సీఎం చంద్రబాబుకు.. సొంత పార్టీ నాయకులతోనే తలనొప్పులు వస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రాకముందు.. సైలెంట్‌గా ఉండే నాయకులు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మాత్రం తమ విశ్వరూపం చూపిస్తున్నారు. దీంతో చంద్రబాబుకు ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. వైసీపీ నాయకులు అరాచకాలు చేస్తున్నారని.. ప్రజలను బెదిరించారని.. అక్రమాలకు పాల్పడ్డారని.. ప్రభుత్వం పదే పదే చెబుతోంది. దీనికి సంబంధించి.. కొందరిపై కేసులు కూడా నమోదు చేస్తోంది.
ఇక, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. సోషల్ మీడియాలోనూ.. దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీ నాయకులు.. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు సూచిస్తున్నారు. వారికి దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. అయితే.. వైసీపీ వైపు ఒక వేలు చూపిస్తుంటే.. సొంత పార్టీ నాయకుల వైపు నాలుగు వేళ్లు కనిపిస్తున్నాయి. వారు చేస్తున్న వ్యాఖ్యలు.. అధికారులు.. సహా ప్రత్యర్థులపై వారి దూకుడు వంటివి వివాదాస్పదంగా మారాయి. మహిళలను వైసీపీ కించపరిచింది అని ప్రచారం చేసేలోగా.. టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలిపై తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేశారు.
దీంతో వైసీపీ పై వ్యతిరేక ప్రచారం చేయాలని అనుకుని కూడా వెనక్కి తగ్గారు. ఇక, వైసీపీ అధినేత జగన్‌కు పోలీసులు అంటే లెక్కలేదు.. వారిపై దూషణలు చేస్తున్నారని ప్రచారం చేయాలని అనుకున్న సమయంలో అన్నీ ఏర్పాట్లు చేసుకున్న సమయంలో అనంతపురానికి చెందిన సీనియర్ నేత ఒకరు ఏకంగా ఏఎస్పీని అరెయ్-ఒరేయ్ అంటూ దూషించారు. పోనీ.. అధికారులనైనా వదిలారా? అంటే అది కూడా లేదు. ఇక, వైసీపీ అక్రమాలు చేసిందని ప్రచారం చేస్తున్నారు.
కానీ…. మరోవైపు.. టీడీపీ నేతలు చేస్తున్న వాటిని అనుకూల మీడియానే వెలుగులోకి తీసుకువస్తోంది. దీంతో తమ్ముళ్ల నుంచి పెద్ద ఎత్తున చంద్రబాబుకు సెగ తగులుతోంది. వారు మారేలా కనిపించడం లేదు. పోనీ.. ఇప్పటికిప్పుడు వారిని మార్చుదామా? అంటే అది కూడా సాధ్యం కాదు. దీంతో చంద్రబాబు వేచి చూస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటి వరకు వేచి చూసి.. అప్పుడు మార్పులు చేస్తారా? అంటే.. చేయొచ్చు. కానీ.. అప్పటికే ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే.. ఇబ్బందులు వస్తాయి. సో.. దీనిని బట్టి.. చంద్రబాబు ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకోవాలన్న చర్చ కూడా సాగుతోంది. మరి ఏం చేస్తారో చూడాలి.