ఏపీలో ఇపుడు వైసీపీ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు విషయంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సభకు హాజరు కాని ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయని కూడా ఆలోచిస్తున్నారు. సభా నిబంధనలు ఏమి చెబుతున్నాయని కూడా డిస్కస్ చేస్తున్నారు. స్పీకర్ అనుమతి తీసుకుని సభకు గైర్ హాజరు అయితే ఫర్వాలేదు కానీ అదే స్పీకర్ దృష్టిలో పెట్టకుండా సభకు దూరంగా ఉండడం అంటే దానిని ఏ విధంగా చూడాలి అన్నది ఇపుడు మేధావుల నుంచి అంతటా తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది.
నిజం చెప్పాలీ అంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్ హాజరు అయిన తీరు గతంలో ఎక్కడా దేశంలో ఏ సభలోనూ జరగలేదు. ఒక విధంగా ఇది కొత్తది గానే చూస్తున్నారు. సభకు ప్రతిపక్ష నాయకుడు కానీ నాయకురాలి కానీ బహిష్కరించిన సందర్బాలు అయితే ఉన్నాయి. అది తమిళనాడులో జయలలిత, ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్, ఆ తరువాత విభజన ఏపీలో జగన్, చంద్రబాబు చేశారు. అయితే వీరంతా కొత్త అసెంబ్లీ స్టార్ట్ అవుతూనే డుమ్మా కొట్టలేదని గుర్తు చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఏపీ కొత్త అసెంబ్లీ మొదలైన నాటి నుంచే సభకు రావడం మానుకుంది. దాంతోనే ఇది ఎలా డీల్ చేయాలన్నది కూడా ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది.
సభకు చెప్పా పెట్టకుండా ఏకంగా అరవై పని దినాలకు తక్కువ కాకుండా గైర్ హాజరయ్యేవారి విషయంలో ఏమి చర్యలు తీసుకోవాలన్న దాని మీద రూల్స్ కచ్చితంగా ఉన్నాయని ఉమ్మడి ఏపీలో అయిదేళ్ళ పాటు స్పీకర్ గా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు చెబుతున్నారు. వరుసగా 60 రోజులు సభకు రాని ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయొచ్చని ఆయన చెప్పారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 188, 190(4) లో స్పష్టంగా ఉందని వివరించారు.
అంతే కాదు ఈ ఆర్టికల్ ప్రకారం ఏ ఎమ్మెల్యే అయినా అనర్హత వేటుని ఎదుర్కొంటే ఆయన మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చా కూడదా అన్నది కోర్టు నిర్ణయం మేరకు మాత్రమే ఆధారపడి ఉంటుందని అన్నారు. అంటే గౌరవ సభ పట్ల సరైన తీరున స్పందించకుండా దూరంగా ఉండే సభ్యుడు మళ్ళీ ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయాలి అనేది కూడా ఇక్కడ వస్తుందని అంటున్నారు. ఒక్క అనర్హత తోనే ఈ చర్య ఆగదని కోర్టు కూడా తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీర్పు ఇస్తే మాత్రం ఆ ప్రకారంగా నడుచుకోవాల్సి ఉంటుందని యనమల వివరించారు.
యనమల ఇదే విషయం మీద మాట్లాడుతూ సభకు హాజరు కాని ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయమని ఎక్కడ ఉందని అంటున్నారని జగన్ వేస్తున్న ఈ తరహా ప్రశ్నలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 188, 190(4) ని చదువుకోవాలని సూచించారు. ఇక అప్పటికీ కూడా ఆయనకు అర్థం కాకుంటే న్యాయవాదులను అడిగి తెలుసుకోవాలని యనమల సెటైర్లు పేల్చారు. ఏ సభ్యుడైనా సభలో ప్రమాణం చేసి అసెంబ్లీని బహిష్కరిస్తామనడం కూడా అనర్హత పరిధిలోకే వస్తుందని యనమల అంటున్నారు.
ఇక స్పీకర్ అయ్యన్నపాత్రుడు కానీ డిప్యూటీ స్పీకర్ రఘురామక్రిష్ణంరాజు కానీ సభకు ఎవరైనా వరసగా గైర్ హాజరు అయితే మాత్రం వారి సభ్యత్వాలు పోతాయని స్పష్టం చేస్తున్నారు. ఆ లెక్కన చూస్తే వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలు పోతాయా అన్న చర్చ అయితే వేడిగా వాడిగా సాగుతోంది. యనమల రాజ్యాంగాన్ని ఔపాసన పట్టేశారు. స్పీకర్ గా ఆయన రూలింగ్స్ కూడా అని పెర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇపుడు ఈ మాజీ స్పీకర్ ఆర్టికల్ 188, 190(4) గురించి చెప్పడం ద్వారా అనర్హత వేటు కచ్చితంగా వేసేయవచ్చు అని క్లారిటీ ఇచ్చినట్లు అయింది అంటున్నారు. చూడాలి మరి దీని మీద స్పీకర్ ఆఫీస్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో.