రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ బిజెపి ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని యావత్ బీసీ సమాజం అంతా నరేంద్ర మోదీ గారి నాయకత్వం పట్ల నమ్మకం, విశ్వాసంతో ఉంది.ఈరోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు గారి సమక్షంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు బీసీ కమిషన్ సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్రంలో తొలి బీసీ కమిషన్ సభ్యుడిగా, అనంతరం రెండోసారి హయాంలో బీసీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన అపార అనుభవం గల డా. వకుళాభరణం కృష్ణమోహన్ గారు బిజెపిలో చేరిన సందర్భంగా వారిని బిజెపి కుటుంబంలోకి స్వాగతిస్తున్నాం.ఇది తెలంగాణలో స్పష్టమైన సంకేతం. బిజెపిద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సమాజం మొత్తం మోదీ గారి నాయకత్వం పట్ల నమ్మకం, విశ్వాసంతో ఉంది.
బీసీల హక్కులు, సంక్షేమం, అభ్యున్నతి కోసం బీసీలు బిజెపి వైపు చూస్తున్నారు. ఆర్. కృష్ణయ్య గారు, వకుళాభరణం కృష్ణమోహన్ గారు, ఎంబీసీ చైర్మన్‌గా పనిచేసిన తాడూరి శ్రీనివాస్ గారు బిజెపిలో చేరారు.మోదీ ప్రభుత్వం సంచార జాతుల విముక్తి దినోత్సవంను మొదటిసారిగా జరిపింది.గత రెండు రోజులుగా తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.ఈ సమావేశాల్లో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు విషయంలో…తేలింది/తేల్చింది ఏంటంటే — “మసిపూసి మారేడుకాయ చేసి, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు” రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది.
దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు, సీఎం రేవంత్ రెడ్డి గారికి 22 మాసాల తర్వాత ఇప్పుడు కనువిప్పు అయింది.కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, కుంభకోణం సీబీఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి, నిజం నిగ్గుతేల్చే సంస్థ సీబీఐ మాత్రమేనని రేవంత్ రెడ్డికి నిన్న కనువిప్పు అయింది.”గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి తెలంగాణ సంపదను దోచుకోవడానికి, కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు అధికారులు వత్తాసు పలికారని అన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణమని తీవ్రంగా విమర్శించారు.
రూ. 38 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టును లక్ష కోట్ల పైచిలుకు నిధులతో నిర్మిస్తామని చెప్పడమే ఈ కుంభకోణానికి సాక్ష్యం.ఈ విషయంలో బిజెపి మొదటి నుంచే చాలా స్పష్టంగా చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా స్పష్టంగా చెప్పారు — కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకుని, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కుటుంబం వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని.
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి “కాళేశ్వరం అవినీతి దేశంలోనే అతి పెద్ద స్కామ్” అని, ఆధారాలు ఉన్నాయని ప్రజల సాక్షిగా చెప్పారు. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో నిగ్గుతేల్చి మెక్కిన సొమ్మంతా కక్కిస్తామన్నారు — రూపాయి కూడా కక్కించలేదు.పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఏంటో తెలియదు కానీ, సీబీఐ దర్యాప్తుపై వెనక్కి తగ్గారు. కేవలం కాలయాపన కోసం పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు.
సీబీఐ దర్యాప్తు కోరితే బిజెపి బీఆర్ఎస్‌కు మేలు చేస్తుందని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు.చివరికి తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో దోపిడీదారులను ప్రజాస్వామ్య రీతిలో శిక్షించారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల తీర్పు ప్రకారం వ్యవహరించకుండా, అధిష్ఠానం ఒత్తిళ్లకు లొంగి, బీఆర్ఎస్‌తో లోపాయికారీ, చీకటి ఒప్పందం చేసుకుంది. ఇదే రహస్య ఎజెండా.
చివరకు విధిలేని పరిస్థితిలో నిన్న సీబీఐ విచారణకు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానించారు.కేవలం కాళేశ్వరం అవినీతి రుజువులను నీరుగార్చేందుకే పీసీ ఘోష్ కమిషన్ పేరుతో కాలయాపన చేశారా?తెలంగాణ సంపదను దోచుకున్నవారికి శిక్ష పడాలంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని ఆధారాలతో సహా సీబీఐ ముందుకు రావాలి. సీబీఐపై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజల ఆగ్రహావేశాలకు లోనుకాక తప్పదని హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్‌కు పట్టిన గతే, కాంగ్రెస్‌కు–సీఎం రేవంత్ రెడ్డికి పడుతుంది.కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఆధారాలను సీబీఐకి అప్పగించాలి.
గత బీఆర్ఎస్ హయాంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ కుంభకోణం చేసి వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) కూడా కాళేశ్వరం నిర్మాణం నాసిరకమని, నిర్లక్ష్యం–అవినీతి కారణంగానే ప్రాజెక్టు ధ్వంసం అంచున ఉందని నివేదిక ఇచ్చింది. విజిలెన్స్, కాగ్ లాంటి సంస్థలు కూడా అవినీతికి సంబంధించిన వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. అయినా సీబీఐ దర్యాప్తునకు ఇవ్వకుండా చోద్యం చూశారు.ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్, కాగ్…. కాళేశ్వరం విషయంలో గత ప్రభుత్వాన్ని తప్పుబట్టాయి.
అయితే, సీబీఐ విచారణ కు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం ఎందుకు కాలయాపన చేసిందో ప్రజలకు అర్థమవుతోంది. నిజాయితీగా ఉంటే ఈ నిర్ణయం 22 నెలల క్రితమే తీసుకోవాల్సింది. కానీ కమిషన్ల పేరుతో కాలం గడిపారు.అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణన చేసి, బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42% పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ 20 నెలలు గడిచినా కాంగ్రెస్ చిత్తశుద్ధి చూపలేదు.22 మాసాలు మీనమేషాలు లెక్కిస్తూ… స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసే చట్టసవరణను చేయలేదు.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పంచాయతీరాజ్ చట్టంలోని Section 285(A)లో సవరణ చేస్తూ, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని అసెంబ్లీలో బిల్లు ఆమోదించింది.బీసీలకు రిజర్వేషన్లు పెంచడంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ నిర్ణయం గత 22 మాసాలకే తీసుకోవాల్సింది. ఎందుకు ఆలస్యం చేసినట్లు..? ఇదే కాంగ్రెస్ మోసపూరిత ధోరణి.ఒకసారి “కులగణన సర్వే” అన్నారు; తర్వాత “డెడికేషన్ కమిటీ రిపోర్ట్” అన్నారు; ఇంకోసారి “భూసామి వెంకటేశ్వరరావు కమిషన్” ద్వారా శాస్త్రీయంగా విచారణ చేస్తామని, రిపోర్ట్ ఆధారంగా చూస్తాం అన్నారు. ఇలా కమిషన్ల పేరుతో జాప్యం చేశారు తప్పితే బీసీలకు న్యాయం చేయలేదు.ఆ తర్వాత “ఆర్డినెన్స్ తీసుకొచ్చాం” అన్నారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నా చేశారు.
చివరికి ఈరోజు న్యాయపరమైన చిక్కులు, అవరోధాలను అధిగమించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే దానిపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు.కాంగ్రెస్ సర్కారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చితీరాలి. ఆ బాధ్యత వారిదే. దాటవేస్తే బీసీల ఆగ్రహావేశాలకు గురికాకతప్పదు.కులగణన సర్వే ఎవరికి మేలు? బీసీల కోసమా, ముస్లింల కోసమా? — 12% ముస్లింలలో 10% ను బీసీ జాబితాలో చేర్చే ప్రయత్నం చేశారు.గతంలో 51% ఉన్న బీసీలను 46%కి కుదించారు. మా లెక్కలు ఏంటి, మా జనాభా ఎంతో అంటూ బీసీలతో పాటు సంచార జాతులు కూడా ప్రశ్నిస్తున్నాయి.సామాజికంగా బీసీ కులాల లెక్కలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టకుండా, నిగూడంగా బీసీలను మోసం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏనే బీసీలను మోసం చేయడం.. కాకా కలేల్కర్ కమిషన్ నుంచి మండల్ కమిషన్ వరకు బీసీలకు మోసం చేసింది కాంగ్రెస్.సంచార జాతుల కోసం 16 కమిషన్లు/కమిటీలు వేసి సిఫార్సులు చేసినా — ఒక్కటీ అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ.తెలంగాణలో బీసీ సమాజం సంఘటితమవుతోంది.. చైతన్యవంతమవుతోంది.ఎన్నికల ముందు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పి… “రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అమలు చేస్తాం” అన్నారు.
బిజెపి మొదటి నుంచి 42% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది. అయినా “బిజెపి సహకరించడం లేదని” నిందించే ప్రయత్నం చేశారు.స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1980వ దశకంలోనే బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తే, బీఆర్ఎస్–కాంగ్రెస్ పార్టీలు 23%కి తగ్గించి మోసం చేశాయి.ఈరోజు బీసీ సమాజం మొత్తం సమాజం నరేంద్ర మోదీ గారి నాయకత్వంపై విశ్వాసంతో ఉంది. అన్ని వర్గాల ప్రజల అండతో దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.బిజెపి వల్లే న్యాయం జరుగుతుందని బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే బిజెపిలో చేరుతున్నారు.