బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆయన కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత కుటుంబ సమేతంగా శుక్రవారం సాయంత్రం కలుసుకున్నారు. ఉదయమే ఆమె వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. `అప్పాయింట్‌మెంటు` లభించలే దని తెలిసింది. వాస్తవానికి బిడ్డలకు అప్పాయింట్‌మెంటు కోరతారా? అనేది సందేహం. కానీ, కవిత శిబిరం మాత్రం అప్పాయింట్‌మెంటు రాలేదని.. అందుకే సాయంత్రం వరకు వేచి చూశారని చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే.. సాయంత్రం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో కుమార్తె, అల్లుడు, ఆమె బిడ్డలను కలుసుకున్న కేసీఆర్.. వారిని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కుమార్తెతో ఏకాంతంగా ఆయన సంభాషించారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు.. తెలంగాణ జాగృతి కార్యక్రమాలపై ఆయన సంభాషించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా డియర్ డాడీ లేఖపై కేసీఆర్ ప్రస్తావించినట్టు సమాచారం. ”నీ పద్ధతి బాలేదు బిడ్డా. మార్చుకోవాలి.” అని కేసీఆర్ సునిశితంగా హెచ్చరించినట్టు తెలిసింది. ”నా తర్వాత.. పార్టీ మీదేకదా. ఇప్పుడే ఎందుకు పంచాయితీ లు. నువ్వు చెప్పే మాటలు.. వాళ్లకి(ప్రత్యర్థులు) అవకాశం ఇచ్చినట్టు కాదా?!” అని ప్రశ్నించినట్టు సమాచారం.
ఈ సమయంలో మౌనం వహించిన కవిత.. కన్నీరు పెట్టుకున్నారని.. పార్టీ వర్గాలు చర్చిస్తున్నాయి. అంతా బాగానే ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలుస్తుందని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. ఎవరికి వారు రోడ్డున పడితే.. అందరినీ సరిచేయడానికి నేను పూనుకోలేనని, పార్టీ లైన్‌కు అనుగుణంగా నడుచు కుంటేనే ప్రజలు మనల్ని గౌరవిస్తారని కవితకు చెప్పినట్టు తెలిసింది. పదవుల కోసం కొట్లాటలు వద్దని.. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి, అధికారంలోకి వచ్చేలా చేయాలని ఆయన సూచించినట్టు సమాచారం.
కాగా.. తన కుమారుడు అమెరికాలో చదువుతున్న నేపథ్యంలో అతనిని వేరే స్కూల్లో జాయిన్ చేసేందుకు కవిత అమెరికాకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తండ్రి ఆశీస్సులు తీసుకునేందుకు ఆమె వచ్చారు. తొలుత అప్పాయింట్‌మెంటు ఇవ్వడానికి కేసీఆర్ సంకోచించారని, కానీ, మాతృమూర్తి శోభకి కవిత ఫోన్ చేయడం తో కేసీఆర్ అంగీకరించారని మరో వాదన నడుస్తోంది. గతంలో.. కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచినప్పుడు.. ఆయనకు సంఘీభావంగా కవిత ఎర్రవెల్లికి వెళ్లారు.కానీ, ఆమెను కేసీఆర్ అప్పట్లో పట్టించుకోలేదని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత.. ఇప్పుడే ఆమెకు తండ్రి దర్శనం లభించింది.