బీహార్ లో మహా ఘట్ బంధన్ కి బీటలు వారుతున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈసారి అధికారం మాదే అంటూ జబ్బలు చరచి మరీ బరిలోకి దిగిన కాంగ్రెస్ ఆర్జేడీలు తీరా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాత్రం ఆ ఐక్యతను చూపించలేకపోతున్నాయి అని అంటున్నారు. బీహార్ లో ఎన్డీయేతో రాజకీయ సమరం సాగుతోంది. కేంద్రంలో ఎన్డీయే ఉంది దాంతో అన్ని విధాలుగా కో ఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన మహా ఘట్ బంధం సీట్ల షేరింగ్ దగ్గరకు వచ్చేసరికి ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరించడం పట్ల హాట్ డిస్కషన్ జరుగుతోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఘట్ బంధన్ లో తీవ్ర గందరగోళం చోటు చేసుకున్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో సంప్రదించకుండానే ఆర్జేడీ ఏకపక్షంగా బీహార్ లో రెండవ విడత అభ్యర్ధుల జాబితాను రిలీజ్ చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలోని ఆర్జేడీ ఈ విధంగా మొత్తం 143 మంది అభ్యర్థుల జాబితాతో రిలీజ్ చేయడం పట్ల కాంగ్రెస్ రగుతులుతోంది. మిత్ర పక్షాలను విశ్వసంలోకి తీసుకోకుండా ఈ విధంగా ఆర్జేడీ వ్యవహరిస్తోంది అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
బీహార్ లో ఓటర్ అధికార యాత్ర జరిపి జనంలో మంచి స్పందనను తీసుకుని వచ్చింది రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దాని ఫలితంగానే మహా ఘట్ బంధన్ కి జనాల్లో ఆదరణ పెరిగింది అని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ గ్రాఫ్ కూడా బాగా పెరిగింది అని అంటున్నారు. తమకు ఎక్కువ సీట్లు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వస్తోంది. అయితే కాంగ్రెస్ డిమాండ్ ని పక్కన పెట్టి ఆర్జేడీ తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. ఈ పరిణామాల మధ్య రాహుల్ తో ఆర్జేడీ అగ్ర నేత మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కి భారీ గ్యాప్ వచ్చిందని అంటున్నారు రాహుల్ సైతం ఆర్జేడీ తీరు పట్ల ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. అయితే కూర్చుని మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు వ్యవహరించడం వల్లనే మహా ఘట్ బంధన్ లో విభేదాలు పొడసూపుతున్నాయని అంటున్నారు.
ఇక తొలి విడతకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టన్ ఈ నెల 17తో ముగిసింది. అయితే మొత్తం 121 సీట్లకు గానూ 125 సీట్లకు మహా ఘట్ బంధన్ అభ్యర్ధులను నిలపడం జరిగింది. ఇపుడు ఆర్జేడీ అయితే 143 మంది అభ్యర్ధుల జాబితా ప్రకటించింది. కాంగ్రెస్ వరకూ చూసుకుంటే 60 మంది దాకా అభ్యర్ధులను ఖరారు చేసుకుంది అని అంటున్నారు. అంటే రెండు పార్టీలు ఎవరికి వారుగా అభ్యర్ధులను ప్రకటించుకుంటూ పోతే ఇక కూటమి విచ్చిన్నమే అవుతుంది అని అంటున్నారు. అయితే నామినేషన్ల విత్ డ్రా లోగా ఏమైనా చర్చలు జరుగుతాయా అన్నది చూడాలి. అయితే తెలుస్తున్న దానిని బట్టి చూస్తే ఈ గ్యాప్ పెరిగేదే తప్ప తగ్గేది కాదని అంటున్నారు. దాంతో ఎవరికి వారుగా ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తాను చూపించి ఎన్నికల అనంతరం కలుస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ విధంగా మహా ఘట్ బంధన్ లో అనైక్యత కనుక ఉంటే అది ఎన్నికల్లో ఎన్ డీయేకు కచ్చితంగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు.