గత కొద్దిరోజులుగా కార్మిక సమ్మె కారణంగా టాలీవుడ్ షూటింగులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. మెరుపు సమ్మెతో నిర్మాతలు పూర్తి గందరగోళంలో ఉన్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరిస్తానంటూ మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే నిర్మాతలు జూబ్లీహిల్స్ లోని చిరంజీవి ఇంటికి వెళ్లి మొరపెట్టుకోగా, రెండు మూడు రోజుల్లో పరిష్కారానికి ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
అయితే ఈ వివాద సమయంలో తనపై సాగుతున్న ఒక తప్పుడు ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఖండిస్తూ ఒక సందేశాన్ని పంపారు. చిరు ఒక మెసేజ్ లో ఇలా రాసారు. నా దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే.. ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు మీడియాలో తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు. నేను ఫెడరేషన్ సభ్యులను కలిసి 30 శాతం వేతన పెంపు డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేశారు.
ఈ సందర్భంలో నిజం ఏంటో స్పష్టంగా చెబుతాను. నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు. ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం. నేను ఏకపక్షంగా ఇలాంటి సమస్యలకు హామీ ఇవ్వడం లేదా పరిష్కారం చూపడం సాధ్యం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్ అన్నిటి కంటే అగ్ర సంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయసమ్మతమైన పరిష్కారానికి రావడం ఫిల్మ్ ఛాంబర్ సమిష్టి బాధ్యత. అంతవరకు, అన్ని పక్షాల్లో గందరగోళం సృష్టించే ఉద్దేశ్యంతో చేసిన ఇలాంటి నిరాధారమైన, ప్రేరేపిత ప్రకటనలను నేను ఖండిస్తున్నాను“ అని చిరు అన్నారు.
ఇతరులతో పాటు, మెగా హీరోలు నటిస్తున్న పలు చిత్రాలు ఈ సమ్మె కారణంగా ఇరకాటంలో పడిన సంగతి తెలిసిందే. చిరంజీవి, పవన్, చరణ్ లాంటి పెద్ద హీరోలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. కార్మిక సమ్మెను త్వరగా విరమింపజేస్తే అది అందరికీ కలిసొచ్చే అంశం. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుంటారని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇన్నర్ పాలిటిక్స్ సెగ ఇప్పుడు చిరును కూడా తాకింది. అది కూడా తప్పుడు మార్గంలో…!
కార్మిక సమ్మె కారణంగా గత కొద్ది రోజులుగా టాలీవుడ్ షూటింగులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 30 శాతం వేతన పెంపును తక్షణం అమల్లోకి తేకపోతే బంద్ కొనసాగుతుందని కార్మిక సమాఖ్య భీష్మించుకు కూచుంది. నిర్మాతలు ఓవైపు ఫెడరేషన్ తో మంతనాలు సాగిస్తున్నా కానీ, కార్మికులు దిగి రాలేదు. మెగాస్టార్ చిరంజీవితోను నిర్మాతలు మంతనాలు సాగించారు. ఆయన ఒక పరిష్కారం వెతుకుదామని అన్నారు.
ఒకట్రెండు రోజులుగా ఫెడరేషన్ తో ఛాంబర్ వర్గాలు చర్చలు జరుపుతున్నాయి. ఎట్టకేలకు నిర్మాతలు కొంత దిగి వచ్చి 15శాతం పెంపునకు అంగీకరించారు. రోజుకు 2000 వేతనం అందుకునే కార్మికులకు పెంపు వర్తించదు.. 1000-1200 రేంజులో అందుకునే కార్మికులకు తొలి దఫా 15 శాతం వేతనం పెంచుతామని, రెండో విడతలో 5శాతం, మూడో విడతలో 5శాతం వేతనాలు పెంచుతామని నిర్మాతలు అంగీకరించారు. అయితే 30 శాతం పెంపునకు సుముఖంగా లేమని నిర్మాతలు ప్రకటించారు. చిన్న సినిమాలకు ఇవేవీ వర్తించవని కూడా వెల్లడించారు. ఆ మేరకు మీడియా సమావేశంలో దీనిని అధికారికంగా ప్రకటించారు. అయితే తాము నిర్మాతలు పేర్కొన్న వేతన సవరణకు అంగీకరించలేదని ఫెడరేషన్ అధ్యక్షుడు అనీల్ వల్లభనేని పేర్కొన్నారు. చర్చలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన అన్నారు. కార్మిక యూనియన్లను విభజించి పాలించారని, ఒక్కొక్కరికి ఒక్కోలా వేతన సవరణ గురించి మాట్లాడటం నచ్చలేదని అనీల్ అన్నారు. తాము వారు చెప్పిన దానికి అంగీకరించలేదని, చర్చలు విఫలమయ్యాయని అన్నారు.