కేవలం 5 ఏళ్లలో రూ.14 వేలకోట్లు… ఏడాదిలో రూ.4 వేల కోట్లు.. ఇదేదో కార్పొరేట్ కంపెనీ ఆస్తుల లెక్క కాదు..! భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సంపద అమాంతం పెరిగిన వైనం. మన బోర్డు చాలా డబ్బున్నది అని అందరికీ తెలుసు. కానీ, ఎంత అనేది ఎవరికీ కచ్చితంగా లెక్కలు తెలియవు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ను చూసే అందరికీ కళ్లు బైర్లు కమ్ముతుంటాయి. ఇప్పుడు బీసీసీఐ సంపద మొత్తం ఎంతో తెలిస్తే ఔరా అనాల్సిందే.
బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) ఈనెల 28న జరగనుంది. అందులో బోర్డు లెక్కలను బయటపెట్టనున్నారు. అయితే, దీనికిముందే బీసీసీఐ సంపద రూ.20 వేల కోట్లకు పైనే అని కథనాలు వస్తున్నాయి. 2019 నాటికి రూ.6 వేలకోట్లు మాత్రమే ఉండగా.. ఆరేళ్లలో మూడు రెట్లు పెరిగింది. ఓవైపు ఐపీఎల్ మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), దేశంలో మ్యాచ్ ల మీడియా హక్కులు ఇలా బీసీసీఐకి అన్నివైపుల నుంచి ఆదాయం వస్తోంది. 2023-24లో రూ.1,623 కోట్ల మిగులు చూపింది. దీనికిముందు ఏడాది రూ.1,167 కోట్లు మాత్రమే
20 ఏళ్ల కిందటివరకు బీసీసీఐ అంటే ప్రపంచంలోని మిగత బోర్డులకు లెక్కలేకుండా పోయేది. కానీ, ఎప్పుడైతే ఐపీఎల్ వచ్చిందో మన బోర్డు దశ తిరిగింది. ఇప్పుడు బీసీసీఐ ఏంచెబితే అదే రూల్. ఇక డబ్బుల విషయంలో మన బోర్డు దగ్గరున్నన్ని మిగతా అన్ని బోర్డులను కలిపినా లేవని చెప్పొచ్చు. బీసీసీఐ వద్ద రాష్ట్ర సంఘాలకు ఇచ్చింది పోగానే రూ.20 వేలకోట్లపైగా ఉందట. ఇందులో నిరుడే రూ.4,193 కోట్ల ఆదాయం వచ్చిందట. 2023-24లో రూ.1,200 కోట్లను మైదానాల్లో సదుపాయాల బాగుకోసం కేటాయించిందట. 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ ఫండ్ రూ.350 కోట్లు, క్రికెట్ డెవలప్ మెంట్ కోసం రూ.500 కోట్లు కేటాయించడం బీసీసీఐ స్థాయికి నిదర్శనం.
బీసీసీఐ రెండేళ్ల కిందటే రాష్ట్ర సంఘాలకు రూ.1990 కోట్లు ఇచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. అంటే, 40 సంఘాలు ఉన్నాయని భావించినా ఒక్కోటి దాదాపు రూ.50 కోట్లు పొందినట్లే. మరి.. గత రెండేళ్లలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న హైదరాబాద్ క్రికెట్ సంఘానికి కూడా ఇంతే మొత్తం వచ్చిందన్నమాట!