వియ్యంకుడు కం బావమరిది బాలయ్య అసెంబ్లీకి రాక రాక వచ్చి రచ్చ చేసి వెళ్లారు. ఆయన అసెంబ్లీలో చిరంజీవి మీద చేసిన వ్యాఖ్యలు మీద మెగా ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. అదే సమయంలో ఒక బలమైన సామాజిక వర్గం సైతం రగులుతోంది. ఇక వీటి అన్నింటి కంటే ఎక్కువగా చూస్తే మెగాస్టార్ స్పీడ్ రియాక్షన్. ఆయన ఎక్కడో విదేశాల్లో ఉండి కూడా వెంటనే రెస్పాండ్ కావడం తన ఆవేదనను ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ ఎపిసోడ్ మాత్ర అలా కంటిన్యూ అవుతోంది. దాంతో కూటమిలో ఒక గంభీర వాతావరణం నెలకొంది అని అంటున్నారు జనసేన టీడీపీల మధ్య గ్యాప్ ఉందా అన్నది ఒక చర్చ అయితే దానిని పెంచి పెద్దది చేసేందుకు వైసీపీ ఎటూ కాచుకుని కూర్చుని ఉంది అన్నది మరో విషయం. ఏది ఏమైనా మెగాస్టార్ తీవ్రంగా మనస్థాపానికి గురి అయ్యారు అన్నది వాస్తవం. మరి ఏమి చేయాలి అన్నదే కదా అసలైన చర్చ.
ఇక విషయంలోకి వెళ్తే బాలయ్యకు చిరంజీవికి మధ్యన మొదటి నుంచి గ్యాప్ అనేది ఉంది అని సినీ జనాలు చెప్పుకుంటారు. ఈ ఇద్దరి మధ్యన సాన్నిహిత్యం చూసిన వారు తక్కువ అని అంటారు. సుదీర్ఘమైన ఈ ఇద్దరి కెరీర్ కూడా పోటా పోటీగా సాగింది. కెరీర్ లో ఉన్న పోటీ కూడా వారి మధ్యన గ్యాప్ కి కారణం అని చెబుతారు. మరో వైపు చూస్తే చిరంజీవికి జనసేన పార్టీ టీడీపీ తో కలవడం మొదటి నుంచి ఇష్టం లేదు అని చెబుతారు. దానికి కారణం చాలానే ఉంది. ఇక కమ్మ కాపుల మధ్య కూడా పడదు అని మరో ప్రచారం కూడా ఉంది. సినీ రంగంలో అది స్పష్టమైన విభజనగా ఉంటూ వచ్చింది. రాజకీయంగా అయితే ఒక మ్యాజిక్ గా ఏపీలో టీడీపీ జనసేన పొత్తుతో ఉన్నాయని చెబుతారు.
ఇక బాలయ్య వైఖరి చూస్తే ఓపెన్ గా ఉంటుంది. ఆయన ముందు పర్యవసానాలు చూసుకోరు అంటారు. తనకు తోచినది అనేస్తారు. ఆయన పాత వీడియోలలో కూడా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పటికీ యూ ట్యూబ్ లో అలా ఉన్నాయి. వాటిని ఇదే సమయంలో బయటకు తెచ్చి వైసీపీ చేయాల్సింది అంతా చేస్తోంది. అంతే కాదు వైఎస్సార్ బాలయ్య ఇంట్లో కాల్పుల కేసుల విషయంలో చేసిన హెల్ప్ గురించి అలాగే బసవతారకం ఆసుపత్రికి కోట్ల రూపాయలను జగన్ సీఎం గా ఉన్నపుడు రిలీజ్ చేసిన వ్యవహారాన్ని కూడా వైసీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ హైలెట్ చేస్తూనే ఉన్నారు. ఇక అఖండ సినిమా సమయంలో బాలయ్య జగన్ ని కలవడానికి చేసిన ప్రయత్నం గురించి అసలు విషయం మాజీ మంత్రి పేర్ని నాని చెప్పేశారు. నేను జగన్ ని కలవను అని బాలయ్య అన్న మాటలకు ఇది కౌంటర్ ఎటాక్ అన్న మాట.
ఏపీలో చూస్తే కులాల సమాహారంగా రాజకీయం ఉంటుంది. కులాలు బహు సున్నితమైనవి. వాటిని డీల్ చేయాలంటే తలకాయ నొప్పిగానే ఉంటుంది. కుడి ఎడమలను తూర్పు పడమరలను కూడా జట్టు కట్టించి కూటమి పెట్టించిన చంద్రబాబు పొత్తుల రాజకీయానికి ఈ విధంగా ఇబ్బందులు రావడం అంటే అది బిగ్ ట్రబుల్ గానే చూస్తున్నారు. ఒక బలమైన సామాజిక వర్గం రగులుతోంది అన్నది కూడా ఉంది దీంతో టీడీపీకే ఎటు చూసినా ఈ పరిణామాలు డ్యామేజ్ గా మారుతున్నాయని అంటున్నారు..
ఇక ఈ విధంగా కూటమిలోనే చిచ్చు పెట్టినట్లుగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయని అంటున్నారు. దాంతో వీటికి తక్షణం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని టీడీపీలో భావనగా ఉందిట. సాధ్యమైనంత త్వరలో చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవితో భేటీ అవుతారు అని అంటున్నారు. అలాగని నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్ళినా లేక ఆయనను రప్పించుకున్నా వేరే సంకేతాలు వెళ్తాయని ఆలోచిస్తున్నారు. అందుకే ఒక కామన్ ఫంక్షన్ లోనే మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు కలిసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. అలా కలుసుకుని మనసు విప్పి ఇద్దరూ మాట్లాడుకుంటారు అని ఆ విధంగా మెగా స్టార్ కోపాన్ని చల్లార్చే ప్రయత్నం అయితే చేస్తారని టాక్ బాగా నడుస్తోంది.
ప్రస్తుతానికి చిరంజీవి అయితే దేశంలో లేరు. ఆయన విదేశాల నుంచి వచ్చిన తరువాత తొందరలోనే ఈ భేటీ ఉండొచ్చు అని అంటున్నారు. ఇక ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది కానీ కూటమిలో రెండు పార్టీల క్యాడర్ లీడర్ తొందర పడకుండా కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు అని అంటున్నారు. అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి మీద వ్యతిరేకంగా ఏ రకమైన ట్రోల్స్ కానీ పోస్టులు కానీ పెట్టవద్దు అని కూడా ఆదేశాలు వెళ్ళాయని అంటున్నారు. సో మొత్తానికి బాబు రంగంలోకి దిగుతున్నారన్న మాట. ఈ ఆసక్తికరమైన భేటీ అయితే ఉండొచ్చు అని అంటున్న క్రమంలో వెయిట్ అండ్ సీ.