ముఖ్యమంత్రి చంద్రబాబు 4.O ప్రభుత్వంలో సరికొత్త ఆలోచనలను ఆవిష్కరిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలతో సంక్షేమాన్ని పరుగులు తీయిస్తున్న చంద్రబాబు.. గతంలో ఎన్నడూ లేనట్లు ప్రస్తుత పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలో మూగ జీవాల క్షేమాన్ని కాంక్షిస్తూ వాటి కోసం హాస్టళ్లు నిర్మించాలనే ఆలోచన ఉన్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం మాచర్ల నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు వేల మంది ప్రజల సమక్షంలో పశువుల కోసం హాస్టళ్లు నిర్మించనున్నామని ప్రకటించారు.
ఇప్పటివరకు పిల్లలు, వృద్ధులు, మహిళల కోసమే ప్రత్యేక హాస్టళ్లు పెట్టామని, ఇకపై పశువులకు కూడా హాస్టళ్లు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మున్సిపల్ పట్టణాల్లో పశువుల హాస్టళ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. పశువులు రోడ్డుపై తిరుగుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని, అదే సమయంలో రోడ్డుపై చెత్తాచెదారాలు తింటూ వాటి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాయని చంద్రబాబు తెలిపారు. మూగజీవాల ఆరోగ్య సంరక్షణతోపాటు చిన్న, సన్నకారు పాడి రైతులకు మేలు చేసేలా హాస్టళ్లను నిర్మించనున్నామని సీఎం చెప్పారు.
పశువుల హాస్టళ్లలో షెడ్లు, మేత, తాగునీరు, ఇతర ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండనున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఒకటి రెండు ఆవులను పెంచుకుంటున్న కుటుంబాలు వాటిని సరిగా చూసుకోలేకపోతున్నాయని, అందువల్ల వాటిని సరైన విధంగా సంరక్షించుకోలేకపోతున్నట్లు చంద్రబాబు చెప్పారు. పశువుల హాస్టళ్ల వల్ల రైతు కుటుంబాలకు మేలు జరగడంతోపాటు పరిశుభ్రత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రతిపాదించిన పశువుల హాస్టళ్లను ఎప్పుడు ప్రారంభిస్తారనే ఆసక్తి నెలకొంది. ముందుగా పట్టణాల్లో ఉన్న పశువులపై సర్వే నిర్వహించి ఎక్కడ ఎన్ని నిర్మించాలనే నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు 3.O సర్కారులోనే పశువుల హాస్టళ్లను నిర్మించే ప్రతిపాదన వచ్చింది. కాకపోతే అప్పట్లో ఈ హాస్టళ్లను గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. కొన్ని ప్రాంతాల్లో హాస్టళ్ల నిర్మాణానికి నిధులు, భూములు కేటాయించింది. అయితే ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో హాస్టళ్లను నిర్మించాలనే ఆలోచనను అంతా స్వాగతిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు పట్టణ ప్రాంతాల్లో పశువులు రోడ్డుపై విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. సరైన ఆహారం లభించక ప్లాస్టిక్ తింటూ అనారోగ్యం పాలవుతున్నాయి. ఇలాంటి వాటిని హాస్టళ్లకు తరలించడం వల్ల వాటి ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.