మోసాలు పలు రకాలు.. నిత్యం పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా.. మీడియాలో రోజూ ఎన్నో సంఘటనలు జరుగుతున్నా.. మోసం చేసేవాడు ఆగడం లేదు, మోసపోయేవాళ్లు తగ్గడంలేదు. ఈ క్రమంలో తాజాగా ఇంజినీరింగ్ చదివి, హోటల్ లో చెఫ్ గా పని చేసి, అనంతరం సైబర్ నేరాలు మొదలుపెట్టిన ఓ వ్యక్తి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.
అవును… అతడే ఆమె, అతడే కానిస్టేబుల్, అతడే ఎస్సై, అతడే సీఐ, అతడే హైకోర్టు అడ్వకేట్. ఇలా తననే తన టీమ్ గా చేసుకుని.. పేర్లు మార్చుకుని.. అమ్మాయిల్లా చాట్ చేస్తు.. సోషల్ మీడియా వేదికగా పురుషులను ఆకర్షించి.. అనంతరం బ్లాక్ మెయిల్ చేసి.. పెద్ద ఎత్తున డబ్బులు గుంజిన ఓ వ్యక్తిని తాజాగా గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాళ్లోకి వెళ్తే… బాపట్ల జిల్లా ఇంకొల్లుకు చెందిన చోడ చైతన్య కృష్ణ పవన్ అనే వ్యక్తి.. ఇంజినీరింగ్ చేసి హోటల్ లో చెఫ్ గా కొంతకాలం పని చేసేవాడు. ఈ క్రమంలో ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడ్డాడు. ఈ సమయంలో సులభంగా, అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసం సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. దీనికోసం అమ్మాయిల పేర్లు పెట్టుకుని రంగంలోకి దిగాడు. ఈ క్రమలో.. ఫేస్ బుక్ లో అమ్మాయిల పేర్లతో అకౌంట్స్ ఓపెన్ చేసి, పురుషులకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి, వారితో అమ్మాయిలాగా చాటింగ్ చేసేవాడు. అనంతరం అసలు కథకు తెరలేపేవాడు. ఇందులో భాగంగా… కాల్ బాయ్ లా పని చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పి, వారిని ముగ్గులోకి లాగి రిజిస్ట్రేషన్ పేరుతో రూ.20 వేల నుంచి రూ.30 వేలు లాగేసేవాడు.
అనంతరం… కాల్ బాయ్ గా పనిచేయడానికి అంగీకరించినవారిని పోలీసునని చెప్పి బెదిరించేవాడు. ఆ సమయంలో రకరకాల ఫోన్ నెంబర్స్ నుంచి వారికి ఫోన్లు చేసి.. తనను తాను కానిస్టేబుల్ గా, ఎస్సైగా, సీఐగా, హైకోర్టు అడ్వకేట్ గా పరిచయం చేసుకుని, గొంతు మార్చి మాట్లాడేవాడు. కాల్ బాయ్ కేసు నుంచి తప్పించటానికి డబ్బులివ్వాలని బెదిరించి, అలాగా కాజేసేవాడు. ఈ క్రమంలో గుంటూరుకు చెందిన 68 ఏళ్ల వృద్ధుడిని సైతం బుట్టలో వేసుకున్నాడు. అతనితో తొలుత శైలజ పేరుతో చాటింగ్ చేసిన చైతన్య కృష్ణ… కాల్ బాయ్ గా వెళ్తే డబ్బులొస్తాయని చెప్పాడు. అందుకు ఆయన అంగీకరించకున్నా.. కొన్ని రోజులు వెంటాడిన తర్వాత వేరే నంబరు నుంచి ఫోన్ చేసి తాను పోలీసునని చెప్పాడు. మహిళతో అసభ్యకరంగా చాటింగ్ చేస్తున్నట్టు కేసు నమోదైందని, తప్పించడానికి డబ్బులివ్వాలని సదరు వృద్ధుడిని బెదిరించాడు. ఆ తర్వాత రోజే మరో నెంబర్ నుంచి ఫోన్ చేసి, గొంతుమార్చి, ఇన్ కం ట్యాక్స్ అధికారినని రైసుమిల్లులో సోదాలకు వస్తున్నానని చెప్పాడు. అలా పలు రకాలుగా వేధించి విడతలవారీగా సుమారు కోటి రూపాయలవరకు వరకు కొల్లగొట్టినట్లు పోలీసులు వెల్లడించారు.