చంద్రబాబు అంటే పని రాక్షసుడు అని పేరు. అంతే కాదు వ్యూహాలకు మారు పేరు. ఆయన ఎక్కడ ఎపుడు ఎలా మాట్లాడాలో అన్నీ తెలిసి వ్యవహరిస్తారు. ఆయన రాజకీయ జీవితంలో ఎపుడూ మాట తూలడం వల్ల కానీ ఆవేశం వల్ల కానీ నష్టపోయిన సందర్భం అయితే లేదు. ప్రతీ మనిషికి సహజంగా కోపతాపాలు ఉంటాయి. అయితే రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు పబ్లిక్ ఫిగర్స్ గా ఉంటారు. వారు చేసే ప్రతీ చర్య వాచ్ చేయబడుతుంది సమాజం మొత్తం చెక్ చేస్తూంటుంది. ఎవరు ఏ తప్పు చేసినా అది కాస్తా పార్టీకి ప్రభుత్వానికి చుట్టుకుంటుంది అందుకే అధినాయకత్వాలు తమ నేతలకు ఎన్నో సుద్ధులు బుద్ధులు చెబుతూ ఉంటాయి.
ఇక చంద్రబాబు తమ్ముళ్ళకు ఎన్నో సార్లు మెల్లగా గట్టిగా క్లాస్ తీసుకుంటూనే ఉంటారు. పార్టీ బాగుండాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకుని రావద్దని ఆయన సూచిస్తూనే ఉంటారు. కానీ మరో వైపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. సోషల్ మీడియా యుగంలో అంతా ఉన్నారు. దాంతో క్యాచీగా ఉంటుందని డైలాగ్స్ కొడుతున్నారు కొందరు నేతలు. ఆవేశంలో ఆగ్రహంతో మరి కొందరు కట్టు దాటుతున్నారు. ఇంకొందరు తమలోని అసంతృప్తిని వేరే ఇష్యూస్ మీద పెట్టి మరీ అసెంబ్లీ వేదికగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ గ్రాస్ రూట్ నుంచి వచ్చిన చంద్రబాబుకు తెలియనివి కావు ఆయన ఏ మాట వెనక ఏమి ఉందో ఇట్టే చెప్పగలరు. కానీ ఆయన తన ధోరణిలో నచ్చచెబుతూనే దిశా నిర్దేశం చేస్తున్నారు. కానీ మార్పు అయితే రాకపోతే మరింతమంది తయారవుతున్నారు అన్నది పార్టీలో ఏర్పడిన భావన.
వైసీపీలో జరిగింది ఇదే అని గుర్తు చేస్తున్నారు. తప్పుల మీద తప్పులు చేసుకుంటూ జనం సహనాన్ని కొందరు నాయకులు పరీక్షించారు. ఫలితంగా వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో అనేక కార్యక్రమాలు అమలు చేసినా కూడా చివరికి రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది. పార్టీని ప్రభుత్వాని కలిపి చూసి జనాలు తీర్పు ఇచ్చారు తప్పించి ఉచిత పధకాలకు ఒక్కటే మార్కులు వేయలేదు అన్నది అర్థం అయింది. ఇపుడు టీడీపీ కూడా అదే తమ పార్టీ వరరికి చెబుతోంది. తప్పులు చేస్తే వైసీపీకి చాన్స్ ఇచ్చిన వారం అవుతామని కూడా హెచ్చరిస్తోంది. కానీ ఎవరికీ పట్టడం లేదు.
ఆ మాటకు వస్తే టీడీపీలో స్వేచ్చ ఎక్కువ అయింది అని అంటున్నారు. గతంలో భయం ఉండేదని ఇపుడు ఏమీ కాకుండా తమ దారి తమదే అన్న ధోరణి ప్రబలింది అని అంటున్నారు బాబు నాలుగవ సారి సీఎం అయ్యారు కానీ పార్టీ నేతలు అనేక మంది మాత్రం స్వేచ్చగా తాము కోరుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో అయిదేళ్ళ పాటు మాత్రమే ప్రజా ప్రతినిధిగా వ్యవహరించమని జనాలు ఎన్నుకుంటే తామే శాశ్వతం అనేలా సామంతరాజులుగా చాలా మంది వ్యవహరిస్తున్నారు. మరి కొందరు అయితే మరోసారి టికెట్ దక్కుతుందా గెలుస్తామా అన్నాది ఆలోచించుకోవడం లేదు వచ్చిన ఈ చాన్స్ ని ఎలా వాడుకోవాలో అన్నది చూస్తున్నారు. ఈ అయిదేళ్ళూ అధికారంలో తాము చేయాలనుకున్నది చేస్తే ఆ మీదట ప్లాన్ బీ ఉంటుంది అని ధీమాగా ఉన్నారు. అందుకే అధినాయకత్వం మాటను లెక్క చేయడం లేదు అని అంటున్నారు.
చంద్రబాబు వరకూ అయితే బాగా కష్టపడుతున్నారు. నిజానికి ఆయన రాజకీయంగా చరమాంకంలో ఉన్నారనే అంటారు. కానీ ఆయన పార్టీని మరో యాభై ఏళ్ళ పాటు సక్సెస్ రూట్ లో ఉంచాలని చూస్తున్నారు. అలా ఉంటే ఎంతోమందికి అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. అంతే కాదు ఒకే ప్రభుత్వం రాష్ట్రంలో కొన్నేళ్ళ పాటు అధికారంలో ఉంటే కచ్చితంగా అభివృద్ధి సాధ్యపడుతుందని భావిస్తున్నారు. అలా జరగాలీ అంటే పార్టీ ప్రభుత్వం ఏక్ త్రాటి మీద ఉంటూ అభివృద్ధి మీద ఫోకస్ చేయాలని చెబుతున్నారు. కానీ అదే జరగడం లేదు. మొత్తానికి టీడీపీలో అయితే కొంతవరకూ క్రమశిక్షణ కట్టు తప్పింది అని అంటున్నారు. దాని వెనక అసమ్మతి గళాలు అసంతృప్తి స్వరాలూ ఉన్నాయని అంటున్నారు. మరి వీటికి మందు ఉంటుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది అని అంటున్నారు.