భారతదేశంలో జరిగే ఒక వివాహ వేడుకకు ప్రపంచానికి పెద్దన్న అమెరికా అధ్యక్షుడి కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రత్యేకంగా హాజరయ్యే అవకాశం ఉందా? అది కూడా రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేనప్పుడని అడిగితే.. నో అనే చెబుతారు. కానీ..మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న ఒక వివాహ వేడుక ఆ అభిప్రాయాన్ని మార్చేయటమే కాదు.. అమెరికా అధ్యక్షడు ట్రంప్ కొడుకు ట్రంప్ జూనియర్ ప్రత్యేకంగా హాజరైన వైనం చూస్తే.. సదరు వివాహం ఎంత స్పెషల్ అన్నది ఇట్టే అర్థమవుతుంది.
అవును.. భారతదేశానికి చెందిన రామలింగరాజు మంతెన అమెరికాలో నివసిస్తూ ఉండటం.. సదరు బిలియనీర కుమార్తె నేత్ర పెళ్లి అంతర్జాతీయంగా అందరి చూపు పడేలా చేసింది. వంశీ గాదిరాజుతో వివాహ వేడుక ఈ నెల 21న మొదలై 24తో ముగిసింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు జగన్ మందిర్ ప్యాలెస్ వేదికైంది. ఈ పెళ్లి వేడుకకు వివిధ దేశాలకు చెందిన 600 మంది ప్రముఖులు హాజరయ్యారు.
ఈ పెళ్లికి అమెరికన్ గాయని జెన్నిఫర్ లోపేజ్ Jennifer Lopez మొదలుకొని హాలీవుడ్.. బాలీవుడ్ వరకూ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జెన్నిఫర్ లోపేజ్ భారతీయ వస్త్రధారణతో ఆకట్టుకుంటే.. బాలీవుడ్ నటి దియా మీర్జా ఈ పెళ్లి వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఫేమస్ ఫ్రెంచ్ సర్కస్ గ్రూప్ విన్యాసాలు పెళ్లికి వచ్చిన అతిధుల్ని అలరిస్తే..బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ప్రదర్శనతో సంగీత్ కార్యక్రమం ముగిసింది.
పలువురు వ్యాపారవేత్తలు.. బిలియనీర్లు.. రాజకీయ నేతలు.. బాలీవుడ్ నటులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ Junior Trump తో పాటు.. అతడి స్నేహితురాలు కూడా ప్రత్యేక అతిథులుగా హాజరుకావటం తెలిసిందే. వధువు తండ్రి ఇంజీనస్ ఫార్మాస్యూటికల్స్ సీఈవో అన్న విషయం తెలిసిందే. వరుడి విషయానికి వస్తే.. సూపర్ ఆర్డర్ అనే ఐటీ కంపెనీ సహ వ్యవస్థాపకుడు. 2024 ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్నారు. వందల కోట్ల రూపాయిల ఖర్చుతో నిర్వహించిన పెళ్లి వేడుక ముగిసింది. 2025లోనే అత్యంత విలాసవంతమైన పెళ్లికి శుభం కార్డు పడింది.













