వచ్చే జనవరిలో అంటే మరో మూడు నెలల్లో ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చిన మూడు పార్టీల కూటమి.. స్థానిక ఎన్నికల్లో మొత్తం అన్ని స్థానాలను స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని సిద్దం చేస్తున్నారు. ప్రధానంగా టీడీపీ, జనసేన ఇప్పటికే తమ పార్టీ కార్యకర్తలను స్థానిక ఎన్నికలకు సన్నద్దం చేసేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించి దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీలో ఎటువంటి కదలిక కనిపించడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో నిరాశ, నైరాశ్యంలో కూరుకుపోయిన వైసీపీకి మళ్లీ నూతన జవసత్వాలు అందించాలని ఆ పార్టీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ అధినేత జగన్ తరచూ పార్టీ పీఏసీ సమావేశాలు నిర్వహిస్తూ జిల్లాల్లో పార్టీని నడిపే విషయంలో దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే రాష్ట్రస్థాయిలో బడా నాయకులతో పార్టీ బలంగా కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు పెద్దగా మార్పు రాలేదని అంటున్నారు. పీఏసీ సమావేశాలకు వస్తున్న నేతలు జిల్లాల్లో పార్టీని నడపడంలో పెద్దగా చొరవ తీసుకోవడం లేదన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. చాలా నియోజకవర్గాల్లో నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పరిస్థితి తయారైందని అంటున్నారు.
ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేసింది వైసీపీ అగ్ర నాయకత్వం. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ 80 మందిలో ఎక్కువ మంది నేతలు ఆ నియోజకవర్గాలను వదిలేసినట్లు చెబుతున్నారు. కొత్తగా అవకాశం దొరికిన వారు మాత్రమే ఆయా నియోజకవర్గాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి దిశానిర్దేశం చేసే నాయకులు చాలా చోట్ల కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో మూడు నెలల్లోనే ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా, ప్రతిపక్ష పార్టీ ఒకసారి కూడా ఈ విషయమై ఫోకస్ చేయని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి పోటీకి నేతలు వెనక్కి తగ్గుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జనవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత జిల్లా, మండల పరిషత్తులు, ఆ వెంటనే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. మూడు పార్టీల నేతలు కూడా క్షేత్ర స్థాయిలో సమస్యలపైనా ప్రజలతో మమేకమయ్యే అంశాలపైనా ఫోకస్ చేశారని అంటున్నారు. అయితే ప్రతిపక్షం మాత్రం క్షేత్రస్థాయిలో ఎటువంటి చొరవ చూపలేకపోతోందని అంటున్నారు. దీనికి కారణం చాలాచోట్ల నాయకత్వం లేకపోవడమే అంటున్నారు. అధినాయకత్వం కల్పించుకుని ఆయా నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తేనే పోటీకి నాయకులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.