- బుడమేరు గండ్లు మరమ్మత్తులకు పూర్తైన టెండర్ల ప్రక్రియ.
- సీజన్ మొదలయ్యే నాటికి పనులు పూర్తి చేయాలి.
- ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నిమ్మల.
బుడమేరు ఆకస్మిక వరదలకు కారణమైన మూడు గండ్లుకు సంబంధించిన మరమ్మత్తుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తవ్వడంతో, పనులు వెంటనే మొదలుపెట్టి, సీజన్ పూర్తయ్యేలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు జలవనరుల శాఖ మంత్ర నిమ్మల రామానాయుడు. బుధవారం అమరావతి సచివాలయంలో బుడమేరు ఆధునీకరణ, పోలవరం ఎడమ కాలువ పనుల పై, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారాయన. ఈ సమీక్షలో ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు, మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బుడమేరు డైవర్షన్ కెనాల్ ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి నిమ్మల రామానాయుడు. బుడమేరు వరద ఎనికేపాడు మీదుగా కొల్లేరు మీదుగా, ఉప్పుటేరు నుండి సముద్రంలో కలిసేలా, ప్రత్యేకంగా డీపీఆర్ తయారు చేసి నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. అదేవిధ:గా బుడమేరు ఓల్డ్ ఛానెల్ కు సమాంతరంగా, మరొక కొత్త ఛానెల్ ను కూడా 20 వేల క్యూసెక్కుల సామర్ద్యంతో అభివృద్ది చేయడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద, కేంద్రం సహాకారంతో ముందుకు వెళ్ళేలా, మున్సిపల్, రెవిన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల సమన్వయంతో అంచనాలు తయారు చేసి ముందుగా నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు కు అందజేస్తామని అన్నారు. భవిష్యత్తులో బుడమేరు వరదల వల్ల విజయవాడకు ఎటువంటి ప్రమాదం లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.