మనోజ్ బాజ్‌పేయి నటించిన నెట్‌ఫ్లిక్స్ చిత్రం `ఇన్‌స్పెక్టర్ జెండే` టీజర్ ఇటీవలే విడుదలై, వేగంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒక నిజ జీవిత హీరో కథను తెరపై ఆవిష్కరించనుంది. చిన్మయ్ మాండ్లేకర్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్మయ్ ఈ చిత్రానికి రచయిత కూడా. ఇది క్రూరమైన నేరస్థుడు చార్లెస్ శోభరాజ్‌ను రెండుసార్లు అరెస్ట్ చేసిన డ్యాషింగ్ ముంబై పోలీసు అధికారి మధుకర్ జెండే జీవితం ఆధారంగా రూపొందింది.
దాదాపు మూడు దశాబ్దాలుగా పోలీసు శాఖలో పనిచేసిన అనుభవజ్ఞుడైన ఆఫీసర్ జెండే సాహసాల కథ అసాధారణమైనది. చట్టాన్ని సవాల్ చేసే `ది సర్పెంట్`గా పిలుపందుకున్న కరుడుగట్టిన గూండా చార్లెస్ శోభరాజ్‌ను ధైర్యంగా అరెస్టు చేసిన ఆఫీసర్‌గా జెండే సుప్రసిద్ధులు. దోపిడీలు, మోసం, వరుస హత్యలతో దేశాన్ని అట్టుడికించిన ప్రమాదకర గూండా రాజ్ శోభరాజ్‌ను అతడు ధైర్యంగా వెంటాడాడు. వెంటాడి వేటాడి ఒకసారి తప్పించుకున్న అతడిని మళ్లీ రెండోసారి కూడా అరెస్ట్ చేసారు జెండే.
1971లో ముంబైలో చార్లెస్ శోభరాజ్ దోపిడీ ప్రణాళికను పసిగట్టిన జెండే అతడిని స్టార్ హోటల్ లో ఎటాక్ చేసాడు. సూట్ లో ఉన్న అతడిని కనిపెట్టి అరెస్ట్ చేసాడు. దీనికోసం పోలీసులతో హోటల్ బయటే రెండు మూడు రోజులు మాటు వేసాడు. చివరికి వేగుల సమాచారంతో అరెస్ట్ చేయగలిగాడు. కానీ చార్లెస్ శోభరాజ్ జైలులో అధికారులకు తన బర్త్ డే పేరుతో మత్తు కలిపిన స్వీట్లు తినిపించి పరారయ్యాడు. ఆ తర్వాత కూడా జెండేని అతడిని పట్టుకోవాలని నియమించింది డిపార్ట్ మెంట్. మళ్లీ అతడు చార్లెస్ శోభరాజ్ ని ఛేజ్ చేసి పట్టుకున్నాడు. అరెస్ట్ చేసాడు.
చార్లెస్ శోభరాజ్ ఏదైనా కుయుక్తితో తప్పించుకుపోతాడని భావించిన జెండే, శోభరాజ్ తో తిరిగి వెళుతున్నప్పుడు అతడిపై ఇద్దరు పోలీసులను కూచోబెట్టాడు. ఆ సమయంలో అతడిని అరెస్ట్ చేయడానికి తనవద్ధ భేఢీలు లేకపోవడంతో అతడు అలా చేయాల్సి వచ్చింది. చార్లెస్ శోభరాజ్, అతడి భాగస్వాములు ఎప్పుడూ ఆయుధాలతో ప్రమాదకరంగా సంచరించేవారు. ఒకసారి చార్లెస్ తన భాగస్వామితో పాటు ఉన్నప్పుడు పోలీసాఫీసర్ జెండే అతడిని వెంటాడాడు. కానీ అతడు తప్పించుకోగా, భాగస్వామి దొరికిపోయాడు. చార్లెస్ శోభరాజ్ తనతో ఎప్పుడూ రైఫిల్స్, మందుగుండును కూడా వెంట తీసుకుని వెళ్లేవాడు. అతడు క్రూరంగా ఎదుటివారిపై దాడి చేసేవాడని, క్షమాపణ అనేది లేకుండా చంపేసేవాడని కూడా టాక్ ఉంది. క్రూరుడైన చార్లెస్ ని బంధించిన ధైర్యమైన అధికారిగా జెండేకు గొప్ప పేరు ఉంది. జాతీయ స్థాయిలో అతడి ఇంటి పేరు అయింది. శోభరాజ్ ని అరెస్ట్ చేసిన జెండే అంటూ పిలిచారు.
జెండే ఇతర సాహసాలు అసాధారణమైనవి. ఓసారి కానిస్టేబుల్ పై ఐదుగురు దాడి చేసిన ఘటనలో సహచరుడిని రక్షించిన వీరుడయ్యాడు. హాజీ మస్తాన్ , కరీం లాలా వంటి నేరస్థులను జైలులో పెట్టిన ఘనుడిగాను పాపులరయ్యాడు. ఆరోజుల్లో చార్లెస్ శోభరాజ్ ని అరెస్ట్ చేసిన సాహసికి ప్రభుత్వం ఎంత కానుక ఇచ్చిందో తెలుసా? రూ.15,000. ఈ మొత్తాన్ని ఆయన వినయంగా స్వీకరించాడు.