శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా జంట ఇటీవల కోర్టు కేసుల కారణంగా నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లోకొస్తున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీ కపుల్ మోసాలు, ఆర్థిక నేరాలపై విచారణ జరుపుతున్న అధికారులు రోజుకో కొత్త నిజాన్ని బయటపెడుతున్నారు. దీపక్ కొఠారి అనే వ్యాపారిని దాదాపు రూ. 60 కోట్ల మేర ముంచిన కేసులో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికే ఈ జంటపై లుకౌట్ నోటీస్ జారీ అయింది. ఈ సర్క్యులర్ కారణంగా ముందస్తుగా ప్లాన్ చేసిన వెకేషన్ షెడ్యూళ్లను కూడా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.
ఇటీవల తాము విదేశీ విహారయాత్ర కోసం ముందే కొనుక్కున్న టికెట్లను చూపించి కోర్టులో వాదనలు వినిపించగా, ఆర్థిక మోసం కేసు విచారణ పూర్తి కాకుండా విదేశాలకు వెళ్లేందుకు అనుమతించేది లేదని కోర్టు తీర్పు వెలువరించింది. తదుపరి వాయిదా విచారణలో ఈ దంపతులకు కోర్టు ఒక ఆప్షన్ కూడా కల్పించింది. ఒకవేళ విదేశాలకు విహారయాత్రకు వెళ్లాలని అనుకుంటే రూ.60 కోట్ల డిపాజిట్ చేయాలని బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది.
ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దీపక్ కొఠారి .. కుంద్రాతో కలిసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకోగా అతడి వ్యాపారాల్లో భాగస్వామిగా మారాడు. అప్పు రూపంలో డబ్బు ఇవ్వడమే గాక భాగస్వామ్య ఒప్పందాలు ఉన్నాయి. కానీ అతడి డబ్బును దుర్వినియోగం చేసినట్టు పోలీసులు కనుగొన్నారు. దీని తర్వాత శిల్పా శెట్టి, కుంద్రా సహా మరొక సహచరుడిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 403 (నిజాయితీగా ఆస్తి దుర్వినియోగం), 406 (నేరపూరిత నమ్మక ద్రోహం), 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.