టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. సినిమాల షూటింగ్స్ బంద్ తో అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. 30 శాతం వేతనాల పెంపును డిమాండ్ చేస్తూ కార్మికులు గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నిర్మాతలు, కార్మిక సంఘాల నేతలు, ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు.
దీంతో సమ్మె 16వ రోజుకు చేరింది. అదే సమయంలో తమ వేతనాలు పెంచాలంటూ హైదరాబాద్ లోని ఇందిరా నగర్ లో నేడు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సినీ కార్మికుల ఐక్యవేదిక పేరుతో 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన కార్మికులు నిరసనలో పాల్గొన్నారు. శ్రమకు తగ్గిన ఫలితం ఇవ్వాలంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు.
అయితే నిర్మాతలు పెట్టిన నాలుగు కండిషన్స్ ను ఇటీవల ఫిలిం ఛాంబర్ లేఖ రూపంలో ఫిలిం ఫెడరేషన్ కు పంపింది. అందులో రెండు ప్రతిపాదనలతో కార్మికులు అంగీకరించడం లేదు. కార్మికులకు ఫ్లెక్సిబుల్ కాల్షీట్స్.. ఆపై రెండో ఆదివారం, ప్రభుత్వ సెలవు రోజుల్లో మాత్రమే డబుల్ పేమెంట్ వంటి అంశాలను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు, సోమవారం (ఆగస్టు 18) ఫిలిం ఫెడరేషన్ సభ్యులంతా చిరంజీవితో భేటీ అయ్యారు. తమ సమస్యలన్నింటినీ చిరంజీవికి చెప్పుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఆ సమావేశంలో కార్మిక సంఘాల సమస్యలు కూలంకషంగా విన్నారు మెగాస్టార్. ఫెడరేషన్ కు ఏ సమస్యలు ఉన్నా తన వద్దకు రావాలని చిరంజీవి చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే నేడు జరిగే ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ చర్చలతో సమ్మె కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరో రెండు రోజుల్లో షూటింగ్స్ కూడా మొదలవ్వనున్నాయని సమాచారం. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్ తో ఫిలిం ఛాంబర్ సమావేశం మొదలవ్వనుంది. అయితే ఆ సమావేశం మరోసారి మెగాస్టార్ చిరంజీవితో ఫెడరేషన్ సభ్యులు, నిర్మాతలు సమావేశం కానున్నారు. ఏదేమైనా అనేక మంది కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సినిమా షూటింగ్ లు నిలిచిపోవడంతో ఆందోళన చెందుదున్నారు. అదే సమయంలో పరిశ్రమపై బంద్ తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చి, విడుదల తేదీ కూడా ప్రకటించిన సినిమాలపై సమ్మె ప్రభావం ఎక్కువగా కచ్చితంగా పడనుంది. మరి సమ్మెకు ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాలి.