అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దర్శన్ మళ్లీ యధావిధిగా జైల్లో ఉన్నాడు.కేసుకు సంబంధించి ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీడియో కాన్పిరెన్స్ ద్వారా మంగళవారం దర్శన్ ని కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా దర్శన్ కోర్టు ముందు తన బాధలను చెప్పుకునే ప్రయత్నం చేసాడు. జైలులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని , విషం ఇవ్వాలని కోర్టును కోరాడు.
దర్శన్ తో పాటు మిగతా నిందితులు కూడా హాజరవ్వగా, దర్శన్ మాత్రం ప్రత్యేకంగా చేయి పైకెత్తి ఓ ముఖ్యమైన విషయాన్ని కోర్టుకు తెలియజేయాలంటూ కోరాడు. అందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఒక్క విషం చుక్క ఇవ్వాలని కోరాడు. జైలులో బటయ అడుగు పెట్టడానికి కూడా అనుమతి లేనందున్న చాలా రోజులుగా సూర్య కాంతిని కూడా చూడలేదన్నాడు. బట్టలు దుర్వాసన వస్తున్నాయని, చేతులకు ఫంగస్ పట్టిందని, చిన్న గదిలో చాలా ఇబ్బందులు పడుతు న్నానని న్యాయమూర్తి ముందు తన బాధను చెప్పుకున్నాడు.
ఇవన్నీ భరించడం తన వల్ల కాదని ఒక్క చుక్క విషమిస్తే చాలని వాపోయాడు. ఆ విషం కూడా కేవలం తనకు మాత్రమే ఇవ్వాలని కేసులో మిగతా వాళ్లకు ఇవ్వొద్దని కోరాడు. ఇలాంటి పరిస్థితుల్లో తానెంత మాత్రం జీవించలేనన్నాడు. ఈ సమయంలో దర్శన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో న్యాయమూర్తి కోర్టులో ఇలాంటి డిమాండ్లు చేయోదని సూచించి, అధికారులకు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు.
అనంతరం న్యాయమూర్తి విచరాణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసారు. సాక్షుల విచారణ కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని..దీనికి సంబంధించి ఎంతమాత్రం ఆలస్యం చేయరాదని..న్యాయవాదులు సంబం ధిత దరఖాస్తులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసారు. అరెస్ట్ సమయంలో దర్శన్ ఆరోగ్యంగా కనిపించినా? నేటి విచారణ సమయంలో మాత్రం చాలా బలహీనగంగా కనిపించాడు.