దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, యువతలో దేశభక్తిని పెంపొందించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్వదేశీ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసంగంలో , అలాగే వివిధ ప్రైవేట్ కార్యక్రమాలలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
దేశాభివృద్ధి మన చేతుల్లోనే
“దేశ అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది. మనం స్వదేశీ వస్తువులను వినియోగిస్తేనే, భారతదేశం నిజమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది” అని ప్రధాని మోదీ అన్నారు. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదని, దేశభక్తికి సంకేతం అని ఆయన వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో కూడా “మేక్ ఇన్ ఇండియా”, “ఆత్మనిర్భర్ భారత్” వంటి కార్యక్రమాల విజయం స్వదేశీ ఉత్పత్తుల వినియోగంపైనే ఆధారపడి ఉందని ఆయన నొక్కిచెప్పారు.
– యువతకు ప్రత్యేక సందేశం
ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. “ఒక్క విదేశీ వస్తువును కూడా ఇంటికి తేవద్దు. మన దేశంలో తయారైన వస్తువులనే ఉపయోగిద్దాం” అని అన్నారు. టెక్నాలజీ, ఫ్యాషన్, గాడ్జెట్లు వంటి అన్ని రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులనే ప్రోత్సహించాలని యువతను కోరారు. యువత మార్పుకు చోదకశక్తిగా వ్యవహరిస్తే, దేశీయ పరిశ్రమలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలవని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
– వ్యాపారులకు మోదీ పిలుపు
వ్యాపార వర్గాలనూ మోదీ ప్రోత్సహించారు. తమ దుకాణాల్లో కేవలం స్వదేశీ వస్తువులే అమ్ముతామని బోర్డులు పెట్టి తమ దేశభక్తిని చాటుకోవాలని సూచించారు. “ఒక్కో వ్యాపారి ఈ నిర్ణయం తీసుకుంటే, అది ఒక ఉద్యమంలా మారుతుంది. విదేశీ వస్తువులపై ఆధారపడకుండా మన స్వంత పరిశ్రమలకు అవకాశమిస్తే, భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది” అని ఆయన వివరించారు. ఈ చర్య వల్ల చిన్న వ్యాపారులు, పరిశ్రమలు బలోపేతమవుతాయని, తద్వారా వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయని తెలిపారు.
– స్వదేశీ ఉద్యమం.. ఒక చారిత్రక స్ఫూర్తి
మోదీ ప్రస్తావించినట్టుగా.. స్వదేశీ ఉద్యమం అనేది కొత్తది కాదు. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ నేతృత్వంలో ఈ ఉద్యమం కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చింది. అప్పట్లో విదేశీ వస్తువులను బహిష్కరించడం ద్వారా బ్రిటిష్ వ్యాపారానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు అదే స్ఫూర్తిని మళ్లీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని మోదీ గుర్తు చేశారు.
– ఆత్మనిర్భర్ భారత్.. దేశ భవిష్యత్తుకు భరోసా
ఆత్మనిర్భర్ భారత్ అంటే కేవలం వస్తువులను తయారు చేయడం మాత్రమే కాదని, అది ఒక జాతీయ దృక్పథమని మోదీ అన్నారు. మనం ఉత్పత్తి చేసిన వస్తువులను మనమే కొనుగోలు చేస్తే, అది ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చి, కోట్లాది ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. ఇది దేశ భవిష్యత్తుకు భరోసానిస్తుంది అని ప్రధాని నమ్మకం వ్యక్తం చేశారు. నిపుణులు కూడా ఈ చర్య దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలబెట్టగలదని విశ్వసిస్తున్నారు. స్వదేశీ ఉద్యమం కేవలం ఒక నినాదం కాదని, ప్రతి భారతీయుడి జాతీయ కర్తవ్యం అని మోదీ ప్రసంగం సారాంశం.