అధికారంలో ఉన్న వారు.. ప్రజలను పాలించడమంటే.. వారిపై పెత్తనం చేయడం కాదు. ప్రజల మనసు తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటం స్మూత్ గవర్నెన్స్ లో కీలకం. ఈ విషయంలో చాలామంది ముఖ్యమంత్రులు విఫలమవుతున్నారు. తాము తీసుకున్న నిర్ణయాలే ఫైనల్, అదే అమలు జరగాలి అన్న ఆలోచనతో కొందరు వ్యవహరించి.. అభాసుపాలైన విషయం తెలిసిందే. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా ఆయన వెనక్కి తగ్గలేదు.
అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా తమ స్థలాలకు సంబంధించిన పట్టాలపై జగన్ ఫోటోలు వేయడాన్ని చాలామంది నిరసించారు. ఏకంగా జగన్ సతీమణి భారతిని ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా, జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అంటూ మొండిగా ముందుకు సాగారు. ఇది ఎన్నికల సమయంలో తీవ్ర ఇబ్బంది కలిగించింది. ఇక, ఎంతో సీనియర్ పొలిటీషియన్, దేశంలోనే ప్రస్తుతం ఉన్న నాయకుల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు సీఎం చంద్రబాబు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
తను తీసుకున్న నిర్ణయం అమలు చేయాలని ఆయనకి ఉన్నప్పటికీ ప్రజల నుంచి ఏమాత్రం నిరసన వ్యక్తమైనా, సదరు నిర్ణయాన్ని ప్రజలు హర్షించకపోయినా ఆయన వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. ఎక్కడ భేషజాలకు పోకుండా సదరు నిర్ణయంలో తప్పులు ఉంటే కచ్చితంగా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జనం మనసును ఆకట్టుకుంటోంది. ఒకరకంగా చెప్పాలంటే జనం గుండెల్ని చంద్రబాబు జ్యూస్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. తాజాగా అనర్హులకు పింఛన్లు ఇస్తున్నారన్న కారణంతో ఓ అధికారి ఇచ్చిన సలహా మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు అదేవిధంగా వృద్ధుల పింఛన్లను చాలామందిని తొలగించారు. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. నిరసనలు కూడా తెరమీదకు వచ్చాయి. దీంతో స్పందించిన చంద్రబాబు అసలు ఇట్లాంటి సలహా ఇచ్చిన అధికారి ఎవరు అని ఆరా తీసి ఆయనకు అక్షింతలు వేయడంతో పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాలని అధికారులను ఆదేశించారు.
దీంతో రాష్ట్రంలో తలెత్తిన సమస్య పోయింది. వచ్చే నెల నుంచి అందరికీ పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక రెండో కీలక నిర్ణయం.. కరెంటు చార్జీలు. ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అయింది. జగన్ హయాంలో భారీ ఎత్తున కరెంటు చార్జీలు పెరిగిపోయాయని భరించలేకపోతున్నామని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో నడిస్తే ఎలా అంటూ చాలా చోట్ల ప్రజలు విమర్శలు గుప్పించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు అవసరమైతే ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇవ్వడంతో ప్రజలకు ఊరట కలిగింది.
ఇక సూపర్ సిక్స్ లో కీలకమైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో కూడా ప్రజల మనసును గుర్తుపెట్టుకుని ప్రజలు కోరుకుంటున్నా విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. వాస్తవానికి మొదట్లో కేవలం మండలాలకి లేదా జిల్లాలకు మాత్రమే ఉచిత బస్సులు పరిమితం చేయాలని ప్రభుత్వం భావించింది. ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నారు. కానీ, ప్రజల నుంచి దీనిపై విమర్శలు వచ్చాయి. ఉచిత హామీ ఇచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్లు తెరమీదకు వచ్చాయి. దీన్ని పరిశీలించిన చంద్రబాబు ఎంత ఖర్చు అయినా వెనకాడాల్సిన అవసరం లేదని సంపద వేరే రూపంలో సృష్టిస్తామని పేర్కొంటూ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఇది అమలు అవుతుంది కూడా. ఇలా చంద్రబాబు ప్రజల మనసును తెలుసుకొని స్మూత్ గవర్నెన్స్‌లో నెంబర్ వన్ సీఎంగా నిలబడుతున్నారనేది పార్టీ నాయకులు చెబుతున్న మాట.