చైనాలో ఓ నేషనల్ హైవే ఎర్ర సముద్రాన్ని తలపించింది. 36 లేన్ల హైవే అది. అది పెద్ద రోడ్డు కూడా సరిపోనంతగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల కొద్దీ వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. వాటి బ్రేక్ లైట్ల వెలుగులో ఆ రోడ్డంతా నిండిపోయింది. రోడ్డు మీద ఎర్ర సముద్రం గానీ పారుతోందా? అనిపించేలా చేశాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై వందల సంఖ్యలో రిప్లైలు పడుతున్నాయి.
చైనా నేషనల్ హాలిడే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 8 వరకు జరిగిన చైనా జాతీయ దినోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సెలవులను ముగించుకుని ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి రావడంతో ఈ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సెలవురోజుల తర్వాత ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వస్తున్న సమయంలో 36 లేన్ల హైవేపై ఏర్పడిన ఈ ట్రాఫిక్ జామ్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అందరి చూపునూ తన వైపు మళ్లించుకుంది.
లక్షలాది వాహనాలు నిలిచిపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఒకవైపు రోడ్డు అంతా ఖాళీగా ఉన్నప్పటికీ.. మరో వైపున రిటర్న్ అవుతున్న వాహనాలతో రోడ్డు మొత్తం కిటకిటలాడింది. చైనాలోని అతిపెద్ద టోల్ స్టేషన్ అయిన వుజువాంగ్ వద్ద ఈ దృశ్యాలు కనిపించాయి. వాహనాల నిరంతర ప్రవాహాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాయి. మొత్తం 24 గంటల పాటు ఈ వాహనాల రద్దీ కొనసాగిందంటే.. దీన్ని బట్టి ట్రాఫిక్ ఏ స్థాయిలో స్తంభించిపోయిందో అర్థం చేసుకోవచ్చు. పైగా 36 లేన్ల రోడ్డు కూడా తట్టుకోలేకపోయింది.
ఇంత వెడల్పు ఉన్న రోడ్డుపై నాలుగు టోల్ బూత్‌లను మాత్రమే ఏర్పాటు చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చైనా మీడియా వెల్లడించింది. టోల్ బూత్ ల వద్ద బాటిల్ నెక్ తరహా రోడ్డు ఉండటం, ఆయా వాహనాలన్నీ కూడా ఈ నాలుగు టోల్ బూత్ ల గుండానే బయలుదేరాల్సి ఉండటం వల్ల ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ది యూఎస్ సన్ ప్రచురించిన కథనం ప్రకారం.. ఆ ఒక్క నేషనల్ హాలిడే రోజున 24 గంటల వ్యవధిలో సుమారు 1,20,000 వాహనాలు టోల్ స్టేషన్ గుండా వెళ్ళాయి.
అక్టోబర్ 1 నుంచి 8 తేదీల మధ్య రికార్డు స్థాయిలో 2.4 బిలియన్ ట్రిప్పుల మేర వాహనాలు రాకపోకలు సాగించినట్లు సిక్స్త్ టోన్ వెల్లడించింది. రోజుకు సగటున 304 మిలియన్లుగా రవాణా మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఇది గత సంవత్సరం కంటే 6.2 శాతం ఎక్కువ. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలే ఇందులో అధికంగా ఉన్నట్లు పేర్కొంది.