అతడు తరానికి ఒకడులాంటి ఫుట్ బాల్ ప్లేయర్… జట్టంతా ఒకెత్తయితే అతడు ఒక్కడే ఒక ఎత్తు.. ప్రపంచ కప్ లు గెలవకున్నా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సూపర్ స్టార్. తన స్టయిల్ అయితే.. ప్రపంచంలోని అందరు క్రీడాకారులకు పెద్ద ఆకర్షణ.. ఇక అమ్మాయిలైతే పడి చచ్చిపోతారు..! అలా ఎంతో ఇష్టపడిన ఓ అమ్మాయిని అతడు కూడా ఇష్టపడ్డాడు. దాదాపు పదేళ్లుగా ఇద్దరూ సహజీవనం సాగిస్తున్నారు.
క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచ ఫుట్ బాల్ లో అతడి పేరే ఒక మంత్రం..! ఇప్పుడు అతడి వయసు 40. పోర్చుగల్ జట్టుకు 2003 నుంచి ఆడుతున్నాడు. సుదీర్ఘకాలం కెప్టెన్ కూడా. అయితే, పోర్చుగల్ కంటే వివిధ ఫుట్ బాల్ లీగ్ లకు ఆడుతూ అత్యంత విజయవంతం అయ్యాడు. తమ దేశానికి ప్రపంచ కప్ మాత్రం అందించలేకపోయాడు. కారణం.. పోర్చుగల్ జట్టులో రొనాల్డోకు దగ్గరగా వచ్చే ఆటగాడు ఒక్కడు కూడా లేకపోవడం. ఫుట్ బాల్ వంటి ఆటలో ఒక్కడితో ఏం సాధ్యం కాదు. అందుకే పోర్చుగల్ ప్రపంచ విజేతగా నిలవలేకపోయింది. కానీ, రొనాల్డోకు మాత్రం ఎప్పటికీ ఆదరణ తగ్గలేదు.
ఇక ఈ తరంలో ప్రపంచ ఫుట్ బాల్ ను ఏలిన ఆటగాళ్లలో ఒకరు రొనాల్డో అయితే మరొకరు అర్జెంటీనా కెప్టెన్ లయోనల్ మెస్సీ. ఇద్దరిని పోలిక తెస్తూ అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయిన సందర్భాలు అనేకం. మరోవైపు రొనాల్డో ప్రస్తుతం సౌదీ ప్రొ లీగ్ లో అల్ నసర్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. మొత్తం 30 మ్యాచ్ లలో 25 గోల్స్ చేశాడు. మూడు గోల్స్ కు సాయం చేశాడు. -రొనాల్డో 2016 నుంచి జార్జినా రొడ్రిగెజ్ తో ప్రేమలో ఉన్నాడు. తాజాగా వీరి ఎంగేజ్ మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జార్జినా డైమండ్ రింగ్ ధరించి రొనాల్డోతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రొనాల్డో-జార్జినాకు ఇద్దరు పిల్లలుండగా, సరోగసీ ద్వారా ముగ్గురు పిల్లలున్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. 2026లో ఫుట్ బాల్ ప్రపంచ కప్ జరగనుంది. ఖతర్ లో 2022లో జరిగిన ప్రపంచ కప్ లో రొనాల్డోను కీలక సమయంలో పక్కనపెట్టారు. వచ్చే ప్రపంచ కప్ నాటికి రొనాల్డో పోర్చుగల్ జట్టులో ఉండడం అనుమానమే?