సాధారణంగా ఇండియా నుంచి చాలామంది ప్రజలు ఇతర దేశాలలో జీవనం కొనసాగిస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఇండియాకి వచ్చినప్పుడు.. లేదా తాము నివసిస్తున్న ఆయా దేశాలకు ఇండియా నుండీ వెళ్ళేటప్పుడు.. వారి వెంట కొన్ని వస్తువులను లేదా వారికి ఇష్టమైన చెట్లు, కాయలు, పూలు, విత్తనాలు ఇలా కొన్నింటిని తమతో పాటూ తీసుకువెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గడిచిన కొన్ని గంటల క్రితం మలయాళ నటి నవ్య నాయర్ కూడా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన ఓనం కార్యక్రమంలో భాగంగా తనతో పాటు ఇండియా నుండి ఆమె మూర మల్లెపూలు తీసుకెళ్లారు. అయితే మెల్బోర్న్ విమానాశ్రయంలో సెక్యూరిటీ చెకప్ లో భాగంగా ఆమె మల్లెపూలు తీసుకు వెళుతున్నట్లు సిబ్బంది గమనించి అధికారులకు వెల్లడించగా వారు ఏకంగా రూ.1.14 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసింది.
దీన్ని బట్టి చూస్తే అక్కడ పాటించేటువంటి కఠినమైన నిబంధనలు ఎలా ఉంటాయో ఈ ఒక్క సంఘటన అందరికీ అర్థమయ్యేలా చేస్తోంది. అయితే ఆస్ట్రేలియాలో కేవలం మల్లెపూలే కాదు మనం వినియోగించే ఎన్నో వస్తువులు, ఆహార పదార్థాలపైన కూడా ఆ దేశం నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఇతర దేశాల నుండి ఆస్ట్రేలియాకు తీసుకెళ్లకూడని వస్తువులు ఏంటి అనే విషయానికి వస్తే చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి.
మరి ఆస్ట్రేలియా ప్రాంతంలో నిషేధించిన వస్తువులు, ఆహార పదార్థాలు ఏంటి అనే విషయానికి వస్తే..
1). పాల ఉత్పత్తులకు సంబంధించిన ఆహారం పదార్థాలు
2). బియ్యం
3). ఇంట్లో తయారుచేసిన ఆహారం
4). జంతువులు తినే ఆహారం
5). రసగుల్లా, గులాబ్ జామ్, మైసూర్ పాక్, బర్ఫీ, రసమలై వంటి స్వీట్లు
6). టీ పొడి లేదా టీ, తేనె
7). మూలికలు, సుగంధ ద్రవ్యాలు, గింజలు ,విత్తనాలు
8). పండ్లు, కూరగాయలు
9). తాజా లేదా ఎండిన పువ్వులు
10). పక్షులకు సంబంధించి ఈకలు, ఎముకలు, చర్మంతో చేసిన బ్యాగులు, దుప్పట్లు, మూలికలు కూడా ..
పైన చెప్పిన వస్తువులను ఎవరైనా తీసుకువచ్చి నిబంధలను ఉల్లంఘిస్తే ఆస్ట్రేలియా అధికారులు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు. వీటిని స్వాధీనం చేసుకున్న తర్వాత.. ధ్వంసం చేసి జరిమానా లేదా జైలు శిక్షణ కూడా విధించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రయాణికుల వీసాని కూడా రద్దు చేస్తారు. కాబట్టే ఇకపై ఎవరైనా ఆస్ట్రేలియాకి వెళ్ళాలనుకునేవారు ముందుగా అధికారులకు ఆహార పదార్థాలు, వస్తువులకు సంబంధించిన విషయాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకువెళ్లే ఆహార పదార్థాలు నిషేధిత జాబితాలో ఉంటే మాత్రం విమానాశ్రయంలో అధికారులు జప్తు చేస్తారు. అయితే వీటికి మాత్రం ఎలాంటి ఫైన్ ఉండదు. ఎవరైనా దొంగ చాటుగా తెలియకుండా తీసుకువెళ్తే తగిన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది.
ఆస్ట్రేలియాలో ఇలాంటి ఆహార పదార్థాలపై నిషిద్ధం విధించడానికి కారణం.. కొన్ని ఆహార పదార్థాల వల్ల పర్యావరణానికి కూడా హాని కలుగజేస్తాయని, ప్రజలకు వివిధ రకాల వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉండడం వల్లే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇలాంటి కఠినమైన నిబంధనలను విధించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అలాగే ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది.