తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్ పార్టీలో మరో కుదుపు ఏర్పడింది. కీలక నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం బీఆర్ ఎస్‌లో కలివిడి లేదని, అధినేత ఫామ్ హౌస్‌కు పరిమితమైతే.. ఆయన కుమారుడు కేటీఆర్ ఇంటి గుమ్మం కూడా దాటడం లేదని పెద్ద ఎత్తున నాయకులు చర్చిస్తున్నారు. ఇక, కేసీఆర్ కుమార్తె కవిత కూడా.. సెగ పెడు తున్న విషయంతెలిసిందే. దీంతో రాష్ట్రంలో బీఆర్ ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్టుగా మారిందని నాయకులు చెబుతు న్నారు. ఈ క్రమంలో పలువురు నాయకులు.. దీపం ఉండగానే అన్నట్టుగా.. తమ దారి తాము చూసుకుంటున్నారు.
బీఆర్ ఎస్‌కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. అయితే.. వీరు కేవలం మాజీలే కాదు.. వారు స్థానికంగానే కాకుండా.. సామాజిక వర్గం పరంగా కూడా ఓట్లను ప్రభావితం చేయగల నాయకులు కావడం గమనార్హం. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు బహిరంగంగానే చెబుతున్నారు. ఆయన గత కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పైగా.. నియోజకవర్గంలోనూ యాక్టివ్‌గా లేకుండా పోయారు. అయితే.. అంతర్గతంగా ఆయన.. బీజేపీ నేతలతో కలిసి పనిచేస్తున్నట్టు చర్చ సాగుతోంది. దీంతో త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరుకునే అవకాశం ఉందని సమాచారం.
అలాగే.. మాజీ ఎమ్మెల్యే, కీలక నాయకుడు గువ్వల బాలరాజు కూడా.. పార్టీకి రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో తాను నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్‌ను ఆశించినట్టు ఆయన చెబుతున్నారు. అయితే.. అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన మాజీ ఐపీఎస్, ఆర్ ఎస్ ప్రవీణ్‌కు టికెట్ ఇచ్చి.. తనను అవమానించారని బాలరాజు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో తాను పార్టీలో ఉండలేనని.. కార్యకర్తలు, అనుచరులు కూడా.. పార్టీ మారాలని సూచిస్తున్నారని చెబుతున్నారు. ఈయన కూడా త్వరలోనే బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వీరిద్దనే కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం మరో నలుగురైదుగురు పార్టీకి దూరం కావడం ఖాయమని సమాచారం. మరి దీనిపై బీఆర్ ఎస్ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.