‘అర్జున్ చక్రవర్తి’ మూవీ రివ్యూ
నటీనటులు: విజయ్ రామరాజు- సిజా జోస్- దయానంద్ రెడ్డి- అజయ్- అజయ్ ఘోష్- దుర్గేష్ తదితరులు
సంగీతం: విఘ్నేష్ భాస్కరన్
ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి
నిర్మాత: శ్రీని గుబ్బాల
రచన-దర్శకత్వం: విక్రాంత్ రుద్ర
హృద్యమైన ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం.. అర్జున్ చక్రవర్తి. విజయ రామరాజు ప్రధాన పాత్రలో విక్రాంత్ రుద్ర రూపొందించిన ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా.. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
అర్జున్ చక్రవర్తి (విజయ రామరాజు) ఒక అనాథ. చెత్త ఏరుకుని బతుకుతున్న అతణ్ని రంగయ్య (దయానంద్ రెడ్డి) అనే మాజీ కబడ్డీ క్రీడాకారుడు చేరదీస్తాడు. అతడి స్ఫూర్తితో తాను కూడా కబడ్డీ క్రీడాకారుడు కావాలని ఆ ఆటలోకి అడుగుపెట్టిన విజయ రామరాజు అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాడు. దేశానికి అనేక గొప్ప విజయాలు అందిస్తాడు. కానీ అంతా బాగుంది అనుకున్న సమయంలో పరిస్థితులు ఎదురుతిరగడం.. నా అనుకున్న వాళ్లందరూ దూరం కావడంతో అర్జున్ జీవితం మీద ఆశ కోల్పోయి.. తాగుడుకు బానిస అవుతాడు. మరి అర్జున్ జీవితంలో మళ్లీ మార్పు ఏమైనా వచ్చిందా.. చివరికి తన కథ ఏ కంచికి చేరింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
కొన్ని సినిమాల ట్రైలర్లు చూడగానే ఈ కథ ఎలా మొదలవుతుంది.. అందులో ఎలాంటి మలుపులు వస్తాయి.. చివరికి ఎలా ముగుస్తుంది అన్నది క్లియర్ గా అర్థం అయిపోతుంది. అలా ముందే కథ పూర్తిగా అర్థమయ్యేలా ట్రైలర్లో చూపించేశాక.. ప్రేక్షకులను రెండు రెండున్నర గంటలు కుదురుగా కూర్చోబెట్టాలంటే కథనంలో మ్యాజిక్ ఉండాలి. తెలిసిన సన్నివేశాలనే ఎంతో ఆసక్తి రేకెత్తించేలా ప్రెజెంట్ చేయాలి. ప్రేక్షకులు ఊహించనిది.. కొత్తగా ఇంకేదో చూపించాలి. కానీ ‘అర్జున్ చక్రవర్తి’ అలా ఆశ్చర్యపరచలేక పోయింది. ట్రైలర్ చూసి మనం ఏం ఊహిస్తామో అదే ఉంటుంది సినిమాలో. కానీ ప్రతి సన్నివేశం సిన్సియర్ గా తీసినట్లు అనిపిస్తుంది. ఆర్టిస్టులు.. సాంకేతిక నిపుణులు ఎంతో మనసు పెట్టి పని చేశారని ప్రతి సన్నివేశం చాటుతూనే ఉంటుంది. ఐతే డ్రామా పండితే రొటీన్ అయినా బండి నడిచిపోతుంది. కానీ అక్కడే అర్జున్ చక్రవర్తి తడబడ్డాడు. డీవియేషన్లు లేకుండా.. కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా.. సిన్సియర్ గా ఓ కథను చెప్పే ప్రయత్నం జరిగినా.. ఎమోషన్ వర్కవుట్ అయినా.. హీరో సహా ప్రధాన తారాగణం పెర్ఫామెన్సులు బాగున్నా.. స్లో నరేషన్ ‘అర్జున్ చక్రవర్తి’కి బలహీనతగా మారింది.
‘‘చేతిలో ఆయుధంతో, శత్రు సైన్యంతో చేసేదే యుద్ధం కాదు. ఖాళీ చేతులతో కాలే కడుపుతో చేసేదే యుద్ధం’’.. ‘‘కన్నీళ్లకు రాలిపోయే జీవితం కాదు తనది’’.. ‘నువ్వు మోస్తున్నది బరువును కాదు.. నీ గెలుపుని’’.. ‘‘మనిషికి పుట్టే ప్రేమ మనిషి కంటే గొప్పది కాదు’’.. ‘‘అవకాశం నిన్ను బలవంతుడిని చేస్తుంది. అవసరం నిన్ను బలహీనుడిని చేస్తుంది’’.. ఈ సంభాషణల్ని ఒకసారి పరిశీలిస్తే.. చాలా డెప్త్ కనిపిస్తుంది. ఇలాంటి లోతైన సంభాషణలు రాయాలంటే అందుకు తగ్గ సందర్భం కుదరాలి. సన్నివేశంలో అంత ఎమోషన్ ఉండాలి. కానీ ‘అర్జున్ చక్రవర్తి’లో డైలాగుల్లో ఉన్నంత బలం సన్నివేశాల్లో కనిపించదు. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ బాగున్నా.. వారి నోటి నుంచి మంచి మంచి డైలాగులు వస్తున్నా.. ఇంకోవైపు నేపథ్య సంగీతంతో ఫీల్ పెంచే ప్రయత్నం జరుగుతున్నా.. సన్నివేశాలు మామూలుగా సాగిపోవడంతో ఓవరాల్ ఫీల్ తగ్గుతుంది. స్పోర్ట్స్ డ్రామాల్లో చాలావరకు కథలు ఒకేలా ఉంటాయి. ఉత్థాన పతనాలను చూపిస్తూనే కథల్ని నడిపిస్తారు. చివర్లో ఒక హైతో సినిమాకు ముగింపు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎమోషన్ వర్కవుట్ అయితే ఆ కథ పండినట్లే. అర్జున్ చక్రవర్తిలో ఒక మోస్తరుగా ఎమోషన్ పండినా.. అది కడుపు నిండే స్థాయిలో లేదు. స్పోర్ట్స్ డ్రామాల్లో ఆటకు సంబంధించిన సన్నివేశాలను రసవత్తరంగా చూపించడమే అత్యంత కీలకం. ఈ అవకాశాన్ని దర్శకుడు మరింత బాగా ఉపయోగించుకోవాల్సింది. కబడ్డీ సీన్లు ఒక మోస్తరుగా అనిపిస్తాయి తప్ప రోమాలు నిక్కబొడుచుకునేలా లేవు. అందులో డ్రామాను మరింత రక్తి కట్టించాల్సింది.
అయితే ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్ధంలో అర్జున్ చక్రవర్తి మెరుగ్గా అనిపిస్తుంది. నటీనటుల పెర్ఫామెన్స్ వల్ల.. ఎమోషన్లు వర్కవుట్ కావడం వల్ల ‘అర్జున్ చక్రవర్తి’ చివరికి ఓకే అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. హీరో పడ్డ కష్టం.. మేకర్స్ పెట్టిన సిన్సియర్ ఎఫర్ట్ వల్ల ‘అర్జున్ చక్రవర్తి’ని మంచి ప్రయత్నంగా చెప్పొచ్చు కానీ.. కొంచెం నెమ్మదిగా సాగే ఈ సినిమా చూడ్డానికి కాస్త ఓపిక కావాలి.
నటీనటులు:
అర్జున్ చక్రవర్తి పాత్ర కోసం విజయరామరాజు ఎంతో కష్టపడ్డ విషయం తెరపై కనిపిస్తుంది. రకరకాల అవతారాల్లో కనిపించాల్సిన పాత్ర కావడంతో.. అందుకు తగ్గట్లుగా బరువు తగ్గడం.. పెరగడంతో పాటు అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడిగా కనిపించడం కోసం అతను ఎంత శ్రమించాడో అర్థమవుతుంది. విజయ రామరాజు నటన కూడా సిన్సియర్ గా సాగింది. కథానాయిక సిజా జోస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తన లుక్ పాత్రకు సరిపోయినా.. ఆ క్యారెక్టర్ పరిధి బాగా తగ్గిపోయింది. తన పాత్రకు కథలో అనుకున్నంత ప్రాధాన్యం కనిపించదు. చూపులతో కొంత నటించడానికి ప్రయత్నించినా సిజా పెద్దగా చేయడానికేమీ లేకపోయింది. దయానంద్ రెడ్డి కీలక పాత్రలో రాణించాడు. హీరో తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది అతనే. కోచ్ పాత్రలో అజయ్.. హీరో ఫ్రెండు క్యారెక్టర్లో దుర్గేష్ ఆకట్టుకున్నారు. నెగెటివ్ క్యారెక్టర్లో అజయ్ ఘోష్ తనకు అలవాటైన రీతిలో నటించాడు.
సాంకేతిక వర్గం:
‘అర్జున్ చక్రవర్తి’లో సాంకేతిక విభాగాలు మంచి ఔట్ పుట్ ఇచ్చాయి. మూణ్నాలుగు దశాబ్దాల కిందటి వాతావరణాన్ని జగదీష్ చీకటి తన విజువల్స్ తో బాగా చూపించాడు. కబడ్డీ విజువల్స్ ను కూడా బాగా క్యాప్చర్ చేశాడు. విఘ్నేష్ భాస్కరన్ తన నేపథ్య సంగీతంతో సన్నివేశాలను ఎలివేట్ చేయడానికి గట్టిగా కృషి చేశాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆర్ఆర్ ఉద్వేగానికి గురి చేస్తుంది. కానీ కొన్ని చోట్ల డోస్ ఎక్కువైపోయినట్లు అనిపిస్తుంది. పాటలు పర్వాలేదు. చిన్న సినిమా అయినా.. నిర్మాణ విలువలు బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ విక్రాంత్ రుద్ర ఒక మంచి కథను సిన్సియర్ గానే చెప్పే ప్రయత్నం చేశాడు. తన డైలాగులు సినిమాకు పెద్ద ప్లస్. కానీ తన నరేషన్ మరీ స్లో. తెలిసిన సన్నివేశాలనే హృద్యంగా తీయడానికి ప్రయత్నించాడు కానీ.. చాలా చోట్ల నాటకీయత ఎక్కువైపోయింది.
చివరగా: అర్జున్ చక్రవర్తి.. సోసో స్పోర్ట్స్ డ్రామా
రేటింగ్- 3/5