ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు ₹10 లక్షల కోట్లు ($120 బిలియన్లకు పైగా) నికర సంపద కలిగిన ఆయన, తన కుమార్తె స్థాపించిన స్టార్టప్ సంస్థలో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే, ఒక రోజు కస్టమర్ సపోర్ట్ ఏజెంట్‌గా పని చేశారు.
బిల్ గేట్స్ కుమార్తె ఫోబీ గేట్స్ , ఆమె స్టాన్‌ఫోర్డ్ క్లాస్‌మేట్ సోఫియా కియానీ కలిసి ఫియా అనే ఫ్యాషన్-టెక్ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ సంస్థలో బిల్ గేట్స్ ఒక రోజు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగిగా పనిచేశారు. ఈ అనుభవాన్ని లింక్డ్‌ఇన్‌లో పంచుకుంటూ “మీ కుమార్తె మీతో పని చేయమంటే, దానికి సరైన సమాధానం ‘అవును’ అని చెప్పడమే!” అని బిల్ గేట్స్ హృదయపూర్వకంగా పేర్కొన్నారు.
ఈ అనుభవం తనకు “నిజంగా వినమ్రతను నేర్పింది, గొప్పగా నేర్చుకున్నాను” అని గేట్స్ వివరించారు. వినియోగదారులతో నేరుగా మాట్లాడటం ద్వారా వ్యాపార వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, ఎక్కడ లోపాలు ఉన్నాయో అర్థమవుతుందని ఆయన తెలిపారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం ప్రకారం.. సీఈఓలు తమ సమయాన్ని వినియోగదారులతో గడపడం చాలా అరుదు. ఇది 10% కంటే తక్కువ మాత్రమే. అయితే, గేట్స్ తీసుకున్న ఈ నిర్ణయం కొత్త తరహా నాయకత్వ శైలికి నిదర్శనం.
ఫియా అనేది ఒక బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ , మొబైల్ యాప్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా వినియోగదారులకు స్మార్ట్ షాపింగ్ చేయడంలో సహాయపడుతుంది. 40,000కి పైగా ఆన్‌లైన్ స్టోర్లను కలిపి ధరలను పోల్చే ఫంక్షన్‌తో పాటు, సెకండ్ హ్యాండ్ , పర్యావరణానికి అనుకూలమైన ఆప్షన్లను చూపించడంలో దీనికి ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా, ఇది జెన్ Z తరం ఆశయాలకు అనుగుణంగా సుస్థిర ఫ్యాషన్పై దృష్టి పెట్టడం గమనార్హం.
ఆశ్చర్యకరంగా, బిల్ గేట్స్ ఫియా కంపెనీలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు. ఒక పాడ్‌కాస్ట్‌లో ఆయన ఈ విషయాన్ని వివరిస్తూ “నేను పెట్టుబడి పెడితే వాళ్ళ ఆత్మనిర్భరతను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల నేను దూరంగా ఉండటమే మంచిది” అని తెలిపారు. అయితే వారు అడిగితే సలహాలు ఇవ్వడం, ప్రోత్సహించడం, కస్టమర్ సపోర్ట్ వంటి రంగాల్లో నేరుగా మద్దతు ఇవ్వడం ద్వారా వెనుక నుండి తోడుగా ఉంటున్నారని చెప్పారు.
గతంలో ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి కూడా తాను ఒక ఉబర్ ఈట్స్ డెలివరీ డ్రైవర్‌గా పని చేసినట్లు తెలిసింది. అలాగే, గేట్స్ చేసిన పని కూడా “తల నుండి కాకుండా నేల నుండి నాయకత్వం ఇవ్వడం” అనే సిద్ధాంతాన్ని సూచిస్తుందని తెలిపారు. . ఒక్కరోజు పని అయినా, బిల్ గేట్స్ చేసిన ఈ పని నాయకత్వం అంటే పెద్ద పదవి కాదు, నేర్చుకునే తత్వం అనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ప్రపంచ టెక్నాలజీని మలిచిన వ్యక్తిగా గుర్తింపు పొందిన గేట్స్, కస్టమర్ సపోర్ట్ డెస్క్ దగ్గర నుంచి వినమ్రతతో నేర్చుకోవడం ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. “విశిష్టత సంపదలో కాదు, దృక్పథంలో ఉంటుంది. అసలైన నాయకత్వం అంటే నేల దాకా దిగి, వినిపించే శక్తి కలిగి ఉండటమే.” అనడంలో అతిశయోక్తి కాదు.. దీనికి బిల్ గేట్స్ ఉదాహరణగా నిలిచారు.