని వెనుక కుట్ర కోణం ఉండొచ్చని మరో ప్రముఖ గ్రాండ్‌మాస్టర్ ఆరోపించడం కలకలం రేపుతోంది.
డానియల్ నరోడిట్స్కీ 19న కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను షార్లెట్ చెస్ సెంటర్ పంచుకుంది. “డానియల్ ఆకస్మిక మరణవార్తను పంచుకోవడం మాకు చాలా బాధగా ఉంది. అతను ప్రతిభావంతుడైన చెస్ క్రీడాకారుడు, శిక్షకుడు. ఈ క్లిష్ట సమయంలో మాకు ప్రైవసీ ఇవ్వాలని కోరుతున్నాము” అని కుటుంబ సభ్యులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, మరణానికి గల కారణాలను మాత్రం వారు వెల్లడించలేదు. అక్టోబర్ 2025 నాటికి 2619 ఫిడే రేటింగ్‌తో డానియల్ అమెరికాలో ప్రముఖ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
డానియల్ మరణంపై రష్యాకు చెందిన గ్రాండ్‌మాస్టర్ వ్లాదిమిర్ క్రామ్నిక్ సంచలన ఆరోపణలు చేశాడు. డానియల్ మృతి వెనుక కుట్ర జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. “అసలు ఏం జరిగింది? దీనిపై సరైన దర్యాప్తు జరగాలని ఆశిస్తున్నా” అని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, చనిపోవడానికి ముందు డానియల్ చేసిన చివరి లైవ్ స్ట్రీమ్‌లో మానసికంగా తీవ్ర అస్వస్థతతో కనిపించాడని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఆ సమయంలో ఆయన పొంతన లేకుండా మాట్లాడారని, ఇది చూసి తాము ఆందోళన చెందామని కొందరు తెలిపారు.
డానియల్ మృతి పట్ల చెస్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అమెరికా టాప్ ప్లేయర్ హికారు నకముర స్పందిస్తూ “నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది చెస్ ప్రపంచానికి తీరని లోటు” అని ఎక్స్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) కూడా డానియల్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపింది. అయితే, డానియల్ మృతిపై వస్తున్న ఆరోపణలు, అనుమానాలపై ఆయన కుటుంబం గానీ, అధికారులు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.