ఆసియా కప్ లో 11వ సారి టీమ్ ఇండియా ఫైనల్ కు చేరింది.. బుధవారం బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో మన జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత ఆదివారం పాకిస్థాన్ పై కూడా విజయం సాధించిన సూర్యకుమార్ యాదవ్ సేన.. నేరుగా ఫైనల్ కు వెళ్లింది. శుక్రవారం శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ ఇక మనకు లాంచనమే. అయితే, భారత్ గెలుపుతో శ్రీలంకకు ఫైనల్ దారులు మూసుకుపోయాయి. వాస్తవానికి మూడు విజయాలతో గ్రూప్ బి టాపర్ గా సూపర్ -4కు వచ్చిన లంక.. బంగ్లా, పాక్ చేతిలో ఓటమితో వెనుకబడిపోయింది.
బుధవారం బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో టీమ్ ఇండియా ప్రదర్శన మోస్తరుగా సాగింది. బహుశా పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండడం వల్లనేమో…? మన జట్టు 20 ఓవర్లలో 168 పరుగులకే పరిమితం అయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ 37 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 5 సిక్సులతో చెలరేగాడు. మరో ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ 19 బంతుల్లో 29 పరుగులు (2 ఫోర్లు, సిక్స్) చేశాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 29 బంతుల్లో 38 పరగులు (4 ఫోర్లు, సిక్స్) తో రాణించాడు.
-బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు ఓపెనర్ సైఫ్ హసన్ 51 బంతుల్లో 69 పరుగులు చేశాడు. 3 ఫోర్లు, 5 సిక్సులు కొట్టాడు. కానీ, ఈ ఒంటరి పోరాటం సరిపోలేదు. పర్వేజ్ ఇమాన్ (21) కాస్త సహకరించినా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 18 పరుగులకే 3 వికెట్లు తీసి బంగ్లా వెన్ను విరిచాడు. ప్రధాన పేసర్ బుమ్రా (2/18) మళ్లీ జూలు విదిల్చాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 29 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు.
బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో భారత్ పవర్ ప్లే ముగిసేసరికి 72, 6.2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 77 పరుగులు చేసింది. అభిషేక్ జోరు చూస్తే 200 దాటడం ఖాయం అనిపించింది. కానీ, గిల్ ఔటయ్యాక పరిస్థితి మారింది. కెప్టెన్ సూర్య (5) మళ్లీ విఫలమయ్యాడు. ఆల్ రౌండర్ శివమ్ దూబె (2), హైదరాబాదీ తిలక్ వర్మ (5) బ్యాట్ ఝళిపించలేకపోయారు. దీంతో 168 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఓపెనర్ గా వచ్చి సెంచరీలు కొట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ను ఆసియా కప్ లో మిడిలార్డర్ లో పంపుతున్నారు. అయితే, బంగ్లాతో మ్యాచ్ లో అతడు బ్యాటింగ్ కే దిగలేదు. ఓవైపు వికెట్లు పడుతున్నా, రన్స్ రాకున్నా.. కెప్టెన్ సూర్య మాత్రం సంజూను పంపలేదు. దీనిపై అభిమానులు మండిపడుతున్నారు. స్వయంగా సూర్య ఫామ్ కూడా బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజూ ఉండగా శివమ్ దూబెను వన్ డౌన్ ఎందుకు పంపారో అర్ధం కావడం లేదని.. బౌలర్లు రాణించడంతో సరిపోయింది కానీ.. బంగ్లా సంచలనం రేపేదో అని అంటున్నారు.
భారత్ చేతిలో ఓడిన బంగ్లాకు మళ్లీ వెంటనే మ్యాచ్. గురువారం ఆ జట్టు పాకిస్థాన్ తో ఆడాల్సి ఉంది. ఇందులో గెలిస్తే ఫైనల్ కు చేరుతుంది. ఒకవేళ పాక్ నెగ్గితే ఆదివారం ఆ జట్టు భారత్ తో తుది సమరంలో తలపడుతుంది. ప్రపంచ కప్ లు సహా భారత్-పాక్ ఒకే టోర్నీలో మూడుసార్లు ఎదురుపడిన సందర్భాలు బహుశా లేవనే చెప్పాలి. కానీ, ఆసియా కప్ లో అది జరిగే చాన్సుంది.