సాంప్రదాయాలను గౌరవిస్తూ, ప్రతి పండుగను ఒక ఉత్సవంలా జరుపుకునే అద్భుతమైన సంస్కృతి మన తెలుగు లోగిళ్లలో ఉంది. ముఖ్యంగా తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రతియేటా ఇంటింటా కొత్త వైభవం తెస్తుంది. అలాంటి పండుగను దిల్లీలోని ఓ కాలేజీలో నిర్వహిస్తుంటే, ఈ వేడుకలకు దిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాతో పాటు ఉపాసన కొణిదెల కూడా అటెండవ్వడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
అక్కడ విద్యార్థులతో పాటు దిల్లీ సీఎం, ఉపాసన కొణిదెల బతుకమ్మ ఆడారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల తెలంగాణలో సినీరాజకీయ ప్రముఖులు బతుకమ్మ ఆడుతూ పండుగకు కొత్త కళను జోడించారు. ఇప్పుడు అపోలో సంస్థాన అధినేత్రి ఉపాసన నేరుగా దేశ రాజధానికి వెళ్లి అక్కడ బతుకమ్మ ఉత్సవాల గొప్పతనాన్ని చాటడం, తద్వారా తెలంగాణ ప్రజల గౌరవాన్ని అందుకోవడం.. తన జీవితంలో బిగ్గెస్ట్ అఛీవ్ మెంట్ అని చెప్పాలి.
తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ కోసం మెగా కోడలు చేసిన పనికి తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ప్రశంసలు కురుస్తున్నాయి. దిల్లీలోని ప్రముఖ కాలేజీలో జరిగిన ఉత్సవాల్లో ఉపాసనతో పాటు ఆమె భర్త రామ్ చరణ్ కూడా అతిథిగా పాల్గొన్నారు. ఉపాసన ఈ వేడుకల్లో బతుకమ్మను నెత్తిన ఎత్తుకుని విద్యార్థులతో కలిసి సరదాగా పాటలు పాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సీఎం రేఖా గుప్తా కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రేఖా గుప్తా పోస్ట్ సారాంశం ఇలా ఉంది. “ఇది కేవలం పూల ఉత్సవం మాత్రమే కాదు. మాతృత్వం, జీవనం, ప్రకృతి పట్ల గల గౌరవానికి ప్రతీక. తెలంగాణ స్త్రీలు తరతరాలుగా కొనసాగిస్తున్న ఈ సంప్రదాయం సాంస్కృతిక ఐక్యతకు చిహ్నం. ఢిల్లీలో ఉన్న తెలుగు విద్యార్థులు ఇలాంటి వేడుకలు నిర్వహించడం రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధాన్ని బలపరుస్తుంది“ అని ట్వీట్ చేశారు. ఉపాసన రీట్వీట్ చేస్తూ, తమతో కలిసి బతుకమ్మ వేడుకల్ని సెలబ్రేట్ చేసినందుకు దిల్లీ ముఖ్యమంత్రికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు.