ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతను భవిష్యత్ సాంకేతికతలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దావోస్ పర్యటన రెండోరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీల సీఈవోలతో సమావేశమైన సీఎం, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో యువతకు విస్తృత శిక్షణ అందించేందుకు సహకరించాలని కోరారు.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి **నారా లోకేష్**తో కలిసి ఐబీఎం చైర్మన్ & సీఈవో **అర్వింద్ కృష్ణ**తో సమావేశమయ్యారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి AI, క్వాంటం, సైబర్ సెక్యూరిటీలో శిక్షణ ఇవ్వాలని ఐబీఎం నిర్ణయించిన నేపథ్యంలో, అందులో భాగంగా 10 లక్షల మంది ఏపీ యువతకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని సీఎం ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఐబీఎం సీఈవో సానుకూలంగా స్పందిస్తూ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అమరావతిలో ఐబీఎం భాగస్వామ్యంతో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు అంశంపైనా విస్తృతంగా చర్చ జరిగింది. క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏపీలో నెలకొల్పాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇది పరిశోధన–అభివృద్ధి, స్టార్టప్‌లకు ఊతమివ్వడమే కాకుండా గ్లోబల్ టెక్ హబ్‌గా అమరావతిని నిలబెట్టే దిశగా కీలక అడుగుగా మారనుందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం గూగుల్ క్లౌడ్ సీఈవో **థామస్ కురియన్**తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. విశాఖపట్నంలో నిర్మించనున్న **‘గూగుల్ AI డేటా సెంటర్’**పై ఇరువురి మధ్య కీలక చర్చ జరిగింది. ఎలాంటి జాప్యం లేకుండా డేటా సెంటర్ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం కోరగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ డేటా సెంటర్ ద్వారా ఏపీ డిజిటల్ ఎకానమీకి మరింత బలం చేకూరనుందని అభిప్రాయపడ్డారు.
ఇక వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రోపర్టీ ఆర్గనైజేషన్ (WIPO) డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్, డైరెక్టర్ **అనిల్ మూర్తి**తోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఆవిష్కరణలకు ప్రోత్సాహం, మేధోసంపత్తి హక్కుల రక్షణ, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, పరిశోధన–అభివృద్ధి, పేటెంట్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఆర్థిక వృద్ధికి ఆవిష్కరణలే పునాది అని, ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ ఎకానమీ & ఇన్నోవేషన్ ఆధారిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ దిశగా రాష్ట్రంలోని స్టార్టప్ వ్యవస్థకు WIPO సహకారం అందించాలని ఆయన ప్రతిపాదించారు. దావోస్ వేదికగా జరిగిన ఈ భేటీలు, ఏపీ భవిష్యత్ టెక్నాలజీ ప్రయాణానికి మైలురాయిగా నిలుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






