మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సెటైర్లు వేశారు. ఈ నెల 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పిన ఆయన ఒకవేళ జగన్ అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఏ శాసనసభ్యుడైనా అసెంబ్లీకి కచ్చితంగా 60 రోజుల్లో ఒకసారి హాజరు కావాల్సిందేనని, లేదంటే ఆ శాసనసభ్యుడు ఆటోమెటిక్ గా తన సభ్యత్వాన్ని కోల్పోతాడని స్పష్టం చేశారు. ఈ రోజు ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘురామ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
చంటిపిల్లాడు చందమామ కోసం మారాం చేసినట్లు.. అందని ద్రాక్ష వంటి ప్రతిపక్ష నేత హోదా కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎదురుచూస్తున్నారని రఘురామ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలని, తాము ఇచ్చేది కాదని డిప్యూటీ స్పీకర్ హోదాలో తాను చెప్పదలచుకున్నానని చెప్పారు. 18 సీట్లు వస్తేనే హోదా వస్తుందని, 11 సీట్ల వచ్చిన వారికి హోదా ఇవ్వరని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండగా, కనీస సీట్లు లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెప్పడం వేరే విషయంగా రఘురామ చెప్పారు. అర్హత లేకపోయినా హోదా ఇచ్చే అధికారం తమకు లేదని చెప్పారు.
175/175 అంటూ చెప్పుకుని 11 సీట్లకే పరిమితమయ్యారని, ప్రజల అభిమానం పొందకుండా ప్రతిపక్ష హోదా ప్లీజ్ అంటూ ప్రాధేయపడుతున్నారని అన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు. ఇలా హోదా కోసం ప్రాధేయపడటం అవసరమా? అంటూ ఆయన ప్రశ్నించారు. తమకు కొన్ని రూల్స్ ఉన్నాయని, రూల్స్ ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమయంలోనే 60 రోజులు సభకు రాకపోతే జగన్ పై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని రఘురామ తేల్చిచెప్పారు. ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగన్ రెండు మూడు రోజులు మాత్రమే వచ్చారని, 37 రోజుల పాటు ఆయన సమావేశాలకు రాలేదని లెక్కలు చెప్పారు. ఈ సమావేశాలకు కూడా హాజరుకాకపోతే, వచ్చే సమావేశాల్లో ఆయనపై అనర్హత వేటు వేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.
జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నికలు రావడం ఖాయమంటూ డిప్యూటీ స్పీకర్ హెచ్చరించారు. ఎమ్మెల్యే ఎవరైనా శాసనసభను బహిష్కరిస్తే, వారు నిజంగా ఆ పదవికి అర్హత లేనట్లు భావించాలని రఘురామ అభిప్రాయపడ్డారు. అందని ద్రాక్ష కోసం అరాటపడటం సమంజసం కాదన్న రఘురామ జగన్ కన్నా వయసులో పెద్దవాడిగా, ఉప సభాపతిగా జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గతంలో ఎక్కడికెళ్లినా సిద్ధం సిద్ధం అన్నారు కదా? ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సిద్ధమా? అంటూ సవాల్ విసుతున్నారు అసెంబ్లీకి రావచ్చు కదా? అంటూ రఘురామ వ్యాఖ్యానించారు. ఉప సభాపతిగా ఎమ్మెల్యేలు అంతా సమావేశానికి రావాలని కోరుకోవడం నా బాధ్యత, నా ఆకాంక్ష. ఇక జగన్ నిర్ణయం తీసుకోవాలి. ఆయన బై ఎలక్షన్లు కోరుకుంటున్నారు. ఒకవేళ 11 స్థానాలకు ఉప ఎన్నిక జరిగితే ప్రతిపక్ష హోదా వస్తుందని ఆయన అనుకోవచ్చు. ఉప ఎన్నికలు జరిగి 11 స్థానాలు తిరిగి గెలిచినా మళ్లీ ప్రతిపక్ష హోదా రాదు ఎందుకంటే 11 స్థానాలు 18 అవ్వవు కదా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు డిప్యూటీ స్పీకర్. జగన్ మళ్లీ గెలిచినా అప్పుడు కూడా 60 రోజులు శాసనసభకు రావాల్సిందేనని స్పష్టం చేశారు.