చంద్రబాబు నిన్నా ఇవాళా నాటి రాజకీయ నాయకుడా ఏమిటి. ఆయనది అర్ధ శతాబ్దపు చరిత్ర. రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్నారు. అపర చాణక్యుడు. వ్యూహాలలో ఆరి తేరిన వారు. అందుకే ఆయనకు అన్నీ అలా తెలుస్తాయి. ఎవరేమిటి అన్నది కూడా బాగా తెలుసు. అందుకే ఆటో కార్మికుల సేవలో పధకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆంధ్రా ఓటర్ల విలక్షణ తీర్పు మీద సునిశితమైన కామెంట్స్ చేశారు. తాము ఎన్ని చేసినా ఇంకా ఆలోచిస్తారటని ఆయన అన్నారు. అన్నీ తీసుకుని కూడా ఎవరో వచ్చి ఏదో ఇంకా తమకు చేస్తారని కూడా భావిస్తారని నవ్వుతూనే చురక అంటించారు.
దసరా దీపావళి వంటి పండుగలను చేసుకోవడమే కాదు వాటి వెనక ఉన్న నీతిని కూడా అర్ధం చేసుకోవాలని బాబు సూచించారు. దుష్టులను దూరంగా పెట్టాలని ఆయన కోరారు. దుర్మార్గులకు అవకాశమిస్తే ఏమి జరిగింది అన్నది కూడా మననం చేసుకోవాలని సూచించారు. రాజకీయ వైకుంఠపాళి లో రాష్ట్రాన్ని దించి ఇబ్బందులు పడవద్దు అని కోరారు. గత ప్రభుత్వంలో అన్ని ఇబ్బందులే ఉన్నాయని వాటిని తలచుకుని ఏమి చేస్తే మేలు అన్నది అంతా ఆలోచించాలని కోరారు.
మన వాళ్ళకు ఒక లక్షణం ఉందని బాబు నవ్వుతూనే సెటైర్లు వేశారు. ఎంత చేసినా ఎన్ని రకాలుగా ప్రయోజనం కలిగించినా కూడా ఇంకా ఆలోచిస్తూనే ఉంటారని ఆయన వస్తే ఏదో ఇస్తారని అనుకుంటారని పరోక్షంగా జగన్ గురించి ప్రస్తావించారు. ఆయన వస్తే కొత్తగా ఇచ్చేది ఉండకపోగా ఉన్నది ఎత్తేస్తాడు అన్నది గుర్తుంచుకుని మసలాలని బాబు కోరారు.
గుజరాత్ లో వరసగా పాతికేళ్ళ బట్టి బీజేపీ అధికారంలో ఉందని అందువల్లనే అక్కడ అభివృద్ధి సాగుతోందని ఆయన చెప్పారు. అలాగే దేశంలో వరసగా నరేంద్ర మోడీ మూడు సార్లు గెలుస్తూ పాలన చేస్తున్నారని స్థిరమైన రాజకీయం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని గుర్తు పెట్టుకోఅవాలని బాబు కోరారు అంతే తప్ప వేరే విధంగా ఆలోచించడం మంచిది కాదని అన్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో ఓటర్ల తీర్పు చూస్తే ప్రతీ ఎన్నికల్లో తీర్పు భిన్నంగా ఇస్తున్నారు. 2014లో టీడీపీని గెలిపించిన ప్రజలు 2019 నాటికి జగన్ కి చాన్స్ ఇచ్చారు. ఇక 2024లో కూటమిని గెలిపించిన ప్రజలు పద్ధతి ప్రకారం 2029లో వైసీపీని తెస్తారు అని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంటోంది. ప్రతీ ఎన్నికకూ పార్టీలను మార్చే ఏపీ జనాల గురించి బాగా ఎరిగిన బాబు ఈసారి ఆ తప్పులు చేయవద్దని ఒకే పార్టీని నమ్ముకోవాలని పదే పదే సూచిస్తున్నారు. మరి జనాలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.