ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరాల కోసం కొత్త హెలికాఫ్టర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో.. ఇప్పటివరకు వినియోగించిన పాత హెలికాఫ్టర్ సేవలకు మంగళం పాడేశారు. ఇప్పటివరకు ఉన్న హెలికాఫ్టర్ పాతది కావటంతో పాటు పరిమితులు ఎక్కువగా ఉండటంతో కొత్త హెలికాఫ్టర్ ను కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. ఎయిర్ బస్ కు చెందిన హెచ్ 160 హెలికాఫ్టర్ ను కొనుగోలు చేశారు. ప్రపంచంలోని అత్యంత సాంకేతికంగా డెవలప్ చేసిన హెలికాఫ్టర్ లలో ఇదొకటిగా చెబుతున్నారు. భద్రతకు పెద్దపీట వేసేలా పలు ఫీచర్లు ఉన్నాయి.
ఈ హెలికాఫ్టర్ ప్రత్యేకత ఏమంటే ఇప్పటివరకు వినియోగించిన హెలికాఫ్టర్ కంటే ఎక్కువసేపు ప్రయాణించే సత్తా దీని సొంతం. రెండు ఇంజిన్లు కలిగిన మీడియం హెలికాఫ్టర్ గా పేర్కొంటారు. 2015లో తొలిసారి ఈ మోడల్ హెలి ఎక్స్ పోలో దర్శనమిచ్చింది. ఇసప్పటివరకు భెల్ కు చెందిన హెలికాఫ్టర్ ను వినియోగించేవారు. పాత చాపర్ తో వచ్చిన సమస్యేమంటే.. దానిలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉండేది కాదు. ఈ కొరతను కొత్త హెలికాఫ్టర్ తీరుస్తుంది.
పాత హెలికాఫ్టర్ తో ఉండవల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో జిల్లాలకు వెళ్లి.. మళ్లీ రోడ్డు మార్గంలో ప్రోగ్రామ్ జరిగే వేదిక వరకు కారులో వెళ్లేవారు. కొత్త హెలికాఫ్టర్ కారణంగా ఇప్పుడీ ప్రాసెస్ పూర్తిగా కట్ అయినట్లుగా చెప్పాలి. ఈ కారణంగా పెద్ద ఎత్తున సమయం ఆదా కావటంతో పాటు.. ఎక్కువ దూరం నాన్ స్టాప్ గా ప్రయాణించే వీలుంది. ఈ కొత్త చాపర్ లో ఇద్దరు పైలెట్లు కాకుండామరో ఆరుగురు కూడా ప్రయాణించే వీలుంది. ఈ హెలికాఫ్టర్ లో ఉన్న మరో కీలక ఫీచర్ ఏమంటే.. భద్రతకు పెద్ద పీట వేయటంతో పాటు.. ప్రతికూల వాతావరణంలోనూ ప్రయాణానికి అనువుగా ఉంటుంది. రక్షణ పరంగా ఎక్కువ ఫీచర్లు ఉన్నట్లు చెబుతున్నారు. దీని ధర దాదాపు రూ.150 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే సీఎం చంద్రబాబు కోసం కొనుగోలు చేస్తున్న అత్యాధునిక హెలికాఫ్టర్ పేరుతో భారీగా నిధులు దుబారా చేస్తున్నట్లుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.