ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. మళ్లీ బాబు వర్సెస్ జగన్ మధ్యే ఓట్ల యుద్ధం జరుగుతుందా? వారి ఫేస్ వాల్యూ… పనితీరు ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయా? అంటే.. కొందరు విశ్లేషకులు ఔననే చెబుతున్నారు. గత 2019 ఎన్నికల్లో కూడా ఇదే జరిగిందని.. పాదయాత్ర చేసిన జగన్ ఫేస్ వాల్యూ పనిచేసిందని అంటున్నారు. తర్వాత.. 2024కు వచ్చేసరికి చంద్రబాబు ఫేస్ వాల్యూతో పాటు.. ఆయన అనుభవం.. కూడా పనికి వచ్చిందని అంటున్నారు.
అయితే.. అసలు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే.. సూపర్ సిక్స్ హామీల వ్యవహారంపై క్షేత్రస్థాయిలో చర్చ సాగుతోంది. గత ఏడాది ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో.. ఉచిత సిలిండర్ల పథకం మినహా.. ఏదీ అమలు కావడం లేదని.. చంద్రబాబు ఆయా పథకాలకు మంగళం పాడేశారని.. ఇటీవల జగన్ చెప్పుకొచ్చారు. కానీ.. వాస్తవానికి కూటమి సర్కారుకు ఇంకా ఏడాది కూడా నిండలేదు. దీనిని బట్టి ఆయా పథకాలను అమలు చేసేందుకు ఇంకా సమయం ఉంది. కానీ.. వైసీపీ మాత్రం విమర్శలు చేస్తోంది.
ఈ క్రమంలోనే పథకాలు-ప్రభుత్వాలు.. అనే విషయంపై సోషల్ మీడియా సహా .. వెబ్ సైట్ ప్లాట్ ఫాంల పై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో పథకాలు ఇచ్చిన జగన్‌ను ప్రజలు చిత్తుగా ఓడించిన విషయాన్ని మేధావులు ప్రస్తావించారు. 40 శాతం మంది ప్రజలు మాత్రమే జగన్ వైపు ఉన్నారని.. 60 శాతానికి పైగా చంద్రబాబు వైపు మద్దతు తెలిపారని .. దీనిని బట్టి పథకాల ప్రభావం ఎంత ఉందని అనుకున్నా.. 33 శాతానికి మించి ఉండదని లెక్కలు వేస్తున్నారు.
ఇప్పుడు సూపర్ సిక్స్ ప్రభావం ఉంటుందని వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అనుకోవడం భ్రమేనని అంటున్నారు. “ప్రజలు తమ కాళ్లపై తాము ఆధారపడాలని కోరుకుంటారు.ప్రభుత్వం నొక్కే బటన్ల కోసం ఎదురు చూడరు. సో.. ఇప్పుడు చంద్రబాబు తొలి మాధ్యమాన్ని ఎంచుకున్నారు. ప్రజలు ఆత్మ గౌరవంతో బతికేలా చేస్తున్నారు. ఇది ఆయన ఫేస్ వాల్యూను మరింత పెంచింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఇదే పనిచేస్తుంది“ అని చెబుతున్నారు.
గోదావరి జిల్లాలు అన్నవి ఏపీలో రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనవి అన్నది తెలిసిందే. ఇక్కడ మొదలైన మార్పు ఏపీ మొత్తాన్ని చుట్టేస్తుంది. ఇక్కడ అవును అంటే ఏపీలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. కాదు అనుకుంటే మాత్రం ఇక గద్దె దిగాల్సిందే. రెండవ మాట లేనే లేదు.
అది ఈ రోజున కాదు ఉమ్మడి ఏపీగా ఉన్నప్పటి నుంచి గోదావరి జిల్లాలకు ఆ సెంటిమెంట్ ఉంది. 1983, 1985లలో తెలుగుదేశం సైడ్ తీసుకున్న గోదావరి జిల్లాలు 1989లో కాంగ్రెస్ కి జై కొట్టాయి. మళ్ళీ 1994, 1999లలో టీడీపీని గెలిపించాయి. 2004లో కాంగ్రెస్ ని 2009లో ప్రజారాజ్యానికి గోదావరి జిల్లాలు షిఫ్ట్ అయ్యాయి. ఇక 2014లో విభజన ఏపీలో టీడీపీకి జై కొట్టాయి. 2019లో వైసీపీకి గట్టి మద్దతుగా నిలిచి జగన్ ని సీఎం గా చేశాయి. ఇక 2024లో చూస్తే మాకొద్దీ వైసీపీ అంటూ ఒక్క సీటు కూడా ఫ్యాన్ పార్టీకి ఇవ్వకుండా దారుణంగా ఓడిచేశాయి.
ఇపుడు చూస్తే వైసీపీ ఓడి ఏడాది కావస్తోంది కానీ గోదావరి జిల్లాలో ఆ పార్టీ గట్టిగా నిలబడటం లేదు. ఎక్కడ చూసినా కూటమి హడావుడే కనిపిస్తోంది. గోదావరి జిల్లాలలో సహజంగానే టీడీపీకి బలం ఉంది. జనసేన వైపు ఒక బలమైన సామాజిక వర్గం మొగ్గు చూపడంతో ఆ పార్టీ కూడా ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది. ఇక బీజేపీ కూడా తన బలాన్ని ఇక్కడే పెంచుకుంటోంది. దాంతో ఈ మూడు పార్టీల బలం ముందు ఎత్తుగడల ముందు వైసీపీ నిలిచి గెలవలేకపోతోంది. వైసీపీకి ఉమ్మడి పదమూడు జిల్లాలలో అత్యంత బలహీనంగా ఉన్న ప్రాంతాలు అంటే ముందుగా చెప్పుకోవాల్సింది గోదావరి జిల్లాల గురించే అని అంటున్నారు.
మరో వైపు చూస్తే గోదావరి జిల్లాలలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు వరసబెట్టి వైసీపీకి గుడ్ బై కొట్టి వెళ్ళిపోయారు. ఇక వైసీపీకి చాలా చోట్ల నాయకత్వం బలహీనంగా ఉంది. పార్టీలో ఉన్న వారు కూడా సైలెంట్ అయిపోయారు. దాంతో పార్టీ దశ దిశ అన్నది ఎవరికీ అంతుపట్టకుండా ఉంది అని అంటున్నారు. గోదావరి జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గం రాజకీయంగా శాసిస్తూ వస్తోంది. ఇది జనసేన టీడీపీ వైపు అధికంగా ఉంది. ఇక బీసీలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వారంతా మొదటి నుంచి టీడీపీని వెన్నుదన్నుగా ఉన్నారు. అగ్రవర్ణాలు క్షత్రియులు బీజేపీకి సపోర్ట్ గా ఉన్నారు.
అదే సమయంలో ఎస్సీలు కూడా గణనీయంగా ఉన్నారు. వారు వైసీపీ వైపు ఉన్నారు. వైసీపీ తన బలాన్ని సామాజిక వర్గాల పరంగా పెంచుకోవాలంటే ముందు వ్యూహాలను మార్చుకోవాలని అంటున్నారు. 2019లో మాదిరిగా బీసీలు కాపులను తిరిగి ఆకట్టుకోవాలంటే కొత్త రకం పాలిటిక్స్ ని స్టార్ట్ చేయాలని గతంలో చేసిన పొరపాట్లను రిపీట్ చేయకుండా ఉండాలని అంటున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ చూపు కూడా గోదావరి ఝిల్లాల వైపు ఉందని అంటున్నారు. పొలిటికల్ సెంటిమెంట్ గా ఉన్న గోదావరి జిల్లాలలో కనుక పార్టీ యాక్టివ్ అయితే ఏపీలో మళ్ళీ అధికారానికి ఆస్కారం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. దాంతో గోదావరి జిల్లాల నుంచే పార్టీలో కీలక స్థానాలలో అవకాశాలు ఇస్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పీఏసీ మెంబర్ గా తీసుకోవడం అందులో భాగమే అని అంటున్నారు
అలాగే బీసీలను కూడా దగ్గరకు చేర్చుకునే ప్రక్రియ స్టార్ట్ చేశారు. వైసీపీ ఓటు బ్యాంక్ గా ఉన్న ఎస్సీలని గౌరవించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వచ్చే ఏడాది జూలై 7, 8 తేదీలలో రెండు రోజుల పాటు వైసీపీ ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే పార్టీలో సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ఈ ప్లీనరీ ఎక్కడ అన్న చర్చ కూడా మొదలైంది. అయితే వైసీపీ ప్లీనరీకి సరైన వేదిక గోదావరి జిల్లాలు అని అంటున్నారు. గోదావరి వాకిట నిలిచి వైసీపీ రాజకీయ బలాన్ని అటు ప్రత్యర్ధులకు ఇటు రాష్ట్రం మొత్తానికి చూపించడం ద్వరా తన స్టామినాను పెంచుకుని 2029లో అధికారంలోకి రావాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. ఇక జగన్ తొందరలో ప్రారంభించే జిల్లాల టూర్లను కూడా గోదావరి జిల్లాల నుంచే మొదలెడతారు అని అంటున్నారు. చూడాలి మరి గోదావరి జిల్లాలు ఈసారి ఏ ఫేస్ ఏ టర్నింగ్ ఇచ్చుకుంటాయో.