ఇండోర్ లో జర్నలిస్టులమని చెప్పుకుంటూ ఇద్దరు ట్రాన్స్ జెండర్ మహిళపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం కీలక మలుపు తీసుకుంది. ఇందులో భాగంగా… ట్రాన్స్ జెండర్ మహిళపై అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఇండోర్ లో 24 మంది ట్రాన్స్ జెండర్ మహిళలు ఫ్లోర్ క్లీనింగ్ మెటీరియల్ (ఫినాయిల్) తాగి సామూహిక ఆత్మహత్యకు ప్రయత్నించిన దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది.
అవును… ట్రాన్స్ జెండర్ మహిళపై అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాత్రి ఇండోర్ లో 24 మంది ట్రాన్స్ జెండర్లు ఫినాయిల్ తాగి సామూహిక ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ సందర్భంగా… రెండు డజన్ల మంది ట్రాన్స్ జెండర్లు ఒక గదిలోకి వెళ్లి ఫినైల్ తాగారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలను రేకెత్తించింది. దీంతో.. పోలీసులు, వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఈ సందర్భంగా స్పందించిన ఎంకే హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇన్ ఛార్జ్ డాక్టర్ బసంత్ కుమార్ నింగ్వాల్… ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆ 24 మందినీ వెంటనే మహారాజా యస్వంతరావు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. బుధవారం రాత్రి వారంతా కలిసి ఫినైల్ తాగినట్లు పేర్కొన్నారు. వారిలో ఎవరి పరిస్థితి విషమంగా లేదని.. అందరి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఈ విషయం స్థానికంగా తీవ్ర కలకం రేపింది. సామూహిక ఆత్మహత్యాయత్నం వార్త వ్యాపించడంతో.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సభ్యులు ఆసుపత్రి వద్ద గుమిగూడారు. కొందరు ఆసుపత్రి లోపల కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించినట్లు కథనాలొచ్చాయి. దీంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే పోలీసులు జోక్యం చేసుకుని ఆ ప్రయత్నాన్ని విఫలం చేశారు.
ఫిర్యాదు ప్రకారం… పంకజ్, అక్షయ్ అనే ఇద్దరు నిందితులు ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలోని వివాదాన్ని కవర్ చేసే విలేకరులమని చెప్పుకుంటూ బాధితురాలిని సంప్రదించారు. వారు ఆమె నుండి తొలుత డబ్బు డిమాండ్ చేశారు.. అనంతరం, మీడియాలో ఆమె పేరును దుష్ప్రచారం చేస్తామని బెదిరించారు. అయితే అందుకు ఆమె నిరాకరించడంతో.. వారిలో ఒకరు (పంకజ్!) ఆమెను సమీపంలోని భవనంలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ విషయంపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనంద్ కలద్గి… ట్రాన్స్ జెండర్లు నివసించే నందలాల్ పురా ప్రాంతంలో రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని, వెంటనే అంబులెన్స్ లను పిలిపించి, ఆ ఇరవై నాలుగు మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. 24 మంది వ్యక్తులు ఫ్లోర్ క్లీనింగ్ మెటీరియల్ అయిన ఫినైల్ తీసుకోవడం వెనుక ఉన్న కారణాలను మేము పరిశీలిస్తాము అని ఆయన అన్నారు. మరోవైపు.. ట్రాన్స్ జెండర్ మహిళపై అత్యాచారం చేసినందుకు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. ఇందులో భాగంగా… అదనపు డీసీపీ (క్రైమ్ బ్రాంచ్) రాజేష్ దండోటియా స్పందిస్తూ… నిందితులను అక్షయ్, పంకజ్ గా గుర్తించామని.. వారు జర్నలిస్టులుగా నటిస్తూ బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేసేవారని పేర్కొన్నారు!