నల్గొండ ప్రజల కోసం ఎంత వరకైనా పోరాడతామని.. ఏమైనా చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన సమయంలో నల్గొండ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూశానని.. అందుకే.. అప్పట్లో వారికి మాటిచ్చానని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే మూసీ నదిని ప్రక్షాళన చేసి.. నీటిని పరిశుభ్రంగా వారికి అందించేం దుకు కంకణం కట్టుకున్నానని తెలిపారు. ప్రజలకు తాగు నీరు కూడా సక్రమంగా ఇవ్వని పాలకులు.. ఇప్పుడు చేస్తున్న మంచిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
అయినప్పటికీ..తాను తట్టుకుని నిలబడ్డానని రేవంత్ రెడ్డి చెప్పారు. హైడ్రా వ్యవస్థ లేకపోతే.. మూసీని ప్రక్షాళన చేసే అవకాశం వచ్చేదా? అని ప్రశ్నించారు. కానీ, హైడ్రాను కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నించారని, ఈ వ్యవస్థను ఆపేసే ప్రయత్నాలు కూడా జరిగాయని అన్నారు. మొండిగా ముందుకు సాగబట్టే.. ప్రస్తుతం నల్గొండ వాసులకు పరిశుభ్రమైన నీటిని అందించేందు కు, గోదావరి జలాలను వారి ముంగిటికి తీసుకువెళ్లేందుకు అవకాశం ఏర్పడిందని రేవంత్ రెడ్డి చెప్పారు. రెండు రోజులకు ఒకసారి నీటి కోసం ఎదురు చూసే భాగ్యనగర వాసులకు నీటి కష్టాలు తప్పనున్నాయని తెలిపారు.
ఇక నుంచి.. హైదరాబాద్ ప్రజలకు గోదావరి నీరు అందుబాటులోకి రానుందని సీఎం వివరించారు. అదేసమయంలో చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ మునిగిపోతోందని,ఈ సమస్య గతంలోనూ ఉందని, కానీ,అప్పట్లో రాజకీయంగానే దీనిని చూశారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 మాసాల్లోనే ఈ సమస్యపై దృష్టి పెట్టామని.. హైదరాబాద్ నగరం మునగకుండా చేసేందుకు, వరద నియంత్రణ కోసం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను నిర్మిస్తే.. తాము వాటిని కాపాడుతున్నామని.. ప్రక్షాళన కూడా చేశామని తెలిపారు.
మూసీ పునరుజ్జీవంలో భాగంగా.. ఉస్మాన్‌సాగర్ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం 2, 3 దశల ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సోమవారం శంకుస్థాపన చేశారు. రూ.7,360 కోట్లతో హ్యామ్ విధానంలో ఈ పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలో ఈ పనులు పూర్తి చేయనున్నట్టు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు సృష్టించినా.. ప్రజలకు మేలు చేయాలన్న తన సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. నల్గొండ వాసులు ఫ్లోరైడ్‌తో ఇబ్బందులు పడాల్సిందేనా? పదేళ్లలో మీరు ఏనాడైనా ఇక్కడి సమస్యను పట్టించుకున్నారా? అని ఈ సందర్భంగా విపక్ష బీఆర్ ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డుపడినా.. తొక్కుకుంటూ పోతామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.