జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా ప్రతిష్టగా తీసుకున్నారు. ఒక విధంగా ఇది తన ఇమేజ్ ని పెంచేదిగా చేస్తుందని తలచారు. అవతల వైపు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయనతో ఢీ కొట్టి సక్సెస్ కొడితే చాలు ఇక బీఆర్ ఎస్ కారు జోరుని ఆపడం ఎవరి తరం కాదని కేటీఆర్ బాగానే స్కెచ్ గీసారు. అభ్యర్ధి ఎంపిక నుంచి ప్రచారం వరకూ ఎత్తులు పై ఎత్తుల దాకా అన్నీ తానై నడిపించారు. కానీ ఫలితం చూస్తే తేడా కొట్టింది. అయితే ఊరట ఏమిటి అంటే ఇంతటి ఓటమిలోనూ బీఆర్ఎస్ కి 75 వేల దాకా ఓట్లు రావడం చాలా ప్యాకెట్లలో పాత బలం పదిలపరచుకోవడం, కాంగ్రెస్ ని ఢీ కొట్టే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని జనాలకు రుజువు చేయడం.
ఇక ఓటమి తరువాత కేటీఆర్ మీద విమర్శల వర్షమే కురిసింది. సీఎం రేవంత్ రెడ్డి అయితే అహంకారాన్ని కేటీఆర్ తగ్గించుకోవాలని అన్నారు. కేసీఆర్ ది వయోభారమని కారు పార్టీ స్టీరింగ్ తిప్పడం కేటీఆర్ హరీష్ రావు వల్ల కాదని కూడా సెటైర్లు పేల్చారు. ఇక కేసీఆర్ తనయ, కేటీఆర్ చెల్లెలు అయిన కవిత కూడా కర్మ రిటర్న్స్ అంటూ సెటైరికల్ ట్వీట్ ని పెట్టింది. దాంతో కేటీఅర్ విషయంలో ఆయన నాయకత్వం విషయంలో చర్చ సాగుతుందని అనుకున్నారు కానీ అలా జరగలేదు, ఓటమి తరువాత నేరుగా ఫాం హౌస్ కి వెళ్ళి పెద్దాయన తన తండ్రి అయిన కేసీఅర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన నుంచి సలహాలు తీసుకున్నారు అని అంటున్నారు.
కేటీఅర్ జూబ్లీ హిల్స్ లో చేసిన ప్రచారం కానీ పడిన కష్టం కానీ కేసీఅర్ గుర్తించారు అని అంటున్నారు. అయితే ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు అన్నది సహజం అన్నది కూడా ఉంది. పైగా మొత్తం ప్రభుత్వమే ఒక ఉప ఎన్నిక విషయంలో అంతా తామై గట్టిగా కృషి చేసింది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. దాంతో పాటు ఈ ఉప ఎన్నికలలో బలంగా పోరాడిన పార్టీగా కాంగ్రెస్ కి సిసలైన ఆల్టర్నేషన్ గా బీఆర్ఎస్ ఉందని కూడా అంటున్నారు. దాంతో ఇదే అదనుగా జిల్లాల టూర్లు చేపట్టాలని కేసీఆర్ కేటీఆర్ కి సూచించారు అని అంటున్నారు. త్వరలో స్థానిక ఎన్నికలు తెలంగాణాలో జరగబోతున్నాయి. దాంతో పార్టీని పటిష్టం చేయాలని దిశా నిర్దేశం చేశారు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే మంగళవారం కేటీఆర్ తెలంగాణా భవన్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు అని అంటున్నారు. బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ లో ఓటమి తరువాత పరిస్థితులను చర్చించడంతో పాటు స్థానిక ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో కూడా ఇదే సమావేశంలో ఆలోచిస్తారు అని అంటున్నారు. అంతే కాకుండా జిల్లాల పర్యటనలకు కేటీఆర్ సిద్ధపడతారని దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ని రూపొందిస్తారు అని అంటున్నారు. ఇక మీదట జిల్లాల పర్యటనలోనే పార్టీని బలోపేతం చేసే విషయం కూడా కేటీఆర్ ఫోకస్ పెట్టి మొత్తం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ని కేసీఆర్ కి ఇస్తారు అని అంటున్నారు.
ఇక కేసీఆర్ కూడా పార్టీలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుడతారు అని అంటున్నారు. టాప్ టూ బాటం కొత్త నాయకత్వాన్ని నియమించడం పనిచేసే వారికి చోటు కల్పించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా పటిష్టం చేయడానికి రెడీ అవుతున్నారు అని అంటున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో నిరుత్సాహం పడకుండా శ్రేణులు అన్నీ ముందుకు సాగేలా కేసీఆర్ పార్టీకి కొత్త జవజీవాలు అందిస్తారు అని అంటున్నారు.


















