తెలంగాణా రాష్ట్రంలో ఇపుడు అందరిలో ఆసక్తిని పెంచుతున్నది జూబ్లీ హిల్స్ పోరు. ఉప ఎన్నిక అనూహ్యంగా వచ్చిపడింది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు ఏ రకమైన ఎన్నికలను కోరుకోవు. అదే విపక్షంలో ఉన్న పార్టీలు అయితే బస్తీ మే సవాల్ అంటాయి. ఇపుడు ఎన్నిక పెట్టండి ఓడించెస్తామని సవాల్ చేస్తూంటాయి. అయితే తప్పనిసరి ఎన్నికలు కొన్ని వస్తూంటాయి. అలాగే అనూహ్యంగా అనివార్యంగా వచ్చి పడే ఎన్నికలు మరి కొన్ని ఉంటాయి. ఆ విధంగా చూస్తే కనుక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అవసరార్ధం వచ్చింది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఎన్నికలు ఇవి.
కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక ఒక విధంగా అగ్ని పరీక్షగానే చెప్పాలి. ఎందుకంటే అర్బన్ ఏరియాలో అందులోనూ తాము గత మూడు నాలుగు ఎన్నికలూ గెలవని చోట తమది కాని సీటులో ఫైటింగ్ ఇవ్వాల్సి వస్తోంది. నిజంగా ఇది రిస్కీ టాస్క్. అయితే కాంగ్రెస్ చేతిలో అధికారం ఉంది. అంతే కాదు డైనమిక్ సీఎం గా జనంలో గుర్తింపు ఉన్న రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక కాంగ్రెస్ రెండేళ్ళ పాలనలో తమ గ్రాఫ్ అర్బన్ సెక్టార్ లో బాగా పెరిగింది అని భావిస్తోంది. అందుకే తొడగొట్టి మరీ జూబ్లీ హిల్స్ రేసులో నిలుస్తోంది.
ఇక జూబ్లీ హిల్స్ సీటుకి సంబంధించి కాంగ్రెస్ తన అభ్యర్ధిని ఎంపిక విషయంలో సకల జాగ్రత్తలు పాటించింది. అక్కడ ఉన్న సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని మరీ ఎంపిక చేసింది. అలా నవీన్ యాదవ్ కి టికెట్ ఇచ్చింది. లోకల్ కార్డుతో పాటు బీసీ ప్లస్ మైనారిటీల మద్దతు ఏకమొత్తంగా కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్ ని రెడీ చేసింది. ఈ దెబ్బతో జూబ్లీ హిల్స్ ని గెలిచి తమది కాని సీట్లో జెండా ఎగరేయాలని ఉబలాటపడుతోంది.
అదే సమయంలో తన సొంత సీట్లో మరోసారి సత్తా చాటాలని బీఆర్ఎస్ ఆరాటపడుతోంది. రెండు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో ఈ సీటు బీఆర్ఎస్ కే దక్కుతూ వస్తోంది. బలమైన అభ్యర్ధిగా ప్రజల మన్నన అందుకున్న ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాధ్ ఉన్నారు అదే కుటుంబానికి టికెట్ ఇవ్వడం ద్వారా సానుభూతి తమకు కలసి వస్తుందని కూడా బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. అందరి కంటే ముందుగా తన అభ్యర్థిని ప్రకటించడం మహిళకు టికెట్ ఇవ్వడంతో పాటు అర్బన్ ఓటర్లలో తమకు ఉన్న పట్టు అన్నీ కలసి గెలుపు ఖాయమని అనుకుంటోంది.
ఇక అసలు విషయానికి వస్తే బీజేపీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందా అంటే జవాబు చెప్పడం కష్టం. అదే సమయంలో అర్బన్ ఓటింగ్ బీజేపీకి ప్రతీ ఎన్నికలోనూ పెరుగుతోంది. దానికి తోడు మోడీ ఫ్యాక్టర్ కూడా కలసి వస్తోంది. దానికి గతంలో జరిగిన జీహెచ్ ఎం సీ ఎన్నికలు ఒక ఉదాహరణ. బీఆర్ ఎస్ తో సమానంగా అర్బన్ లో బీజేపీ తన సత్తా చాటింది. ఇపుడు అదే ఫార్ములాతో బరిలోకి దిగుతోంది. అయితే బీజేపీ రాజకీయంగా ఎంత దూకుడు చేసినా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ లను తట్టుకుని రేసులో ముందుకు దూసుకుని పోగలదా అన్నదే చర్చగా ఉంది.
అయితే బీజేపీ మాత్రం తన వ్యూహాలను నమ్ముకుంది. అద్భుతాలు సృష్టిస్తామని అంటోంది. అయితే బీజేపీ జోరు చేస్తే ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుంది కానీ గెలుపు అన్నది కష్టమే అన్న చర్చ ఉంది. మరి బీజేపీ చీల్చే ఓట్లు ఏ పార్టీవి అన్నది మరో చర్చగా ఉంది. అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ ఎస్ గా ఈ ఉప ఎన్నిక మారితే అచ్చమైన గేమ్ చేంజర్ గా బీజేపీ మారుతుంది అని అంటున్నారు. ఒకవేళ త్రిముఖ పోటీగా టర్న్ తీసుకున్న బీజేపీ కచ్చితంగా ఏదో ఒక పార్టీ కొంప ముంచడం ఖాయమని అంటున్నారు. మరి కమలం కదన కుతూహలం ఏ రాజకీయ పార్టీకి ఎసరు పెడుతుంది అన్నది చర్చ. ఒక వేళ బీజేపీ ధీమా ప్రకారం అద్భుతమే జరిగి గెలిచింది అంటే కనుక ఆ లెక్క వేరే గా ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.!