గత 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత.. వచ్చిన రెండు ఉప ఎన్నికలు చిన్నవే అయినా.. వైసీపీపై తీవ్ర ప్రభావం చూపించాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఒక్కదానిలో కూడా డిపాజిట్ దక్కకపోవడంతోపాటు.. పార్టీలోనూ విభేదాలు కనిపించాయి. ఈ ఎన్నికలను పక్కన పెడితే.. పార్టీ ఫ్యూచర్ ఏంటనే విషయాలపై ఇప్పుడు అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్ తెలుసుకోవాల్సినవి.. తెలియాల్సినవి కూడా చాలా ఉన్నాయని నాయకులు అంటున్నారు.
చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని అంటారు. ఇప్పుడు జగన్ విషయంలోనూ ఇదే వినిపిస్తోంది. వాస్తవానికి ఇలాంటి విషయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబును ఉదాహరణగా తీసుకుంటే.. ఆయనకు ఎన్నికలు అంటే.. ఎన్నికలే. అవి చిన్నవా.. పెద్దవా.. అని లెక్కలు వేసుకుని కూర్చోరు. నేరుగా ఆయనే రంగంలోకి దిగుతారు. తాజాగా జరిగిన రెండు ఉప ఎన్నికల్లో సీఎంగా ఆయన బయటకు రాకపోయినా.. నిరంతరం నాలుగు గోడల మధ్య కూర్చుని మానీటిరింగ్ చేశారు. ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే.
ఈ తరహా రాజకీయాలు చేయడంలో జగన్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆయన బయటకు రారు. ఒక్కరికి బాధ్యతలు అప్పగించేసి.. పని అయిపోయినట్టుగా భావిస్తారు. అలా కాకుండా.. నేరుగా జగనే తాడేపల్లిలో కాకుండా.. పులివెందులలోనే మకాం వేసి ఉంటే.. ఫలితం వేరేగా ఉండేదన్న టాక్ వినిపిస్తోం ది. కానీ.. దీనిని ఆయన లైట్ తీసుకున్నారు. చిన్న ఎన్నికకు నేనెందుకు దిగడం అనుకున్నారు. దీంతో అసలు ఎన్నికలు రెండు రోజుల ముందు వరకు పులివెందుల, ఒంటిమిట్టల్లో ఏం జరుగుతోందో కూడా ఆయన పట్టించుకోలేదన్న మాట వినిపిస్తోంది.
చివరకు చేతులు కాలిపోయిన తర్వాత.. అధికార పార్టీపై విమర్శలు చేయడానికి పరిమితం అయ్యారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పలువురు నాయకులను రంగంలోకి దింపినా.. వారు కూడా చేతులు ఎత్తేశారం టే.. అధికార పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగిందన్నది సుస్పష్టంగా కనిపిస్తోంది. సో.. ఇక నుంచి అయినా.. జగన్ మార్పు దిశగా అడుగులు వేసి.. తెలియాల్సినవి.. తెలుసుకోవాల్సినవి .. లెక్కలు వేసుకుని.. వ్యవహరిస్తే.. పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని సొంత నేతలే తెరచాటున వ్యాఖ్యలు చేస్తున్నారు.