ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్నరాముడి కుమార్తె మాధురి సాహితీబాయి (27) ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన కొద్ది నెలలకే ఈ విషాదం చోటుచేసుకుంది. ఆమె తన గదిలోని బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న భర్త వేధింపులే దీనికి కారణమని తెలుస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం ఉంటున్న ఐఏఎస్ అధికారి చిన్నరాముడు కుమార్తె మాధురి సాహితీబాయి.. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గనపల్లి తండాకు చెందిన రాజేష్‌నాయుడిని ప్రేమించింది. వీరిద్దరు 2025 మార్చిలో వివాహం చేసుకుంది.
కొన్ని ఉదంతాల గురించి తెలిసినంతనే అయ్యో అనే మాట అప్రయత్నంగా వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పే విషాద ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. ఏపీకి చెందిన ఒక ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. కొద్దినెలల క్రితమే పెద్దలు కాదన్నా.. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిన ఆమె.. అతడి వేధింపులకు తాజాగా బలైన వైనం చూస్తే.. ఈ విషాదం ప్రేమ పేరుతో జరిగిందిగా చెప్పక తప్పదు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్నరాముడు కుమార్తె 27 ఏళ్ల మాధురి సాహితీ బాయి ఆత్మహత్య చేసుకున్నారు.
బాత్రూంలో ఊరి వేసుకొని జీవితాన్ని చాలించిన వైనం చూస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేం. ఈ ఏడాది మార్చిలో ఆమె ప్రేమించిన వ్యక్తితోకులాంతర వివాహం చేసుకుంది. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గనపల్లి తండాకు చెందిన రాజేష్ నాయుడ్ని పెళ్లాడింది. ఇంట్లో పెళ్లికి వ్యతిరేకించినా.. ప్రేమించినోడితో జీవితం బాగుంటుందన్న ఉద్దేశంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది.
పెళ్లైన మూడు నెలలకే తన భర్త వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయటంతో కుమార్తెను పోలీసుల సాయంతో రెండు నెలల క్రితమే తాడేపల్లిలోని తన నివాసానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. తనకు జాబ్ ఉందని మోసం చేసి తన కుమార్తెను రాజేష్ నాయుడు పెళ్లి చేసుకున్నట్లుగా చిన్నరాముడు ఆవేదన వ్యక్తం చేశారు. మహానందిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటంతో.. పెద్దల సమక్షంలో మళ్లీ పెళ్లి చేస్తామని చెప్పి.. అతడితో మా అమ్మాయిని పంపామన్నారు.
పెళ్లైన కొంతకాలానికే అదనపు కట్నం తీసుకురావాలని రాజేష్ వేధింపులకు గురి చేసేవాడని.. తానే దిక్కు అంటూ బెదిరింపులకు దిగేవాడని.. చివరకు తమకు ఫోన్ చేయాలన్నా భర్త నుంచి అనుమతి తీసుకునే పరిస్థితికి తన కుమార్తె వెళ్లిపోయిందన్నారు. తాను భర్తతో ఉండలేనని రెండు నెలల క్రితం తన కుమార్తె వాపోవటంతో తాము ఇంటికి తీసుకొచ్చినట్లుగా చెప్పారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి తన భర్తది నిజమైన ప్రేమ కాదని.. అందుకే ఇంటికి తీసుకువెళ్లటం లేదని తన కుమార్తె బాధపడేదని పేర్కొన్నారు. తాజాగా బాత్రూంలో ఊరి వేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


















