వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరచూ ఒక మాట అంటూ ఉంటారు. ఆయన దేవుడిని ఎక్కువగా నమ్ముతారు. ఏ విషయం మీద అయినా దేవుడు ఉన్నాడు, ఆయన అన్నీ చూస్తాడు, సరైన సమయంలో మొట్టికాయలు వేస్తాడు అని తన సహజ ధోరణిలో చెబుతూ ఉంటారు. అయితే జగన్ పదే పదే విషయాలను చెప్పినపుడు ఆయన ఆధ్యాత్మిక భావనను వైసీపీ వారు అంతా మెచ్చుకున్నారే కానీ ముల్లును ముల్లుతోనే తీయాలి రాజకీయాల్లో కదా ఇలా దేవుడి మీద భారం వేయడం ఏ మేరకు సమంజసం అని కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయని అంటారు.
తాజాగా బాలయ్య ఎపిసోడ్ కాదు కానీ తాము ఎన్ని నిందలు మోసామో అని వైసీపీ శ్రేణులు అన్నీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయంగా తాము ఎంతో నష్టపోయామని కూడా చెబుతున్నాయి. జగన్ మీద ఎక్కువగా నిజాలు కంటే నిందలే జనంలోకి వెళ్ళాయని కూడా వారు అంటున్నారు. దానికి సరైన విరుగుడు మంత్రం తమ పార్టీ వద్ద లేకపోయిందని అందుకే ఫలితాలను అనుభవించామని కూడా చెబుతున్నారు. అతి పెద్ద నింద ఏమిటి అంటే సినీ ప్రముఖులను జగన్ అవమానించారు అని. ఇది జనంలోకి బాగా వెళ్ళిపోయిందని కూడా వారు గుర్తు చేస్తున్నారు. సినీ హీరోలు మెగాస్టార్ లాంటి టవరింగ్ పర్సనాలిటీని కూడా అవమానించారు అంటే సామాన్య జనంలో కూడా వైసీపీ మీద వ్యతిరేక భావన ఏర్పడేలా చేసింది అని వేడి నిట్టూర్పులు విడుస్తున్నారు.
తమ మీద ఇంతటి అభాండం పడినప్పుడు దానిని కాదు అని చెప్పడానికి వైసీపీ నుంచి ఎలాంటి ప్రయత్నం అయితే జరగలేదని వైసీపీ నేతలు అంటున్నారు. సినీ ప్రముఖుల చేత ఆనాడే తమను ఎవరూ అవమానించలేదు అని చెప్పించే ప్రయత్నం చేయించలేకపోయారు అని అంటున్నారు. అన్నీ జనాలకు తెలుసు అర్థం చేసుకుంటారు పైన దేవుడు ఉన్నాడు అన్న అధినాయకత్వం వైఖరి వల్లనే ఎక్కువగా వైసీపీ నిందలు మోస్తూ వచ్చిందని కూడా అంటున్నారు.
అయితే జగన్ చెప్పినట్లుగానే ఆలస్యం అయినా నిజం ఏమిటో బయటకు వచ్చిందిందని అంటున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఇదే చెప్పారు. తమ పార్టీ నిందలు మోసిందని నిజం ఇప్పటికైనా లోకానికి తెలిసింది అని అన్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే వైసీపీ క్యాడర్ పెడుతున్న పోస్టులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా దేవుడున్నాడు అంటూనే. కర్మ సిద్ధాంతాన్ని కూడా వారు గుర్తు చేసుకుంటున్నారు. తాము పడ్డాం, అనుభవిస్తున్నామని కానీ చివరికి సత్యం గెలిచిందని తమ అధినేత చెప్పినదే జరిగింది అని అంటున్నారు.
ఈ విషయంలో ఇలా జరిగింది కానీ ప్రతీ దానికీ దేవుడి మీద భారం వేసి ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తూ కూర్చుంటే పార్టీ నిందలతోనే భారంగా అడుగులు వేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఏ ఇష్యూలో అయినా ఎప్పటికపుడు చురుకుగా ఉంటూ విషయం తమ సైడ్ ఏమిటి తమ వైఖరి ఏమిటి ఏమి జరిగింది అన్న దానిని బయట పెట్టాల్సి ఉందని అంటున్నారు. వైసీపీ మొదటి నుంచి డిఫెన్స్ మోడ్ లోనే పార్టీని నడుపుతోందని అంటున్నారు లక్ష కోట్లు జగన్ అన్నప్పుడు కూడా మౌనంగానే పార్టీ ఉందని అలాగే అనేక ఇతర అంశాల విషయంలో అదే జరిగిందని అంటున్నారు.
సీబీఐ మాజీ డైరెక్టర్ ఒకరు లక్ష కోట్లు కాదు తక్కువ మొత్తం అని చెప్పినా దానిని సైతం చెప్పుకోలేని బలహీనత వైసీపీలో ఉందని అంటున్నారు. వైసీపీ ఇప్పటికైనా అఫెన్స్ మోడ్ లోకి వెళ్ళాలని కౌంటర్ ఎటాక్ స్ట్రాటజీని డెవలప్ చేసుకోవాలని పార్టీలో హితైషులు సూచిస్తున్నారు. లేకపోతే నిందలు నిజాలుగా మారి వైసీపీని భారంగా మారుస్తాయని అంటున్నారు. మరి వైసీపీ అధినాయకత్వం ఇక మీదట అయినా తన ఎకో సిస్టమ్ లో భారీ మార్పులు తెస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.