నేడు భోగి పండుగ సందర్భంగా…
తెలుగు వారి పండుగలలో భోగి పండుగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం ఆచారాల పండుగ మాత్రమే కాదు, ఆరోగ్యం–త్యాగం–సామాజిక బాధ్యత–ఆధ్యాత్మిక భావనల సమ్మేళనం. దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభానికి ముందు వచ్చే ఈ పండుగ మన జీవితానికి ఒక కొత్త దిశను చూపిస్తుంది.
భోగికి ముందు, తర్వాత సాధారణంగా చలిమంటలు కాసుకుంటారు. కానీ భోగి రోజున మాత్రం వాటిని భోగి మంటలు అని ప్రత్యేకంగా పిలుస్తారు. దక్షిణాయన కాలంలో చలి, వర్షాల వల్ల దేహంలో పెరిగిన వాత లక్షణాలు, అనారోగ్యాలు—నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం, మూలిక గుణాలు గల కట్టెలు, కంపలతో వేడి చేసిన నీటితో స్నానం చేస్తే తొలగుతాయనేది పూర్వీకుల నమ్మకం. ఈ ఆరోగ్య శుద్ధే మనల్ని ఉత్తరాయణంలోకి నూతనోత్సాహంతో నడిపిస్తుంది. భోగి మంటల్లో ఇదే అంతరార్థం దాగి ఉంది.
ఏడాది పొడవునా ఎన్నో పండుగలు వచ్చినా, భోగి మాత్రం అరుదైన స్వతంత్రత కలిగిన పండుగ. ఇది ఏ దేవుడికో, దేవతకో మాత్రమే అంకితం కాదు. భోగి అనే పదంలోనే జీవన తత్వం ఉంది. మరి ఈ పేరు ఎలా వచ్చింది?
రాజభోగాలు – భోగి తత్వం
భోగములు అంటే సుఖాలను అనుభవించేవాడు భోగి. వ్యవసాయ ప్రధానమైన తెలుగు నేలలో రైతు ఏడాది పొడవునా కష్టపడి పంట పండిస్తాడు. ఆ పంటను ఇంటికి తీసుకొచ్చి భార్యా పిల్లలు, బంధుమిత్రులతో పంచుకుంటూ ఆనందించే పండుగే భోగి. దక్షిణాయనం చివరి రోజైన ఈ రోజు ఐహికమైన, భౌతికమైన సుఖాలను అందరితో పంచుకోవాలని చెబుతుంది.
పండిన పంటలను పనివారికి, హరిదాసులకు, యాచకులకు, పశుపక్షాదులకు వితరణ చేయడమే రాజభోగం.
“సంపదను పదిమందికి పంచితే భోగం… తానొక్కడే తింటే రోగం” అనే మహాసత్యాన్ని భోగి గుర్తుచేస్తుంది. మరునాటి ఉత్తరాయణంలో ఆధ్యాత్మిక చింతనకు పునాది వేసే త్యాగ గుణాన్ని ఈ పండుగ అందిస్తుంది.
పురుషులకు పండుగ భోగం
భోగి నాడు పాత బట్టలను పేదలకు పంచాలి. పాడైపోయిన వస్తువులను భోగి మంటల్లో వేయాలి. ఇది కేవలం శుభ్రతకే కాదు—మన జీవితంలో అనవసరమైన భారాలను వదిలేయాలనే సంకేతం. ఎండిపోయిన చెట్టు కొమ్మలను విరిస్తే కొత్త కొమ్మలు వస్తాయి. గత వర్షాకాలంలో మొలిచిన కలుపు మొక్కలను కాల్చితే నేల శుభ్రమవుతుంది. అలాగే మన జీవితంలోనూ పాత దుఃఖాలను, నిరాశలను వదిలితే కొత్త ఆశలు పుడతాయి. భోగి మంటల పొగతో దోమలు, క్రిములు తగ్గుతాయి—ఇది ఆరోగ్య పరిరక్షణకు మరో కోణం.
గొబ్బెమ్మలను సాగనంపే భోగం – స్త్రీల పాత్ర
ఆవు పేడ మన సంస్కృతిలో పూజనీయమైనది, ఆరోగ్యకరమైనది. ధనుర్మాసం నెల రోజుల పాటు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరించి పూజిస్తారు. భోగి రోజున సాయంత్రం సంధి గొబ్బెమ్మలు పెట్టి పూజిస్తూ పాటలు పాడి కోరికలు కోరుకుంటారు. పెద్ద ముత్తైదువులకు వాయినాలు ఇస్తారు.
గోమాతను తల్లికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. తల్లిపాలు లేని పిల్లలకు ఆవుపాలే జీవనాధారం. భోగి నాడు గోదాదేవి–శ్రీరంగనాథ స్వామి ఆలయం కళ్యాణం జరిగినదన్న విశ్వాసం ఉంది. ధనుర్మాసం అంతా గోపికా భక్తితో గోదాదేవి చేసిన తపస్సుకు ఇది పరిపూర్ణత. ఇల్లు పాడిపంటలతో వర్ధిల్లాలని గోపికల వలే ప్రార్థిస్తూ గొబ్బెమ్మలను సాగనంపడమే భోగి పండుగలో స్త్రీల ముఖ్య పాత్ర.
పిల్లలకు ఆరోగ్య భోగం
భోగి పండుగలో భోగి పళ్ళు, బొమ్మల కొలువు ఎంతో ముఖ్యమైనవి. చిన్న పిల్లల తలపై రేగి పండ్లు పోసి పేరంటం జరుపుతారు. రేగి పండును ఆర్కఫలం అంటారు. ఇది సూర్యునికి ప్రతీక. సౌరశక్తి, ఆరోగ్యం, జ్ఞానాన్ని అందించే శక్తి రేగి పండ్లకు ఉందని నమ్మకం. ఉత్తరాయణంలో వచ్చే మాఘమాసం సూర్యారాధన కాలం కావడంతో, రేగి పండ్ల స్పర్శ పిల్లలకు ఆరోగ్యాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు.
భోగి నాడు బొమ్మల కొలువులకు హారతి ఇవ్వడం ద్వారా పిల్లల్లో సృజనాత్మకత, పరిశీలనా శక్తి, పరిజ్ఞానం, నిర్మాణాత్మక దృష్టి పెరుగుతుంది. అందుకే భోగిని పిల్లల పండుగగా కూడా పిలుస్తారు.
దంపతులకు ఇంద్రభోగం
ఇంద్రభోగాలు దేవతల రాజైన ఇంద్రునికి ప్రత్యేకమైనవి. తూర్పు దిక్కుకు, మేఘాలకు అధిపతిగా వర్షాన్ని ఇచ్చేవాడు ఇంద్రుడు. భోగి పండుగ ఇంద్ర పూజతో కూడా సంబంధం కలిగి ఉంది. ఉత్తరాయణం దేవాయణ కాలం కావడంతో, ముందు రోజు దేవతల అధిపతిని ప్రసన్నం చేసుకోవాలనే భావన ఉంది. భోగి మంటలను మంత్ర రహిత హోమాలుగా భావించి ఇంద్రుని ఆరాధిస్తారు. ఆ మంటలతో నీరు, గాలిలో తేమ ఆవిరిగా మారి మేఘాల ఏర్పాటుకు తోడ్పడుతుందని పూర్వీకుల విశ్వాసం.
గోదాదేవి తపస్సుకు రంగనాథుడు ప్రత్యక్షమై పెళ్లి చేసుకున్నట్లే—ఒకరికొకరు ఇష్టపడిన స్త్రీ పురుషులు దంపతులైనప్పుడే సంపూర్ణ భోగి సిద్ధిస్తుందని ఈ పండుగ బోధిస్తుంది.
BhogiFestival






