విజయసాయిరెడ్డి ఆయన ట్విట్టర్ వైసీపీ నేతగా ఉన్నపుడు ఎపుడూ బాబు అండ్ కోనే ట్రిగ్గర్ చేస్తూ ఉండేది. రోజుకు వీలైనన్ని ట్వీట్లు బాబుకు ఆయన పార్టీకి వ్యతిరేకంగా పెడుతూ ఒక విధంగా సంచలనం రేపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఇదంతా గతం. రాజకీయాల్లో వర్తమానమే ఎపుడు కౌంట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ అన్నది వాలీడ్ కానే కాదు, సో విజయసాయిరెడ్డి ఇపుడు ఏమిటి అంటే వైసీపీకి దూరం అయిన వారు, మాజీ ఎంపీ. దాంతో ఆయన ఇపుడు ఒక విధంగా తటస్థుడు అని పేర్కొనాలి.
సాయిరెడ్డి ఈ ఏడాది జనవరి 25న వైసీపీకి రాజీనామా చేశారు. ఆ తరువాత రాజ్యసభ సీటు వదులుకున్నారు. ఆయన మీద ఎన్నో ఊహాగానాలు వచ్చాయి ఆయన బీజేపీలో చేరుతారు అని తిరిగి ఎంపీ అవుతారు అని అనుకున్నారు. అయితే అవేమీ వర్కౌట్ కాలేదు, ఇక ట్విట్టర్ ద్వారా రెగ్యులర్ గా సాయిరెడ్డి చేసే సౌండ్ కూడా అలా సైలెంట్ అయింది. ఈ మధ్యలో మరో ప్రచారం ఆయన వైసీపీలో చేరుతారు అని. అయితే జగన్ దానికి అంగీకరించడం లేదని మరో ప్రచారమూ బయటకు వచ్చింది. మొత్తానికి సాయిరెడ్డి అయితే ప్రస్తుతానికి ఏ రాజకీయ గాలీ సోకని వారుగానే ఉన్నారు.
విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఇదే విషయం తెలుగుదేశం దాని మీడియా గట్టిగానే ప్రచారం చేసుకుంటూ వస్తోంది. దీని మీద రీసెంట్ గా సాయిరెడ్డి స్పందిస్తూ బాబుకు ఒక మంచి సలహానే ఇచ్చారు అని భావించాలి. ఏపీలో పెటుబడులు పెట్టాలనుకునే వారు చేసుకున్న ఒప్పందాలు గ్రౌండ్ కావాలీ అంటే ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి ఎప్పటికపుడు మానిటరింగ్ చేయాలని సాయిరెడ్డి సూచించారు. అంతే కాకుండా రియల్ టైం వెబ్ సైట్ కూడా ఓపెన్ చేసి ఈ 613 ఒప్పందాలు ఏ మేరకు ముందుకు వచ్చాయో అందరికీ తెలిసేలా చూడాలని కోరారు.
ఇక ఈ పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణతో పాటు గ్రౌండ్ అయ్యేలా వ్యవహరిస్తే మాత్రం అందులో కనీసంగా 75 శాతం అంటే 10 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయినా కూడా ఏపీ దశ మొత్తం మారిపోతుందని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఏపీ గణనీయమైన అభివృద్ధి తాను కోరుకుంటున్నట్లుగా సాయిరెడ్డి చెబుతున్న ఈ మాటలు అయితే బాబు చేస్తున్న ప్రయత్నాలకు ప్రశంసా పూర్వకంగా ఉన్నాయని అనుకోవాలి. మరి సాయిరెడ్డి వంటి వారు సైతం బాబు విషయంలో ఈ విధంగా సానుకూలంగా వ్యవహరిస్తున్న తీరు ఏపీ రాజకీయాల్లో చర్చనీయంశమే అని అంటున్నారు.

















