వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారాలు, రౌడీయిజం, తప్పుడు విధానాలనే సిద్ధాంతాలుగా చేసుకుని పనిచేస్తోందని, వారిది విషపూరిత రాజకీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దాపురంలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లలో వైసీపీ అనుసరించిన కుట్రపూరిత రాజకీయాలను పది కీలక సంఘటనలతో ప్రజల ముందుంచారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా వైసీపీ తీరు మారలేదని, ‘అరుంధతి’ సినిమాలో భూతంలా ‘నిన్ను వదల బొమ్మాళీ’ అంటూ మళ్లీ ప్రజలను పీడించేందుకు ప్రయత్నిస్తోందని, అలాంటి పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
గత 10 ఏళ్లలో జరిగిన ఓ 10 ఘటనలు మీకు చెబుతాను. వాటి ద్వారా మన రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పార్టీ ఉందో, వాళ్ల క్రిమినల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో మీరే అర్థం చేసుకోండి.
1. వివేకా హత్య కేసు: బాబాయి హత్య అనేది దేశంలోనే క్రిమినల్ పాలిటిక్స్‌కు కేస్ స్టడీ.. అవునా, కాదా? తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ది పొందారా లేదా?
2. కోడి కత్తి డ్రామా: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడు కోడి కత్తి డ్రామా ఎలా ఆడారో….అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు ఎటుపోయిందో మీరు గుర్తుతెచ్చుకోవాలి. దీన్ని మిస్టరీగా మార్చారు.
3. గులకరాయి దాడి: సీఎంగా ఉండి గులకరాయితో హత్యాయత్నం అంటూ కట్టు కట్టుకుని ఎన్నికల డ్రామా ఆడారు.
4. డయాఫ్రమ్ వాల్: అసమర్ధతో, నిర్లక్ష్యంతో, అహంకారంతో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణమై…ఆ నెపాన్ని మాపైనే నెట్టారు.
5. పింఛన్ల నిలిపివేత: 2024 ఎన్నికల సమయంలో వాలంటీర్లతో పింఛన్లు ఇవ్వొద్దంటే ఏకంగా ఇంటి కెళ్లి పింఛను ఇవ్వడమే ఆపేశారు. మండుటెండల్లో 16 మంది వృద్ధుల ప్రాణాలు తీసి దానికి చంద్రబాబు కారణం అని సొంత మీడియా ద్వారా ఊదర గొట్టారు.
6. సింగయ్య మృతి: పరామర్శల పేరుతో యాత్రలు చేస్తున్నారు. ఈ రాజకీయ ఉనికి యాత్రల కోసం అమానుషంగా తమ వెహికల్‌తో తొక్కించి సింగయ్య అనే కార్యకర్త ఉసురు తీశారు. వీడియో బయటపడే వరకు అసలు ఏం జరిగిందనే విషయాన్ని దాచిపెట్టారంటే ఏ స్థాయి క్రిమినల్స్ అనేది అర్ధం చేసుకోవాలి.
7. వీడియో మార్ఫింగ్: జనం తనకోసం ఎగబడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. నెల్లూరు పర్యటనలో బంగారుపాళ్యం జనాన్ని చూపించి మిక్స్ చేసి చూపించారు.
8. మునిగింది రాజధాని కాదు…వైసీపీ: రాజధాని అమరావతిపై ఎప్పుడూ విషం కక్కే వైసీపీ…అమరావతి మునిగింది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమరావతిపై విషం చిమ్మాలనే ప్రయత్నంలో రాష్ట్ర బ్రాండ్ ను కూడా దెబ్బ తీస్తున్నారు. రాజధాని మునగలేదు…విష ప్రచారంలో వైసీపీ మునిగిపోయింది. రాజకీయంగాను పూర్తిగా మునిగిపోతుంది.
9. పెట్టుబడులు వద్దంటూ లేఖలు: తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కంపెనీలను వెళ్లగొట్టిన వైసీపీ పాలకులు… ప్రతిపక్షంలోనూ కుట్రలు కంటిన్యూ చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రానివ్వకుండా సంస్థలకు లేఖలు రాస్తున్నారు.
10. పింఛన్లపై తప్పుడు ప్రచారాలు: ఇప్పుడు మళ్లీ పింఛన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ల హయాంలో వేలు, లక్షల మంది అనర్హులకు,పార్టీ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు. వీటిపై వెరిఫికేషన్ జరుగుతుంటే…4 లక్షల పింఛన్లు తీసేశారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒక్క పింఛను కూడా ఇప్పటికి తీయలేదు. అర్హులైన వారి ఏ ఒక్క పింఛను కూడా తీసేది లేదు. అనర్హులకు తప్పుడు పత్రాలతో పింఛన్లు ఇప్పించారు. అలాంటి వారి పింఛన్లు తొలగిస్తాం.
ఇదీ… వైసీపీ నీచ రాజకీయం….ఇవి కేవలం 10 ఉదాహరణలు మాత్రమే. వాళ్ల రాజకీయం ఏంటో…వాళ్ల పోకడలు, విషపు ఆలోచనలు ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి… 2024 ఎన్నికల తీర్పు తరువాతా వాళ్లు మారలేదు. మీరంతా పాతాళానికి తొక్కేసినా అరుంధతి సినిమాలో బూతం “నిన్ను వదల బొమ్మాళీ వదల” అంటూ వెనుక పడినట్లు మళ్లీ బయటకు వస్తున్నారు. పూర్తిగా భూ స్థాపితం చేయాల్సిందే… అని చంద్రబాబు స్పష్టం చేశారు.
మరో దుష్ప్రచారానికి తెరలేపారు!
ప్రస్తుతం పింఛన్ల వెరిఫికేషన్ జరుగుతుంటే, నాలుగు లక్షల పింఛన్లు తీసేశారంటూ మరో దుష్ప్రచారానికి తెరలేపారని అన్నారు. “వారి హయాంలో వేలమంది అనర్హులకు, పార్టీ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు. వాటిని మాత్రమే తొలగిస్తాం. అర్హులైన ఒక్కరి పింఛను కూడా తీసేది లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో ఒక తప్పుడు పోస్టు పెట్టడం, దాన్ని తమ అనుకూల మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడమే వైసీపీ రాజకీయమని చంద్రబాబు విమర్శించారు. తమది అభివృద్ధి, సంక్షేమం, విజన్‌తో కూడిన రాజకీయమైతే, వైసీపీది అనర్థం, సంక్షోభం, క్రిమినల్ రాజకీయమని అభివర్ణించారు. ఇలాంటి పార్టీ రాష్ట్రానికి అవసరం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.