మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులో కూడా ఫుల్ జోష్ లో వరుస సినిమాలను చేస్తూ, మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టి కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు. ఖైదీ నెం.150 సినిమాతో చిరూ రీఎంట్రీ ఇచ్చాక మెగా ఫ్యాన్స్ చిరూ వరుస హిట్లతో దూసుకెళ్తారనుకున్నారు. కానీ ఆ తర్వాత వెంటనే చేసిన సైరా నరసింహా రెడ్డి అతని హిట్లకు అడ్డుకట్ట వేసింది.
అయితే ఇలాంటి పొరపాట్లు ఎవరి కెరీర్లో అయినా జరగడం మామూలే. కానీ మెగాస్టార్ కెరీర్లో మాత్రం ఈ పొరపాట్లు తరచూ జరుగుతూ వస్తున్నాయి. అందుకే ఆ పొరపాట్లు జరక్కుండా చిరూ ఈసారి జాగ్రత్త పడుతున్నట్టు ఆయన లైనప్ ను చూస్తుంటే తెలుస్తోంది. ప్రస్తుతం వశిష్టతో విశ్వంభర సినిమాతో పాటూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా చిరూ ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
చిరూ- అనిల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మెగా157 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా వస్తోంది. దాని కంటే ముందే విశ్వంభరను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఒకవేళ విశ్వంభర ఫ్లాపైనా మెగా157కు మంచి హైప్ ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్ పెద్దగా చిరూపై, అతని మార్కెట్ పై పడే ఛాన్స్ ఉండదు. పైగా మెగా157పై ప్రస్తుతానికైతే భారీ అంచనాలున్నాయి. రిలీజ్ టైమ్ నాటికి ఆ హైప్ మరింత పెరగడం ఖాయం.
ఆ తర్వాత చిరంజీవి, దసరా ఫేమ్ శ్రీకాత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశారు. అనౌన్స్‌మెంట్ తోనే భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా మోస్ట్ వయొలెంట్ ఫిల్మ్ గా రాబోతుందని మేకర్స్ ముందుగానే హింట్ ఇచ్చారు. ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని నిర్మించనున్నారు. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్న శ్రీకాంత్ నెక్ట్స్ ఇయర్ సమ్మర్ కు ఫ్రీ అవుతారు. ఆ తర్వాత చిరూతో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
దాని కంటే ముందు చిరూ, తనకు వాల్తేర్ వీరయ్య లాంటి హిట్ ను ఇచ్చిన బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయాలనుకుంటున్నారు. ఒక వేళ బాబీ ప్రాజెక్టు ఏమైనా అటూ ఇటూ అయినా దాన్ని కవర్ చేసేలా శ్రీకాంత్ సినిమాను ప్లాన్ చేసుకున్నారు చిరూ. ఏదేమైనా రాబోయే మూడేళ్లలో చిరూ నుంచి నాలుగు సినిమాలు రానుండగా ఆ నాలుగు సినిమాలూ కూడా అతని కెరీర్ కు ఎలాంటి బ్రేకులు పడకుండా ప్లాన్ చేసుకోవడం గమనార్హం. ఒకవేళ ఈ నాలుగు సినిమాలూ హిట్ అయితే మరో పదేళ్ల పాటూ టాలీవుడ్ లో మెగాస్టార్ కెరీర్ కు ఎలాంటి ఢోకా ఉండదు.