విశాఖలో పెట్టుబడుల సదస్సు ఊహించిన దాని కన్నా ఎక్కువగా విజయవంతం అయింది. ప్రపంచ నలుమూలల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు వచ్చారు. వచ్చినవారందరూ ఎంవోయూలు చేసుకోరు. అలాగే ఎంవోయలు చేసుకున్న వాళ్లంతా పెట్టుబడులు పెట్టరు. కానీ ఓ గ్రౌండ్ అయితే ఏర్పాటవుతుంది.దాని ద్వారా ప్రభుత్వం,అధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపి.. పెట్టుబడుల్ని గ్రౌండ్ అయ్యేలా చేసుకోవాల్సిన ఉంటుంది. ఈ విషయంలో ఎంవోయూల కోసం ఎంత కష్టపడ్డారో.. అంతకు మించి ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు కష్టపడాల్సి ఉంటుంది.
పదమూడు లక్షల కోట్లకుపైగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. వీటిలో మరో ఏడాదిలో సగం అయినా గ్రౌండింగ్ ప్రారంభిస్తే.. ఉద్యోగాలు రావడం ప్రారంభమవుతుంది. చాలా కంపెనీలు తమ ప్లాంట్ నిర్మించడం ప్రారంభించిన ఏడాది, రెండేళ్లలోనే ఉత్పత్తులు ప్రారంభిస్తాయి. కొన్ని కొన్ని కంపెనీలకు అది కూడా అవసరం లేదు. ఇంకా వేగంగా ఉత్పత్తి ప్రారంభించగలవు. అందుకే ఈ ఒప్పందాలు చేసుకున్న కంపెనీలన్నీ అసలు పెట్టుబడులతో వచ్చేలా ప్రభుత్వం చాలా కేర్ ఫుల్‌గా ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది.
చాలా కంపెనీలు..తమ భవిష్యత్ అవసరాల కోసం .. ఓ ప్లాంట్ ఓ ప్రాంతంలో పెట్టాలనుకున్నప్పుడో …విస్తరణ కోసమో ప్రయత్నించినప్పుడు.. ఇలా అనుకుని అలా పనులు ప్రారంభించలేవు. ఎంతో ప్రాసెస్ ఉంటుంది. ఆ క్రమంలో ప్రభుత్వాల నుంచి వారికి వచ్చే రాయితీలు, ఇన్సెంటివ్స్ కూడా ముఖ్యమే. కొన్ని వ్యాపార సంస్థలు గొంతెమ్మ కోరికలు కోరుతాయి. అలాంటి వాటిని ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించలేవు. మధ్యలో డ్రాప్ కావాల్సి ఉంటుంది. మనుషుల్లో రకరకాల మనస్తత్వాలు ఉన్నట్లే.. కంపెనీల యాజమాన్యాల్లోనూ ఉంటాయి. అయితే వారిని సరిగ్గా డీల్ చేయాల్సిన పద్దతిలో డీల్ చేస్తే.. సక్సెస్ రేటు ఎక్కువగాఉంటుంది.
ప్రభుత్వం పదమూడు లక్షల కోట్లకుపైగా ఒప్పందాలు చేసుకుంది. ఇది అద్భుతమే. కానీ వైసీపీ హయాంలో చేసుకున్నట్లుగా ఇవి ప్రచార ఒప్పందాలు కాకూడదంటే వెంటనే.. ఓ ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించాలి. ఇన్వెస్టర్స్ సమ్మిట్లో మాత్రమే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకున్న ఎంవోయూలన్నీ అందులో పెట్టాలి. అవి ఎంత వరకూ గ్రౌండ్ అవుతున్నాయి… ఎంత మేర పనులు చేస్తున్నాయి.. ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభిస్తాయన్నది స్టేటస్ రిపోర్టు అందులో ఉండాలి. అలాగే ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పించిన్నది కూడా చెప్పగలగాలి. అంత పారదర్శకత పాటిస్తే.. ప్రజలకు కూడా జరుగుతున్న ప్రచారానికి.. వాస్తవికత ఏమిటో అంచనా వేసుకోగలుగుతారు.
ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడం నారా లోకేష్ టార్గెట్. తాము ఇచ్చేశామని చెప్పుకుంటే ఎవరూ నమ్మరు. తాము తెచ్చిన కంపెనీలు.. వచ్చిన ఉద్యోగాలు.. ఆ ఉద్యోగాల్లో కుదురుకున్న నిరుద్యోగుల పూర్తి సమాచారం.. అందుబాటులో ఉండాలి. అప్పుడు.. పడిన కష్టానికి సార్థకత లభిస్తుంది. లేకపోతే బూడిదలో పోసిన పన్నీరవుతుంది.
విశాఖ సీఐఐ భాగస్యామ్య సదస్సుకు అంచనాలకు మించిన స్థాయిలో పెట్టుబడులపై ఎంఓయూలు కుదిరాయి. మూడు రోజుల పాటు కుదుర్చుకున్న ఒప్పందాల విలువ రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు కాగా వీటి ద్వారా 16,31,188 ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలు కన్పిస్తున్నాయి. రెండు రోజుల్లో సుమారుగా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తే… పారిశ్రామిక తగ్గేదెలే అన్నట్టుగా విశాఖ నగరానికి పోటెత్తారు. ఒప్పందాల విలువ రూ. 13 లక్షల కోట్లకు పైగా చేరింది. దీంతో ప్రభుత్వ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది.
సగానికి పైగా ఒప్పందాలు ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భారీ ఎత్తునే పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పెట్టుబడుల్లో టాప్-3లో ఇంధన రంగం, పరిశ్రమలు, మౌళిక వసతుల రంగాలు నిలిచాయి. మొత్తంగా రూ. 13.25 లక్షల కోట్ల మేర పెట్టుబడుల్లో అధిక భాగం ఇంధన రంగానికి వచ్చాయి. ఈ రంగంలో రూ. 5,33,351 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత పరిశ్రమల రంగానికి రూ. 2,80,384 కోట్లు, మౌళిక వసతుల రంగానికి రూ. 2,01,758 కోట్లు వచ్చాయి.
సీఐఐ సదస్సు కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే కాదు. మేధోపరమైన చర్చలకు, వినూత్న ఆవిష్కరణల్ని పంచుకునేందుకు కూడా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశవిదేశాల నుంచి పారిశ్రామికవేత్తల్ని, మేధావుల్ని, విదేశీ ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించామని సీఎం తెలిపారు. శ్రీసిటిలో 240 యూనిట్లు ప్రస్తుతం ఉన్నాయి. మరో 4 వేల ఎకరాలను అందుబాటులోకి తెస్తున్నాం .. క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేసి దానిని మనం అందిపుచ్చుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు 19-24 ఓ బ్యాడ్ పిరియడ్, పరిశ్రమల్ని మూసేయించారు. ఏపీ నుంచి తరిమేశారు. ఈ వ్యవహారాలన్నిటినీ 18 నెలల్లోనే సరిచేయగలిగామన్నారు. 10 ఏళ్లలో 1 ట్రిలియన్ డాలర్లు కోటిమందికి ఉద్యోగాలు తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.


















