టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో మెచ్చవలసిన విషయం ఏమిటంటే తప్పులు జరిగినప్పుడు వెంటనే వాటిని గుర్తించడం తిరిగి వాటిని చేయకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడం. నిజంగా ఇది ఏ రంగంలో అయినా ఎదగాలనుకునే నాయకులకు చాలా ముఖ్యమైన అంశంగా ఉంటుంది. సక్సెస్ రేటుకి ఇది అత్యంత ప్రధాన కారణం అవుతుంది.
ఇక బాబు విషయానికి వస్తే అమరావతి రాజధాని అన్నది ఆయన ప్రధాన అజెండా. అందువల్ల ఆయన దాని కోసం ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. అది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డే వన్ నుంచి అమరావతి మీదనే దృష్టి పెట్టేశారు. ఇలా చేయడం ఎందుకు అంటే అమరావతి విషయంలో 2014 నుంచి 2019 మధ్య ఎంతో కొంత జాప్యం జరిగింది. ఫలితంగా అది వైసీపీకి చాన్స్ ఇచ్చింది.
అందుకే ఈసారి అధికారం మొదట్లోనే అన్ని రకాలైన ప్రయత్నాలు చేసి మరీ రాజధానికి ఒక రాచబాటను పరచారు. దాంతో అమరావతి రాజధానికి ఒక రూపూ రేఖ ఈ టెర్మ్ లోనే వస్తాయన్న నమ్మకం అందరిలో ఉంది. అదే సమయంలో బాబుకు అమరావతి ఒక జీవిత కాలం విజయంగా మారి ఆయనను చరిత్ర పుటలలోకి కూడా ఎక్కించబోతోంది. సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఏపీ తీరు చూస్తే భౌగోళికంగా నాలుగు ప్రధాన ప్రాంతాల సమాహారం. ఉత్తరాంధ్ర ఒక రీజియన్ అయితే గోదావరి ప్రాంతాలు మరో రీజియన్. ఇక దక్షిణ కోస్తా బెల్ట్ మరో రీజియన్. ఆ తర్వాత రాయలసీమ కీలకమైన రీజియన్. ఇలా అన్నీ కలసి ఉన్న ఏపీని అభివృద్ధి చేయాలంటే సమగ్రమైన ప్రణాళిక ఉండాలి.
అయితే దానికి ఎక్కడో ఒకచోట శుభారంభం జరగాలి. అదే రాజధాని నిర్మాణం. దక్షిణ కోస్తాలో రాజధాని ఉంది. ఇది భౌగోళికంగా చూస్తే అన్ని ప్రాంతాలకు దగ్గర ప్రాంతం. సెంటర్ పాయింట్ గా ఉంది. అలా రాజధాని స్థలాన్ని ఎంచుకోవడంలో చంద్రబాబు తొలి సక్సెస్ సాధించారు. మరో వైపు చూస్తే అమరావతి ప్రాంతం అద్భుతంగా లక్షల కోట్లతో అభివృద్ధి చెందుతుంది. ఆ మీదట రాజధాని ఫలాలు ఫలితాలు అన్ని ప్రాంతాలకు దక్కుతాయి. కానీ ఈలోగా ఏపీ మొత్తం రాబడి ఆదాయాలు అన్నీ అమరావతికే పెట్టేస్తున్నారు అన్న విమర్శలను ప్రత్యర్ధులు చేసే అవకాశం ఉంది ఇప్పటికే వైసీపీ అంటోంది కూడా. అలాగే అప్పులు తెచ్చి అమరావతికి పెడితే తీర్చే బాధ్యత మొత్తం ఏపీదా అన్న లాజిక్ పాయింట్ ని కూడా లాగుతున్నారు. గత అయిదేళ్ళలో ఈ విధమైన ప్రచారం కారణంగానే టీడీపీ దెబ్బతినిపోయింది. దాని ఫలితాలను 2019లో చూసింది కూడా.
ఈసారి బాబు ఆచీ తూచీ అడుగులు వేస్తున్నారు. ఆయన ఫుల్ ఫోకస్ అమరావతి మీద పెడుతూనే ఉత్తరాంధ్ర కు కేంద్ర స్థానంగా ఉన్న విశాఖపట్నాన్ని ఆర్ధిక రాజధానిగా చేస్తామని హామీ ఇస్తున్నారు. విశాఖకు ఐటీ కంపెనీలను తీసుకుని వస్తున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసే పనిని తీసుకున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి అయితే ఉత్తరాంధ్ర దశ తిరుగుతుందని అపుడు అది అమరావతి ఉన్న దక్షిణ కోస్తాతో సమానంగా మరో గ్రోత్ ఇంజన్ గా మారుతుందని కూడా లెక్క వేస్తున్నారు.
అదే విధంగా గోదావరి జిల్లాలలో వ్యవసాయికంగా పర్యాటక పరంగా మరింత ఊతమిస్తే చాలు అవి కూడా స్వయం సమృద్ధి సాధించి సమగ్రమైన అభివృద్ధి బాటను పడతాయని బాబు లెక్క వేస్తున్నారు. రాయలసీమలో చూస్తే కనుక కర్నూల్ ని ఫోకస్ చేసే పనిలో బాబు ఉన్నారు. అక్కడ అవసరమైన పారిశ్రామిక వాతావరణాన్ని తీసుకుని రావడం ద్వరా చుట్టుపక్కల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రాయలసీమలోనే ప్రపంచ దేవుడు శ్రీనివాసుడు ఉన్నారు. దాంతో అక్కడ అభివృద్ధి చేయడం ప్రపంచ ఆధ్యాత్మిక నగరంగా దానిని తీర్చిదిద్దడం తో పాటు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తే కనుక ది బెస్ట్ గా మారి మరో గ్రోత్ ఇంజన్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు. వీటితో పాటుగా బాబు మరో ప్లాన్ ఉంది. ప్రతీ జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధి చేయడం ద్వారా ఏ జిల్లాకు ఆ జిల్లాకు రాజధాని కళ రప్పించాలని ఆలోచన చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ప్రాంతీయ వివక్షలు అన్న విమర్శలకు దూరంగా ఉంటూ ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాలూ ప్రగతి వికాసంతో ముందుకు సాగుతాయని భావిస్తున్నారు అపుడు వైసీపీ అయినా మరో పార్టీ అయినా చేసే విమర్శలకు విలువ ఉండదన్నది కూడా బాబు ఆలోచనగా ఉంది. అందుకే ఆయన నోట ఇపుడు సమగ్ర అభివృద్ధి అన్న నినాదం వినిపిస్తోంది.