ఏపీలో చాలా కొత్త విషయాలే కనిపిస్తున్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి ఎవరి స్థాయిలో వారు చర్చలు చేస్తున్నారు. ఏపీలో ఆ వింతలు కొత్తలు ఏమిటి అంటే ఏపీ అప్పుల కుప్ప అని చెప్పి అయిదేళ్ళ పాటు టీడీపీ ఇతర విపక్షాలు ప్రచారం చేశాయి. ఏపీ దివాళా అంచున ఉందని కూడా చెప్పేయి శ్రీలంక అవుతుందని హెచ్చరించాయి. ఎందుకు అంటే పధకాల పందేరం పేరుతో విచ్చలవిడిగా వైసీపీ అప్పులు చేస్తోంది అన్నదే ప్రధాన ఆరోపణ. ఇక అప్పులు కూడా ఏకంగా 15 లక్షల కోట్ల దాకా పెరిగాయని కూడా చెబుతూ వచ్చాయి. కట్ చేస్తే…
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. తాము వైసీపీ కంటే రెట్టింపు సంక్షేమ పధకాలు ఇస్తామని కూడా హామీలు ఇచ్చింది. సూపర్ సిక్స్ హామీలుగా వాటిని జనంలోకి తెచ్చి ప్రచారం చేసింది. అయితే ఈ సంక్షేమ పధకాలు ఎలా ఇస్తారు ఏపీ అప్పటికే అప్పులతో చిల్లు పడింది కదా అంటే సంపద సృష్టించి అని టీడీపీ పెద్దలు చెబుతూ వచ్చారు. ఇక ఏపీలో కూటమి పాలనకు మొదటి ఏడాది ముగిసింది. రెండవ ఏడాది మొదలైంది. వరసగా సంక్షేమ పధకాలు ఇవ్వడం మొదలైంది. కూటమి ఇవ్వదని వైసీపీ ఒక వైపు ప్రచారం చేస్తూ వచ్చింది. కానీ కూటమి మాత్రం ఒక్కో పధకాన్ని బయటకు తీస్తోంది.
టీడీపీ కూటమి తల్లికి వందనం కార్యక్రమంతో శుభారంభం చుట్టింది. పెద్ద ఎత్తున ఈ పధకం కింద తల్లుల ఖాతాలో నగదు జమ చేశారు. విద్యా సంవత్సరం మొదలు అవుతూనే ఈ సొమ్ము అందించారు. ఇక అన్నదాతా సుఖీభవ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఆ విధంగా 47 లక్షల రైతుల ఖాతాలో అయిదు వేల రూపాయలను టీడీపీ కూటమి వేసి ఆ వర్గానికి ఇచ్చిన హామీని నెరవేర్చుకుంది. ఇపుడు మహిళలకు ఉచిత బస్సు పధకానికి రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 15 నుంచి ఈ పథకం మొదలవుతోంది.
ఉచిత బస్సు పధకం మీద గత పదిహేను నెలలుగా కూటమి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఆఖరుకి జిల్లా స్థాయిలో అమలు చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. అయితే అనధికారికంగా దీని మీద ప్రచారం సాగింది. ఆ వెంటనే వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి. రాష్ట్రమంతా అని చెప్పి జిల్లాలకే పరిమితం చేస్తున్నారు అని విపక్షం మండిపడింది. దాంతో కూటమి పెద్దలు ఏమి ఆలోచించారో తెలియదు కానీ ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ పధకాన్ని అమలు చేస్తున్నారు ఏకంగా 6,700 బస్సులను రెండు వేల కోట్ల రూపాయలను ఈ పథకం కోసం కేటాయించారు అంటే ఎంత ప్రతిష్టగా తీసుకుంటున్నారో అర్ధం అవుతోందిగా. జిల్లాల వరకే బస్సులు పరిమితం అన్నప్పుడు సర్కార్ కి ఖర్చు రెండు వందల కోట్లు మాత్రమే. కానీ ఇపుడు ఏకంగా రెండు వేల కోట్లకు ఈ ఖర్చు ఎగబాకింది. అంటే పదింతలు అన్న మాట.
చంద్రబాబు ఈసారి కొత్తగా కనిపిస్తున్నారు. సాధారణంగా బాబు అభివృద్ధి వైపే మొగ్గు చూపిస్తారు. సంక్షేమం పట్ల ఆయనకు ఆసక్తి ఉన్నా అది కూడా ప్రయోజనకరంగా ఉండాలని భావిస్తారు. కానీ ఈసారి మాత్రం బాబు మారిపోయారు. తన చేతికి ఎముక లేదు అన్నట్లుగానే సూపర్ సిక్స్ పధకాలను అమలు చేస్తున్నారు. గత ఏడాది సామాజిక పెన్షన్లు ఏకంగా నాలుగు వేలకు పెంచారు. అలాగే, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించిన చంద్రబాబు ఒక్కో హామీని పట్టాలెక్కిస్తున్న తీరు చూస్తే ఆయన సూపర్ సిక్స్ మీద ఎంత పట్టుదలగా ఉన్నారో అర్ధం అవుతోంది.
ఏపీలో సంపద అయితే ఓవర్ నైట్ సృష్టించబడేది కాదు, దానికి ఎంతో సమయం పడుతుంది. మరి బావిని తవ్వేవరకూ దాహం ఆగదు కదా. మరి సూపర్ సిక్స్ హామీలను బాబు ఎలా నెరవేరుస్తారు అని అంతా అనుకున్నరు. స్వయంగా బాబు నిండు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తలచుకుంటే భయమేస్తోంది అన్నారు. కానీ ఆయనే వరసగా పధకాలను జనాలకు అందిస్తున్నారు. ఈ విషయంలో బాబు చాలా గట్టిగానే ఉన్నారు. ఏ ఒక్క పధకం అమలు చేయలేదన్న విమర్శ రాకూడని, ఆ విధంగా జగన్ కి చాన్స్ ఇవ్వరాదని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఖజానా ఎంతగా సహకరించకపోయినా చంద్రబాబు మాత్రం పంటి బిగువునా అన్నీ భరిస్తూ సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. మొత్తానికి ఒక్కో హామీని చంద్రబాబు అమలు చేస్తూంటే వైసీపీకి అస్త్రాలు అన్నీ లేకుండా పోతున్నాయి. సంక్షేమం మీదనే ఆధారపడిన వైసీపీ ఇపుడు టీడీపీ కూటమి మీద పోరాటం చేయాలంటే సరికొత్త అజెండాతో ముందుకు రావాల్సి ఉంది అని అంటున్నారు.